రుక్కమ్మ హోటల్‌

By: జింబో

మా రాజేశ్వరుని గుడి ముందు వున్న ద్వారాన్ని ఆనుకొని ఓ రోడ్డు వుంది. అది గోకుల్‌ టాకీస్‌ వెనుకవైపుకి దారి తీస్తుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే జగిత్యాల బస్టాండ్‌ వుంటుంది. మా వేములవాడలో ప్రధాన బస్టాండ్‌ ఒక్కటే. అది కాకుండా మరో రెండు బస్టాండ్‌లు వున్నాయి. ఒకటి జగిత్యాల బస్టాండ్‌. రెండవది కోరుట్ల బస్టాండ్‌. ఒకటి తూర్పు వైపు వుంటే రెండవది పడమర వైపు వుంటుంది.

గుడి ద్వారం నుంచి కాస్త ముందుకు వెళితే మరో సందు వుంటుంది. ఇదే ముఖ్యమైన సందు. ఇది జాతరా గ్రౌండ్‌కి దారి తీస్తుంది. ఈ సందు ఎప్పుడూ రద్దీగా వుంటుంది. ఈ సందుకి రెండువైపులా స్టీల్‌ సామాన్‌ దుకాణాలు వుంటాయి. ఆ సందులో ఓ రెండు హోటల్లు, మూడు ఫోటో స్టూడియోలు. ఫోటో ఫ్రేమ్‌ల దుకాణాలు, గాజుల దుకాణాలు, తియ్యటి బత్తీసలు అమ్మే స్వీట్‌ దుకాణాలు, కుంకుమ దుకాణాలు, వైన్‌ షాపులు ఒక్కటేమిటీ ఎన్నో, కాస్త ముందుకు వెళితే గోకుల్‌ టాకీస్‌, ఇంకా ముం దుకు వెళితే ప్రకాశ్‌ టాకీస్‌. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కట్టిన సత్రం, ఘంటశాల గద్దె మట్టెల దుకాణాలు, పేలాల దుకాణాలు. చిన్న చిన్న హోటళ్ళు. వీరేశం బజ్జీల దుకాణం కోళ్ళ షాపులు. అదో గొప్ప ప్రపంచం. చూడాల్సిందే కానీ చెప్పడానికీ, వర్ణించడానికీ వీలు కాదు.

మా గుడి ముందు నుంచి ఇంకా కాస్త ముం దుకు వెళితే ఐదారు దుకాణాల తరువాత మరో సందు. ఆ సందు మహాలక్ష్మమ్మ గుడివైపుకి దారి తీస్తుంది. దసరా రోజు జమ్మికోసం వెళ్ళే దారి అది. దసరా నాడు మా రాజేశ్వరుని సేవ ఆ దారి గుండానే జమ్మి దగ్గరికి వెళ్తుంది. అందరమూ ఆ దారి గుండానే జమ్మికి వెళదాం. హరిహరులని దర్శించుకుంటాం. జమ్మి తెచ్చుకుంటాం. వూరి వాళ్ళందరినీ కలుస్తాం. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటాం.

ఆ సందులో కూడా ఓ హోటల్‌ వుంది. అదే రుక్కమ్మ హోటల్‌. ఆమె హోటల్‌ వ్యాపారంలోకి ఎలా వచ్చిందో మాకు తెలియదు. దసరా రోజు మాత్రమే మేం సాధారణంగా ఆ దారి గుండా వెళతాం. అప్పుడే ఆ హోటల్‌ని చూసే వాళ్ళం. ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళం. జాతరా గ్రౌండ్‌ సందుతోనే మాకు ఎక్కువ అనుబంధం. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి ‘లా’ చదువు పూర్తయ్యేంత వరకు సెలవుల్లో వేములవాడ ఎప్పుడు వచ్చినా రోజూ ఆ సందులోకి వెళ్ళాల్సిందే. ఆ సందులో వున్న హోటళ్ళలో కూర్చుని ‘చాయ్‌’లు తాగి గంటల తరబడి మాట్లాడు కోవాల్సిందే. ఆ సందులోని ప్రధాన హోటళ్ళు రెండు. మొదటిది ఉడిపి హోటల్‌. రెండవది నటరాజ్‌ హోటల్‌. ఉడిపి హోటల్‌ యజమాని రాజు. నటరాజ్‌ హోటల్‌ యజమాని నర్సయ్య. ఆ సందులో కుడివైపున ఉడిపి హోటల్‌ వుండేది. ఎడమ వైపున నటరాజ్‌ హోటల్‌ ఉండేది. ఉడిపి హోటల్‌లోని ముందు సీట్లలో కూర్చొని ఎక్కువగా చాయ్‌లు త్రాగేవాళ్ళం. ఆ సీట్లు ఖాళీ లేకపోతే నటరాజ్‌ హోటల్‌కి వెళ్ళే వాళ్ళం.

