|

ఇప్పుడు భారత్‌ అగ్రదేశాల చెంతన డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో 24 వేల కోట్ల పెట్టుబడి

భారత దేశ చరిత్రలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు భారీ పెట్టుబడి దక్కింది. 24 వేల కోట్ల రూపాయలను తెలంగాణలో డిస్‌ప్లే ఫ్యాబ్‌ కోసం పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఎలెస్ట్‌ కంపెనీ ప్రకటించింది.  ఈ మేరకు బెంగళూరులో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలెస్ట్‌ కంపెనీ ఇప్పుడు రాష్ట్రంలో ఈ డిస్‌ప్లే ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నది. దేశంలో ఫ్యాబ్‌ రంగంలో పెట్టుబడి పెడుతున్న తొలి కంపెనీగా ఎలెస్ట్‌ చరిత్రకెక్కనున్నది. ఎలెస్ట్‌ కంపెనీ ప్రపంచ ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో ఒకటైన రాజేష్‌ ఎక్స్‌పోర్ట్‌ ద్వారా ఏర్పాటు చేయబడిరది. ఎలెస్ట్‌ కంపెనీ అమోలెడ్‌ డిస్‌ప్లే, లిథియం అయాన్‌ సెల్స్‌, బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిరది. డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో ఉన్న ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల శాస్త్ర సాంకేతికతల మేరకు తన ఉత్పత్తులను తయారు చేయనున్నది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం (6th Generation) అమోలెడ్‌ డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఉత్పత్తి కోసం 24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనున్నది. ఈ పెట్టుబడి ద్వారా స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్లతో పాటు లాప్‌టాప్‌ల వంటి డిస్‌ప్లేలను తయారు చేయనున్నది.

డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు రానున్న ఈ పెట్టుబడి ద్వారా కేవలం తెలంగాణను మాత్రమే కాకుండా మన భారతదేశాన్ని సైతం చైనా, అమెరికా, జపాన్‌ వంటి అతికొద్ది దేశాల సరసన నిలబెడుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈరోజు తెలంగాణకు వస్తున్న ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా గర్వకారణమన్నారు. భారతదేశ సెమీకండక్టర్‌ మిషన్‌ ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఫ్యాబ్‌ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఈ రోజు తమ కృషి ఫలించి, ఎలెస్ట్‌ కంపెనీ పెట్టుబడి ప్రకటన చేసిందన్నారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, ఈకోసిస్టం వంటి దాని అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఈ అతిపెద్ద పెట్టుబడి ప్రకటన తర్వాత సెమీ కండక్టర్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలువబోతున్నదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తాము ఏర్పాటు చేయబోతున్న డిస్‌ప్లే ఫ్యాబ్‌  వలన ప్రపంచంలోనే అత్యుత్తమ గ్లోబల్‌ టాలెంట్‌ ను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌ లో 3000 మంది సైంటిస్టులు, ఇతర అత్యాధునిక టెక్నాలజీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన రాజేష్‌ ఎక్స్‌పోర్ట్‌ ఛైర్మన్‌ రాజేష్‌ మెహతా అన్నారు. దీంతోపాటు డిస్‌ప్లే ఫ్యాబ్‌ భాగస్వాములు, ఈ రంగ అనుబంధం సంస్థలు, సరఫరాదారుల వంటి రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తమ ఎలెస్ట్‌ కంపెనీ, ఆరవతరం అమోల్డ్‌ డిస్‌ప్ల్లే తయారీ ద్వారా భారతదేశం నుంచి గొప్ప ఫ్యూచర్‌ టెక్నాలజీని ప్రపంచానికి అందించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, డైరెక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌ సుజయ్‌ కారంపురి, ఎలెస్ట్‌ సీఈఓ శ్యామ్‌ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాబ్‌ రంగంలో ఎలెస్ట్‌ కంపనీ పెడుతున్న భారీ పెట్టుబడి మూలంగా, మన దేశం అగ్రరాజ్యాల సరసన నిలిచింది.