భూమి ఉద్భవించిన రోజు ‘శివరాత్రి’

By: డా. సాగి కమలాకర శర్మ

ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః

కామదం మోక్షదం తస్మై ఓం కారాయ నమోనమః

భారతీయ సంస్కృతి అతి విశిష్టమైనది. మన చుట్టూ ఉండే ప్రకృతి, మనం నివసించే భూమి, మూలమైన సూర్యుడు అన్నింటినీ వేరు వేరు సమయాల్లో ఆరాధించే క్రమంలో ధర్మశాస్త్రాన్ని రూపొందించుకున్న వైజ్ఞానిక సంస్కృతి భారతీయమైనది. ప్రతీ విషయాన్ని ప్రతీకలుగా చెప్పడంలో భారతీయ పురాణాదులకు సాటిలేదు. అర్థం కానంత వరకు అవి పుక్కిటి పురాణాలే. అర్థమైతే అద్భుతమైన వైజ్ఞానిక మార్గం. హైందవ ఆధ్యాత్మిక విధానంలో కనిపించే ప్రతి దైవ ప్రతిమ ఒక వైజ్ఞానిక భావానికి, ఖగోళానికి, భూగోళానికి, ప్రకృతికి ప్రతీకలుగానే ఉంటాయి. చూసే దృష్టి ఉంటే అంతా విశ్వమయమే. అతి పెద్ద శక్తులకు ఒక రూపాన్ని ఇచ్చి, ఆ రూపారాధన ద్వారా మూలశక్తిని ఆరాధించే గొప్ప వైజ్ఞానిక సంప్రదాయం భారతీయులదే. ఆ రూపాన్ని, ధ్యాన శ్లోకాన్ని, మంత్రాన్ని, అక్షరాలను జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో ప్రత్యేక విషయాలు మనకు కనిపిస్తాయి. ఈ వరుసలో మొట్ట మొదట ఆలోచించదగినది శివారాధనే. శివుని రూపమే. శివరాత్రి పర్వమే. 

శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు అని అర్థం. శివుణ్ణి మనం లింగరూపంలో ఆరాధిస్తున్నాం. ఈ శివలింగ రూపం మనం నివసిస్తున్న భూగోళ ప్రతిరూపమే. భూగోళాన్ని మొత్తాన్ని మనం ఆరాధించలేము. కనీసం ఎలా ఉంటుందో మనం ప్రత్యక్షంగా చూసి ఊహించలేము.  భూగోళం ఏవిధంగా ఉన్నదో కూడా మనలో చాలామందికి తెలియదు. ఆ విషయం మనకు తెలిసినా తెలియకున్నా మనం భూగోళాన్ని శివలింగ రూపంలో ఆరాధిస్తూ ఉన్నాం. శివపూజ అంటే భూమికి మనం కృతజ్ఞతతో చేసుకునే పూజ. శివరాత్రి నాటి లింగోద్భవమంటే భూమికి పుట్టిన రోజు అనే అర్థం. 