సాహిత్యం మీద అభిరుచి ఏర్పడిన తరువాత మా సాహితీ చర్చలు, రాజకీయ చర్చలు అన్నీ అక్కడే జరిగేవి. ఆ రెండు హోటళ్ళ యజ మానులు మా చర్చలని శ్రద్ధగా వినేవాళ్ళు. ఎంత సేపు కూర్చున్నా ఏమీ అనకపోయే వాళ్ళు. నటరాజ కళానికేతన్‌ పేరుతో మేం సాహితీ సంస్థని పెట్టిన తరువాత మా గెస్టు లని అక్కడికే అప్పుడప్పుడూ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఆదివా రం, సోమవారం రోజూ మా సాహితీ చర్చలు రెండు మూడు గంటలపాటూ కొనసాగేవి. తాగేవి రెండు చాయలు. అక్కడ గడిపేది రెండు గంటలు. ఆ హోటళ్ళు మాకు లైబ్రరీలాగా వుండేవి. అన్ని దినపత్రికలు అక్కడికి వచ్చేవి. ఒక దాని తరువాత ఒకటి చదివి, అందులో వచ్చిన కవితల గురించి, కథల గురించి మా చర్చలు కొనసాగేవి. అవి లేని రోజున రాజకీయాల గురించి, సినిమాల గురించి కొనసాగేవి.

ఈ రెండు హోటళ్ళకే మేం ఎక్కువ వెళ్ళేవాళ్ళం. మరీ ముఖ్యంగా, రాజు హోటల్‌ని ఇష్టపడేవాళ్ళం. యువకులు, జాతరా జనం అంటే మా రాజేశ్వరుని దర్శనానికి వచ్చిన జనం ఎక్కువగా వెళ్ళే హోటళ్ళు ఆ రెండు. గుడికి దగ్గరగా వుండటం, జాతరా గ్రౌండ్‌కి వెళ్ళే దారిలో వుండటం కూడా దానికి కారణం.

మా ఊరి యువకులు, కుర్రవాళ్ళు ఈ హోటళ్ళకి వెళితే మధ్య వయస్సు వాళ్ళు రుక్కమ్మ హోటల్‌కి వెళ్ళే వాళ్ళు. రుక్కమ్మ హోటల్‌ పూరీ, మిర్చీలకి ఫేమస్‌ అయితే, ఇవి దోసెలకి, పెసరట్లకి ఫేమస్‌. మిర్చీలు ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టేవాళ్ళు. చూస్తేనే తినాలనిపించేది. రుక్కమ్మ హోటల్‌లో రుక్కమ్మ గల్లాపెట్టె ముందు కూర్చోవడం వల్ల ఆ హోటల్‌కి రుక్కమ్మ హోటల్‌ అని పేరొచ్చింది. ఆమె భర్త చాలా తక్కువగా ఆ సీట్లో కూర్చునేవాడు. ఎప్పుడన్నా ప్రసాద్‌ కూర్చునేవాడు. అతను రుక్కమ్మ కొడుకు. అతను మా వయస్సు వాడే. కానీ తక్కువ పరిచయం. ఒకటి రెండు సార్లు కన్నా ఎక్కువ మాట్లాడి వుండను అతనితో. లా చదువు అయిపోయి న్యాయవాదిగా మారిన తరు వాత ఆ హోటళ్ళ వైపు వెళ్ళడం తగ్గిపోయింది. వెంగ య్యను కలువడానికి అతని ఫోటో స్టూడియోకి వెళ్ళడం తప్ప ఆ సందులోకి వెళ్ళడం కూడా తగ్గి పోయింది.

