అన్ని జిల్లాల్లో శిల్పారామాలు

cm-kcrరాష్ట్రంలోని అన్ని జిల్లాలలో శిల్పారామాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. హైదరాబాద్‌లోని శిల్పారామాన్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.

మాదాపూర్‌లో గల శిల్పారామంలో ఏర్పాటు చేసిన 19వ అఖిలభారత హస్తకళా మేళాను డిసెంబరు 15న ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఇంతకాలం నిర్లక్ష్యానికి గురై, కళావిహీనంగా మారిన శిల్పారామాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని, ఏడాది పొడవునా ఇక్కడ కార్యక్రమాలు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తామని సీఎం చెప్పారు.హస్తకళల ఉత్పత్తుల విక్రయాల్లో దళారుల ప్రమేయం లేకుండా చూస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హస్తకళలకు, కళాకారులకు కొదువలేదని, కళాకారులకు చేయూతనిచ్చేందుకు ఏర్పాటైన శిల్పారామం వ్యాపారకేంద్రంగా మారడం బాధాకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిర్మల్‌ బొమ్మలు, కరీంనగర్‌, పోచంపల్లి కళాఖండాలు, గద్వాల్‌ చీరలు ఇక్కడి కళా సంస్కృతిని ప్రతిబింబించాలన్నారు. బ్యాటరీ కారులో తిరుగుతూ మేళా స్టాల్స్‌ని ముఖ్యమంత్రి సందర్శించారు.