మూత ‘బడి’ పోకుండా
By: ఉప్పర వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్

అదొక రహదారి సౌకర్యం కూడా సరిగా లేని మారుమూల గిరిజన తాండ. మహబూబ్‌నగర్ జిల్లా, హన్వాడ మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తండా పేరు దొర్రి తాండ. ఈ తాండాలో 102 కుటుంబాలుండగా మొత్తం జనాభా 751. అయితే ఇందులో 70 శాతం గిరిజనులు వ్యవసాయ పనులు చేసేవారే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పల్లెప్రగతి’ కార్యక్రమాలు ఈ తండాలో బాగా అమలవుతున్నాయి. ముఖ్యంగా శానిటేషన్, హరితహారం, ప్రకృతి వనాలు, ఉపాధి హామీ, వంటి పథకాలను బాగా అమలుచేస్తున్నారు. అదే విధంగా 100 శాతం టాయిలెట్లను నిర్మించుకున్నారు. బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న రుణాలను తండావాసులు తిరిగి చెల్లించడంలో కూడా నూటికి నూరు శాతం ముందున్నారు.
దొర్రి తండాలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. 1998లో ఈ పాఠశాలను ప్రారంభించారు. 2001లో ఒక తరగతి గది మంజూరు కాగా, 2017లో మరో తరగతి గది మంజూరైంది. ఒకప్పుడు విద్యార్ధులు లేక పూర్తిగా మూసివేయాలనుకున్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 67 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందుకు కారణం ఈ తండాలో చదివిన విద్యార్ధులకు సుమారు 42 మందికి రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు రావడమే. అంతేకాక ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి అని చెప్పవచ్చు.

2015లో మల్లేష్ అనే ఒకే ఒక ఉపాధ్యాయుడు ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్ధులు మాత్రమే ఉండటం, తాండ నుండి 2,3 ఆటోలలో మహబూబ్‌నగర్, హన్వాడ ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్ధులు వెళ్ళేవారు. దీనివల్ల పాఠశాల మూతపడే స్థాయిలో ఉందని తెలుసుకున్న మల్లేష్ ఎలాగైనా పాఠశాలను బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యంతో దృఢనిశ్చయం తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం మోజుతో తల్లిదండ్రులు వారి పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారని గుర్తించిన మల్లేష్ 2016లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించారు. దీంతో అదే సంవత్సరం 15 మంది విద్యార్ధులు పాఠశాలలో చేరారు. తర్వాత సంవత్సరం ఈ సంఖ్య 35కి పెరిగింది. 2017 రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ప్రారంభించింది. అదే సమయంలో దొర్రి తండాకు హామ్లెట్ గ్రామమైన పలుగు తాండలో ప్రాథమిక పాఠశాలను మూసివేసి పక్కనే ఉన్న దొర్రి తండాలో కలిపివేయగా అక్కడి ఉపాధ్యాయుడు పుల్లయ్య ఈ పాఠశాలలో వచ్చి చేరడంతో మల్లేష్, పుల్లయ్యలు పాఠశాల అభివృద్ధికి మరింత నడం బిగించారు.
ముందుగా ఎలాగైనా తాండ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ఆపాలని నిశ్చయించుకున్నారు. ప్రత్యేక తరహాలో విద్యాబోధన చేయడం ప్రారంభించారు. పాఠశాల సమయం తర్వాత కూడా విద్యార్ధులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం, గురుకుల సీట్ల కోసం తర్ఫీదు ఇవ్వటం ద్వారా తాండవాసుల మనసులు చూరగొన్నారు. దీంతో వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళకుండా మాన్పించి తండాలోని ప్రాధమిక పాఠశాలలో చేర్పించడం మొదలుపెట్టారు.
ఈ పాఠశాలలో చదివిన విద్యార్ధులకు 2018లో 6 మందికి, 2019లో ముగ్గురికి 2020లో 12 మందికి, 2021లో 21 మందికి రెసిడెన్సియల్ పాఠశాలల్లో సీట్లొచ్చాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులు కూడా ఈ తాండ ప్రాథమిక పాఠశాలలో చేరడం మొదలుపెట్టారు. ఇక్కడి ఉపాధ్యాయుల కృషితో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యా కమిటీ కూడా ఇందుకు కారణం అయ్యింది.