న్యాయవాది నుంచి న్యాయమూర్తిగా మారిపోవడంతో ఆ హోటళ్ళకి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. పూర్తిగా తగ్గి పోయిందని చెప్పవచ్చు. కానీ మా వేముల వాడకి వెళ్ళినప్పుడల్లా ఆ రెండు హోటళ్ళు గుర్తుకొచ్చేవి. ఎప్పుడో దసరా రోజు తప్ప ఆ హోటల్‌కి వెళ్ళిన సందర్భాలు లేవు. ఈ మధ్యన లేవు.

ఉద్యోగ పరుగులో మా వూరికి వెళ్ళడమే తగ్గిపోయింది. వెళ్ళినా సమయా భావం. తీరికగా వుండే పరిస్థితి లేదు. వున్నా అప్పటి మిత్ర బృందం లేదు. ఆ రకంగా నేను వేములవాడకి వెళ్ళినపుడు ఆ హోటళ్ళకి వెళ్ళడం పూర్తిగా పోయింది. కానీ మా సాహితీ చర్చలు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ రెండు హోటళ్ళు గుర్తుకొచ్చేవి.

మాఊరి రుక్కమ్మ హోటల్‌, వీరేశం హోటళ్ళు ఏమైపోయాయో తెలియదు.

అలా ఓ ముప్పై ఐదు సంవత్సరాలు, కాలం కౌగిట్లో గడిచిపోయాయి. హైదరాబాద్‌లోని ఎన్ని పెద్ద హోటళ్ళలో ఎన్ని చాయ్‌లు, కాఫీలు త్రాగినా, ఆ వన్‌ బై టూ చాయ్‌ రుచి మాత్రం దొరకలేదు.

ఆ మధ్య నా ఐఫోన్‌, మాక్‌ బుక్‌లు కొంత సమస్యలు సృష్టిస్తే వాటిని బాగుచేయించడానికి  అమీర్‌పేటలో వున్న అప్ట్రానిక్స్‌ సర్వీస్‌ సెంటర్‌కి వెళ్ళాను. ఐదవ అంతస్తులో ఆ సెంటర్‌. ఓ అరగంటలో బాగు చేసి ఇస్తానని చెప్పడం వల్ల అక్కడే కూర్చున్నాను.

వస్తూ పోతున్న జనాలని గమనిస్తూ, వాళ్ళని అటెండ్‌ చేస్తున్న సెంటర్‌ సిబ్బం దిని పరిశీలిస్తూ కూర్చున్నాను. చాలా మంది కస్టమర్లు వస్తున్నారు. వెళ్తున్నారు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను.

కొద్దిసేపటికి ఏదో తెలిసిన మొఖంలా ఓ మొఖం కన్పించింది.

మా ఊరి వాడిలా అన్పించింది.

కాస్త జాగ్రత్తగా పరిశీలించాను. ప్రసాద్‌ మాదిరిగా అన్పించాడు. అదే రుక్కమ్మ హోటల్‌ ప్రసాద్‌. రుక్కమ్మ కొడుకు ప్రసాద్‌. మేం అతి తక్కువగా వెళ్ళిన హోటల్‌ రుక్కమ్మ హోటల్‌. మేం అతి తక్కువగా మాట్లాడిన వ్యక్తి ప్రసాద్‌.

అతను హోటల్‌లోనే కాదు మా ఊరి రోడ్‌ మీద చాలా సార్లు కన్పించేవాడు. ఎప్పుడూ అతనితో మాట్లాడలేదు. అతనూ అంతే.

మనిషి అప్పటి మాదిరిగా చురుగ్గా కన్పించాడు. కొంచెం వయస్సు పైన బడింది అంతే!

అతని వైపు చూశాను.

అతను నా వైపే చూస్తున్నాడు.

అతన్ని నేను గుర్తు పట్టాను.

