|

సర్పంచ్‌ అంటే ఊరికి ఉపకారి

ఎన్నీల ఎలుగు
– అన్నవరం దేవేందర్‌

tsmagazine
ఊరి సర్పంచ్‌ అంటే గొప్ప పదవేకాదు పెద్ద బాధ్యత. ఊరంతటికి తలలో నాలిక లాగా అన్నట్టు. ఊరికి సంబంధించిన సకులం పనులు ఆయన లేదా ఆమె మీదనే ఆధార పడుతాయి. సర్పంచ్‌ తనం ఒక రకంగా

ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టే. ఇంటికి పెద్ద మనిషి ఎట్లనో ఊరికి అసలు సిసలు పెద్దమనిషి. వీధిలైట్లు ఎలుగకుంటే సర్పంచ్‌కే పట్టి. నల్ల నీళ్ళు రాకుంటే సర్పంచ్‌నే పిలువాలె. మురికి నీళ్ళు పోతలేవు, పైపులు జాం అయి బజార్లకు వస్తన్నయి. అంటే సర్పంచ్‌ సాబ్‌ నే పిలుసుడు. ఆఖరుకు ఊల్లే ఏదన్న దొంగతనం అయినా, ఎవలు ఎవలనన్న ఏమన్న చేసినా ఆఖరుకు సర్పంచ్‌ సాబు ముందుకే సంగతి పోతది. ఇద్దరు ఆలుమగలు కొట్లాడుకున్న, కులంల కాకపోతే సర్పంచ్‌ తానికి పోవలసిందే. ఊరి శిక్కులే కాదు ఊల్లే మురికి కాలువలు కట్టిచ్చుడు, సిసి రోడ్లు ఏపిచ్చుడు కరెంట్‌ పోల్లు గుంజిపిచ్చుడు, పక్కపొన్న ఊర్లను పోనీకి, రానీకి డాంబర్‌ రోడ్లు ఏపిచ్చుడు, ఇవన్ని పనులు, సర్పంచ్‌లు మండల పరిషత్‌కు పోయి ఎమ్మెల్యే తానకు పోయి చేపిచ్చుకరావాలె. సర్పంచ్‌ తనం అంటే తెల్లబట్టలు ఏసుకొని, కాలు మీద కాలు ఏసుకొని కూసునుడు ఇదివరకు ఉండెగని ఇప్పుడు అట్లకాదు ఇరాం లేకుంట పనులు ఉన్నయి.

కొత్తగ ఎన్నికయిన సర్పంచ్‌లకు ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఇష్టంగానే చేస్తరు. ఇట్లనే కొనసాగించాలి. ఇంట్ల తండ్రులకున్నంత ఒపిక ఉండాలె. సర్పంచ్‌ అన్నకాడ శతృవులు కూడా మస్తుగనే ఉంటరు. తనో పార్టీల ఉంటే ఎదుట పార్టీ ఆయన ఏదో పుల్ల పెడుతనే ఉంటడు. ఆ పుల్లను ఊడబీకిచ్చుకోవాలె. తప్పులు చెయ్యకుండా ఉండాలే లేదా చేస్తే దొరకకుంట ఉండటం ఎలాగో కూడా తెలుస్తనే ఉంటది. అయితే ఎల్లవేళ నియ్యతిగ ఉంటేనే నిలబడుతం. ఎవలైనా మంచివాడు మా సర్పంచ్‌ అనుకుంటారు. ఇయ్యాల రేపు అంతా పారదర్శక పాలన అయ్యింది. ఎంత వస్తన్నయి, ఎంత పోతున్నయి అన్నదానికి ఓ లెక్క ఉంటది. ఆ లెక్క ప్రకారం అందరికి సూపియ్యాలె. ఏది అవసరం ఉన్న సమాచార చట్టం ద్వారా అడిగి తెలుసుకునే హక్కు అందరికి ఉన్నది. పూర్వకాలంలో ఇట్లలేకుండే ఏది చేసినా నడుస్తది అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు సర్పంచ్‌ సీట్లల్ల అందరు కూసుంటున్నరు. ముఖ్యంగా మహిళలకు ఈ సీటు రిజర్వ్‌ చేయబడటం మంచిదే అయితే ఆమె కాకుండా తన పెనిమిటి పెత్తనం ఏలకుంట సూసుకోవాలె. మహిళలు రాజ్యాధికారం కావాలెనని కొట్లాడిన కాలంల సర్పంచ్‌ స్త్రీ అయినంక తన పేరు పక్కపొన్న మొగని పేరు కూడా పెట్టుకునుడు ఎందుకు. ఒకవేళ ఆ మగాయనే సర్పంచ్‌ అయ్యిండనుకుందాం. ఆయన పక్కన ఆమె పేరు పెట్టుకుంటడా, అర్థం చేసుకోవాలె. ముందుగాలనే పక్కాగ ఉండాలె. అట్లనే కుల రిజర్వేషన్‌లతో గెలిచిన వాల్లు కూడా ఇంకొకల పొడ పడకుండ సొంతంగా సూసుకోవాలె. సర్పంచ్‌ ఎవరైనా కొత్తగ వచ్చిన సంబురం ఉంటది. అదే ఆనందంలో ముందు చట్టాలను అధ్యయనం చెయ్యాలె. చేసి పరిపాలన పగ్గాలు చేతులకు తీసుకోవాలె.

ఏపని చేయాలన్న పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం నడుచుకోవాలె. ప్రతి పథకం ప్రారంభించే ముందు ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తది. వాటిని దిన పత్రికల నుంచి పూర్తిగా చదవాలి. తర్వాత మండల ఆఫీసు నుండి అమలు అవుతున్నప్పుడు ఆ పథకం సమస్త వివరాలు ప్రభుత్వ ఉత్తర్వులు సర్క్యులర్లు తెచ్చుకొని చూసి దాని ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసుకొనే కాడ నిలబడాలె. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ వార్డు సభ్యులు చైతన్యంతో ఉంటే ఆ వూరు అద్భుతంగా ఉంటది. మంచి నీళ్ళు, మురికి

నీళ్ళు, మరుగుదొడ్లు, బడి, అంగన్‌వాడి ఇవి కరెక్ట్‌గ చూసుకుంటే సగం పని అయిపోయినట్టే. వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కూడా నాకు కావాలంటే నాకు కావాలనే పోటీ వస్తది. అప్పుడు అత్యంత పేదొల్లో కెల్ల పేదను ఎంపిక చెయ్యాలె. ఒకసారి మనోల్లు అని తప్పుచేసిండ్రు అనుకో ఆ మిషతో ఊరంత అట్లనే అవుతది. కావున కొత్త సర్పంచ్‌లు ఖచ్ఛితత్వంతో నిజాయితీగ మసులుకుంటే ఊరు దేశం బాగుపడుతయి. అయితే సర్పంచ్‌ పని చేస్తే కొంత కష్టం ఉంటది. ఖర్చులు ఉంటయి. వీటన్నిటిని ఓర్చుకొనే దిగినం కద, ఇంకేంది ఊరికి సేవ చేసుకుంటు పోవాలె.

కొత్త సర్పంచ్‌లకు స్వాగతంతో…