ప్రతి విద్యార్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం, ప్రతిరోజు ఒక గంట ప్రత్యేక తరగతులను నిర్వహిం చడంతోపాటు కృత్యాధార పద్ధతిలో చదువు చెప్పడం, ప్రత్యేకించి గణితంలో కర్ర పుల్లలతో లెక్కలు నేర్పించడం, పిల్లలను బ్యాంకు, పోస్ట్ ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకువెళ్ళి ప్రత్యక్షంగా వాటి నిర్వహణపై అవగాహన కల్పించడం, ఆయా శాఖల అధికారులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం, వార్తా పత్రికల్లో వచ్చే అంశాలపై అవగాహన కల్పించడం, తెలుగు గుండ్రంగా రాయడం, చదవడం, బాలసభ నిర్వహణ, జీకే వంటి వాటిపై దృష్టి సారించడమే కాకుండా, గురుకులాల్లో ఎక్కువ మంది విద్యార్ధులు సీటు సాధించడం వల్ల పాఠశాలలో చేరే విద్యార్ధుల సంఖ్య పెరిగింది.

నాతోపాటు నా తోటి ఉపాధ్యాయుడు మల్లేష్ ప్రతి విద్యార్ధి పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి సబ్జెక్టుపై వారికి అర్ధమయ్యే విధంగా వివిధ పద్ధతుల ద్వారా బోధన చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ విద్యార్ధులు గిరిజనులు కావడం వల్ల తెలుగు భాష సమస్యకూడా ఉంది. దానిని మేము అధిగమించి చదువు చెబుతున్నాము. మేము బోధించే విధానాన్ని చూసి తల్లిదండ్రులకు నచ్చి ప్రైవేట్ పాఠశాలలో చదివే ప్లిలలను కూడా ఇప్పుడు మా పాఠశాలలో చేర్చుతున్నారు. మహబూబ్ నగర్ ప్రైవేట్ పాఠశాలలో చదివిన ఇద్దరు విద్యార్ధులు, హన్వాడ నుండి నలుగురు విద్యార్ధులు మా పాఠశాలకు వచ్చి జాయిన్ అయ్యారు. – పుల్లయ్య, టీచర్, దొర్రితాండ

2015 సంవత్సరంలో మూతపడే పరిస్థితి ఉన్న మా గ్రామ పాఠశాల ఇప్పుడు 70 మంది విద్యార్ధులకు చేరుకున్నది. దీనికి కారణం పాఠశాలలో చదువు చెబుతున్న ఉపాధ్యాయులదే. ఈ పాఠశాల నుండి 42 మంది గురుకులాలలో సీట్లు సంపాదించారు. ఇందుకు చాలా గర్వంగా ఉంది. విద్యార్ధుల చదువుపట్ల ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుండి కూడా విద్యార్ధులు ఈ పాఠశాలలో చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటుకు ధీటుగా పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం. – బాలరాజు, హన్వాడ ఎంపిపి
నా పేరు స్నేహ. మేము బాగా చదివి గురుకులంలో సీటు వచ్చినందుకు మా టీచర్లు మల్లేష్, పుల్లయ్య సార్లు కారణం. – గురుకులంలో సీటు పొందిన విద్యార్ధిని.

నేను దొర్రి తాండ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి వరకు చదివి ఈ సంవత్సరమే గురుకుల సీట్‌కు పరీక్ష రాశాను. నాకు గురుకులంలో సీటు వచ్చింది. మా పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారాలు కూడా తరగతులు నిర్వహించారు. అంతేకాక గురుకుల సీట్ సాధించేందుకు మోడల్ పేపర్ కూడా చేయించారు. దాంతో 21 మంది విద్యార్ధులకు గురుకులలలో సీట్లు వచ్చాయి.
– అర్జున్ గురుకుల సీట్ సాధించిన విద్యార్ధి.

దొర్రి తండా నూతనంగా ఏర్పాటైన చిన్న గ్రామ పంచాయతీ. ఇక్కడ 102 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో 65 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. అయితే 2017కు పూర్వం 3,4 ఆటోలలో పిల్లలను తల్లిదండ్రులు మహబూబ్‌నగర్, హన్వాడ ప్రైవేట్ పాఠశాలలకు పంపించే వారు. కానీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలకు ఎవరూ వెళ్ళడం లేదు. ముఖ్యంగా అందరు గిరిజనులే కావడం వల్ల తెలుగు కూడా సరిగా రాదు. భాష సమస్యను కూడా ఇక్కడ టీచర్లు అధిగమించడం ఇంగ్లీష్ మీడియంలో విద్యనందించడం, ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా చదువు చెప్పడమే కాక వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా గురుకులాలకు మంచి కోచింగ్ అందించి ఎక్కువ మంది సీట్లు సాధించేలా కృషి చేస్తూ ఉండటం వల్ల ప్రైవేటు విద్యార్ధులు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు.
– ధనుంజయ గౌడ్, ఎంపిడిఓ, హన్వాడ.