రాష్ట్ర రహదారులకు మహర్దశ

రాష్ట్ర రహదారులకు మహర్దశ పట్టబోతున్నది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పలు జాతీయ రహదారులు ప్రారంభించడంతో పాటు మరి కొన్ని రహదారులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే రీజినల్‌ రింగ్‌రోడ్‌ లాంటి బృహత్తర పథకానికి కూడా భూసేకరణ జరిపితే నిధులు మంజూరీ చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ సాగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఎంతో అభివృద్ధికి నోచుకోనున్నాయి. రాష్ట్రంలోని 8 జాతీయ రహదారుల నిర్మాణానికి భూమిపూజ చేయగా, 6 ప్రాజెక్టులను కేంద్ర మంత్రి వర్చువల్‌ ద్వారాజాతికి అంకితం చేశారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మంచి రహదారు అవసరమన్నారు. అందుకు భారత ప్రభుత్వ సహకారం కావాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, 25 రాష్ట్ర రహదారులను జాతీయ రహ దారులుగా మార్చడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారన్నారు. 3135 కిలోమీటర్ల పొడవున్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడానికి ఎపి పునర్వ్య వస్థీకరణ చట్టంలో చేర్చారని, వీటిలో ఇప్పటివరకు 1366 కిలోమీటర్ల పొడవు మాత్రమే జాతీయ రహదారులుగా మార్చారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. 1769 కిలోమీటర్లు ఇంకా పెండిరగ్‌లో ఉందన్నారు. 3.49 కిమీ /100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత జాతీయ సగటు 4.01 కిమీ / 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కన్నా చాలా తక్కువగా ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. దీన్నిబట్టి తెలంగాణ రాష్ట్రంలో కనీసం 1000 కిలోమీటర్ల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

చౌటుప్పల్‌ (ఎన్‌హెచ్‌ -65), షాద్‌ నగర్‌ (ఎన్‌హెచ్‌ -44), కంది (ఎన్‌హెచ్‌ -65) (ఆర్‌ఆర్‌ఆర్‌ యొక్క దక్షిణ భాగం) 182 కి.మీ, హైదరాబాద్‌ (గౌరెల్లీ జంక్షన్‌)-వలిగొండ-తొర్రూర్‌-నెల్లికుదురు-మహాబూబాబాద్‌-ఇల్లెందు-కొత్తగూడెం 234కి.మీ, మెదక్‌-యెల్లారెడ్డి-రుద్రూర్‌ 92 కి.మీ., బోధన్‌-బాసర-భైన్సా 76 కి.మీ., మెదక్‌ – సిద్దిపేట – ఎల్కతుర్తి 133 కి.మీ. మహబూబ్‌నగర్‌ – కొడంగల్‌ – తాండూర్‌ – చిచోలి 96కి.మీ., కరీంనగర్‌-కామారెడ్డి-యెల్లారెడ్డి-పిట్లం 165 కి.మీ., కొత్తకోట-గద్వాల్‌-మంత్రాలయం 70 కి.మీ., జహీరాబాద్‌-బీదర్‌-డెగ్లూర్‌ 25 కి.మీ. మొత్తం 1073 కి.మీ. గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గత 6 సంవత్సరాలలో దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మంత్రి గడ్కరీ చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు.

1364 కోట్ల రూపాయల వ్యయంతో 766 కిలోమీటర్ల పొడవున 14 ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వీటిలో ఆరు జాతికి అంకితం అవుతుండగా, మిగిలిన 8 ప్రాజెక్టులు షెడ్యూల్‌ ప్రకారం పూర్తవుతాయని మేము ఆశిస్తున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక రీజనల్‌ రింగ్‌రోడ్‌ గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుపోయారు. సంగారెడ్డి – నర్సాపూర్‌ – తుప్రాన్‌ – గజ్వెల్‌ -జగదేవ్‌పూర్‌ -భువనగిరి -చౌటుప్పల్‌ (158.00 కి.మీ) మరియు చౌటుప్పల్‌- షాద్‌నగర్‌-కంది (181.87 కి.మీ) 2016 సంవత్సరంలో జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయడానికి అంగీకరించినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్ళారు. ఈ రెండు రహదారులు కలిసి హైదరాబాద్‌ నగరం చుట్టూ హైదరాబాద్‌ నుండి 50 నుండి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 6 జిల్లాల గుండా వెళుతున్నా యని, ఈ రోడ్‌ ద్వారా హైదరాబాద్‌పై ట్రాఫిక్‌ వత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. మొత్తంగా 9 రాష్ట్ర రహదారులను కొత్త జాతీయ రహ దారులుగా ప్రకటించాలని మంత్రి కోరారు. రెండు కారిడార్లలో 340 కిలోమీటర్ల పొడవైన ప్రాంతీయ రింగ్‌రోడ్‌ ప్రాజెక్టును మంజూరు చేయాలని, రాష్ట్ర పునర్వ్య వస్థీకరణ చట్టంలో వాగ్దానం చేసిన విధంగా రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారి నెట్‌వర్క్‌ అభి వృద్ధికి సహాయం చేయాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల విలువైన సిఆర్‌ఐఎఫ్‌ పనులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కోరారు.

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను సత్వరం పూర్తిచేస్తే వచ్చే ఐదేళ్లలో రూ. 28వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రతి పాదిత ప్రాజెక్టులకు 5,627 హెక్టార్ల భూ సేకరణ అవసరం కాగా, 160 హెక్టార్లు మాత్రమే పూర్తయిందని తెలిపారు. జాతీయ రహ దారుల ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ, భూ సేకరణపై సమీక్ష నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

హైదరాబాద్‌-విజయవాడ రహదారిని 8 లేన్‌లుగా విస్తరిం చేందుకు చర్యలు తీసుకుంటామని, కరీంనగర్‌-వరంగల్‌ రహ దారిని 4 లేన్‌లుగా విస్తరించేందుకు అనుమ తులు మంజూరు చేసినట్లు వెల్లడిరచారు. రెండు జాతీయ ప్రాజెక్టులను అనుసంధా నించే హైదరాబాద్‌ ప్రాంతీయ రింగ్‌రోడ్డు సమస్యను సీఎం కేసీఆర్‌తో చర్చించి పరిష్కరిస్తామని ప్రకటించారు. పురోగతిలో ఉన్న జాతీయ రహదారుల విస్తరణ పనులను దశల వారీగా 2022 అక్టోబరులోగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఆరు లేన్‌లుగా చేపట్టిన ఆరాంఘర్‌-శంషాబాద్‌ రహదారిని 2021 డిసెంబరు లోగా, ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను మే 2022 కల్లా పూర్తిచేస్తామ న్నారు. ప్రతిపాదిత జాతీయ రహదారులు అందుబాటులోకి వస్తే తెలంగాణ పారిశ్రామి కంగా కూడా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిల్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు పాల్గొన్నారు.