అతనూ నన్నూ గుర్తుపట్టాడు.

అతను నాదగ్గరగా వచ్చి ‘‘నమస్కారం సార్‌!’’ అన్నాడు.

నేను సీటులోంచి లేచి ప్రతి నమస్కారం చేశాను.

‘‘ఏం ప్రసాద్‌! ఎలా వున్నావు’’ ప్రశ్నించాను.

‘‘బాగానే వున్నాను సార్‌! మీరు ఈ మధ్య వేములవాడకి రావడం లేదు’’ అడిగాడు ప్రసాద్‌.

‘‘వస్తున్నాను ప్రసాద్‌. కానీ బజార్లోకి ముందు మాదిరిగా రావడం లేదు అంతే!’’ అన్నాను.

‘‘హైదరాబాద్‌లోనే వుంటున్నారా?’’

‘‘అవును ప్రసాద్‌’’ అన్నాను.

ఒక్కసారిగా మా వేములవాడలోని హోటళ్ళు అన్నీ గుర్తుకొచ్చాయి. మరీ ముఖ్యంగా రుక్కమ్మ గుర్తుకొచ్చింది.

రుక్కమ్మ గురించి అడగాలన్పించింది. కానీ అడగలేదు. ఆమె ఎలా వుందో.. ఆయన మాటల్లో మా ఊరు మార్మోగింది.

‘‘హోటల్‌ ఎలా నడుస్తోంది ప్రసాద్‌’’ అడిగాను.

‘‘ఇప్పుడు హోటల్‌ లేదు సార్‌. వేరే బిజినెస్‌ చేస్తు న్నాను. అప్పుడప్పుడూ కస్టమర్ల ఫోన్లు రిపేర్‌కి హైదరాబాద్‌ తీసుకొని వస్తుంటాను.’’ చెప్పాడు. కొద్దిసేపు వేములవాడ ముచ్చట్లు చెప్పాడు.

అతని చేతిలో రెండు ఫోన్లు కన్పించాయి.

అతని నెంబర్‌ పిలవడంతో కలుస్తానని చెప్పి ప్రసాద్‌ కౌంటర్‌ వైపు వెళ్ళిపోయాడు.

నా పని కూడా అయిపోవడంవల్ల నేనూ బయటికి వచ్చా ను నా మ్యాక్‌ బుక్‌లో, ఫోన్‌లోనే కాదు మరెన్నో జ్ఞాపకాలతో.

రాజూ హోటల్‌ అదే ఉడిపి హోటల్‌, నటరాజ్‌ హోటల్‌ రుక్కమ్మ హోటల్‌. అప్పటి మిత్రులు రవీంద్ర, రాజేందర్‌, శివ కుమార్‌, రమేశ్‌ చంద్ర, ఆనంద్‌, శివప్ర సాద్‌, కొమురవెల్లి రాజేందర్‌ అందరూ ఒక్కసారి స్మృతి పథంలో మెదిలారు.

మన ఊరివాళ్ళు, అనుకోకుండా నగరంలో తారసపడితే ఏదో తడి, ఏదో ఉత్సాహం, ఎన్నో జ్ఞాపకాలు.

ఊరిలోని అపరిచితులు కూడా ఆత్మీయంగా కన్పిస్తారు.

మనం అతి తక్కువగా మాట్లాడిన వ్యక్తులతో కూడా ఎంతో మాట్లాడాలని అన్పిస్తుంది.

ఏదో తెలియని బంధం మనలని కలుపుతుంది.

మాట్లాడిస్తుంది.

మన వూరి మట్టివాసన పరిమళంలా వ్యాపిస్తుంది.

ఆ రోజూ నాకు జరిగింది అదే!

ఇది నగరం సంగతి.

మరో రాష్ట్రంలో అయితే

యాస కన్నా భాష మనలని కలుపుతుంది.

విదేశంలో దేశం పలకరిస్తుంది.

మన మనస్సు ఉప్పొంగిపోయేలా చేస్తుంది.

దగ్గర కన్నా దూరం మనుషులని దగ్గర చేస్తుందేమో.