సర్కారు బడులకు సరికొత్త సొబగులు
By:-యన్. భీమ్ కుమార్


కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలే మారిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. మన ఊర్లలోని ప్రభుత్వ బడులను మనమే బాగు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఏడు వేల కోట్ల రూపాయల నిధులతో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో 678 ప్రభుత్వ పాఠశాలలకుగాను మొదటి విడతలో 237 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోని 214, పట్టణ ప్రాంతంలోని పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 141 ప్రాథమిక పాఠశాలలు, 36 ప్రాథమికోన్నత పాఠశాలలు, 60 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 82.15 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహారీ గోడ నిర్మాణాలతోపాటు తాగు నీటి వసతితోపాటు తరగతి గదులకు మరమ్మతులు, వంట గది నిర్మాణం, డైనింగ్ హాల్, విద్యుత్, ఫర్నీచర్, పెయింటింగ్, బ్లాక్ బోర్డు, ఇంకా డిజిటల్ విద్యకు సంబంధించిన పనులను చేపడుతున్నారు.
ప్రతి మండలంలో రెండు చొప్పున 37 మోడల్ పాఠశాలలుగా గుర్తించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా పాఠశాలలకు సరికొత్త సొబగులను అద్ది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు పాఠశాల ఆవరణలోకి అడుగు పెట్టగానే సరికొత్త అనుభూతిని కలిగించేలా తీర్చిదిద్దుతున్నారు.
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్నాం – జిల్లా కలెక్టర్
‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులను సకాలంలో పూర్తి చేస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాందా(టి), గుడిహత్నూర్ మండలం కొల్హరీ, మన్నూర్ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మన ఊరు – మన బడి కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగవంతం చేయడంతో పాటు సుందరీకరణ, మొక్కల పెంపకం, తదితర పనులను పాఠశాల ఉపాధ్యాయలు నిర్వహిస్తున్నారు. పనులను స్థానిక పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీలు, సర్పంచులు, పాఠశాల ఉపాధ్యాయులు పర్యవేక్షించడంతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడం జరుగుతు న్నాయి. త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నిర్వహణ పనులను చేపడుతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు విద్యా శాఖకు కేటాయిస్తున్నదని, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగపరచుకొని మంచి ర్యాంకులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.