రూపంగా ధ్యానించిన శివ రూపాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. శివుని తలపై చంద్రుడు ఉంటాడు. శివుడు అందుకే చంద్రశేఖరుడు. భూమికి ఉపగ్రహం కూడా చంద్రుడే. శివుని తలపై గంగ ఉంటుంది. శివుడు గంగాధరుడు. భూమిపైన కూడా మూడింట రెండువంతులు జలమే ఉంది. శివుడు దిగంబరుడు. అంటే దిక్కులే అంబరములుగా (వస్త్రములుగా) కలవాడు. భూమి కూడా ఆకాశంలో దిగంబరంగానే ఉంటుంది. ఇది అప్పట్లో వైజ్ఞానిక సత్యం. శివుని మెడలోని పాములు, భూమి చుట్టూ ఉండే విద్యుదయస్కాంత శక్తి తరంగాలకు సంకేతాలు. భూమిలోని లావాలు, ఆమ్ల సంబంధమైన వ్యవహారాలన్నీ నీలకంఠత్వాన్ని నిరూపిస్తున్నాయి. శివునికి పార్వతితో కూడుకున్న అర్ధనారీశ్వర రూపము భూమి చుట్టూ ఉండే పాంచభౌతిక శక్తితో కలిసి ఉండడానికి సంకేతమే. క్షీరసాగర మథనమంటే భూమికి మరో గ్రహం కొట్టుకొని భూగ్రహ స్థానం మారి, దానిపైన ప్రకృతి ఏర్పడి, చంద్రుడు ఏర్పడటమే. భూమిలోని అనేక సంపదలే శివుని ఐశ్వర్యత్వానికి సంకేతాలు. శివునికి పూసే విభూతి… భూమిపైని మట్టి మాత్రమే. భూమికి ఉన్న గురుత్వాకర్షణ గణపతి. విద్యుదయస్కాంత తరంగ శక్తి కుమారస్వామి. చుట్టూ ఉన్న పాంచభౌతిక ప్రకృతి పార్వతి. ఇది సదాశివ కుటుంబం.

వైజ్ఞానిక భావాలే ఉన్న శివుణ్ణి మననం ఎందుకు ఆరాధించాలి? అంటే.. ఈ భూమిపైన కొద్ది వర్షం పడినా, భూమి ఉత్పాదక శక్తిని పెంచుకుని పూర్తిగా పచ్చబడుతుంది. అంటే భూగోళంపై పడే వర్షం వల్ల భూమి పచ్చబడి, పంటలు, పైరులు, వృక్షజాతులు వికసించినట్లుగా… మనం శివలింగానికి చేసే అభిషేకం మనలో అనేక శక్తులను పెంచడానికి, కోరికలు తీర్చడానికి వినియోగ పడుతుంది. సంతానశక్తిని, బుద్ధిశక్తిని కూడా పెంచుతుంది. అందుకే ‘అభిషేక: ప్రియ: శివ:’ అని అనడం సంప్రదాయం, వైజ్ఞానికం. శివారాధన అంటే అభిషేకమే అయినప్పుడు భూమి ఎల్లప్పటికీ చక్కని వానలతో ఆనందంగా విలసిల్లాలని, దాని ద్వారా మనకు పంటలు పూర్ణమై జీవజాలమంతా సంతోష విలసితం కావాలాని కోరుకోవడమే. శివారాధనలో తులసీ పత్రాలు, మారేడు (బిల్వ) పత్రాలు వినియోగించడమంటే భూమిపై తప్పనిసరిగా ఈ రెండు వృక్షాలను బాగా పెంచాలని, దానిద్వారా భూమిపైన కాలుష్యమనే నిర్మాల్యాలను తొలగించుకునే అవకాశం కలుగుతుందని సూచించడమే. ప్రతిరోజూ చేసే శివా రాధన భూమిపైన మాలిన్యాలను తొలగించి, స్వచ్ఛత, శుద్ధతను ఆపాదింపజేసే ప్రయత్నమే.

శివారాధనలో భూమిలోని ఐశ్వర్యాదులన్నీ మనకు చేరి మనకు సంతోషాన్ని కలిగించాలని ప్రార్థించడమే. ‘ఐశ్వర్యం ఈశ్వరాధిచ్ఛేత్‌’ అని సంప్రదాయం. శివునికి ఉన్న అనేక నామాలలో ఈశ్వర శబ్దం కూడా ఉంది. భూమిలోనే సకల రూప సంపదలన్నీ ఉన్నాయి. ఈ రోజున మనకు నీళ్ళు, పెట్రోల్‌, గ్యాస్‌, గ్రానైట్‌, బంగారం వంటి అనేక ఖనిజాలు ఏవైనా భూమి నుండే లభ్యం అవుతున్నాయి. భూమిపైన పెరిగే వృక్షజాతి అన్నింటికన్నా పెద్ద సంపదలు. ఆహారం కావాలన్నా భూమిపైన మనం ఆధారపడాల్సిందే. మనం నివసించడం మొదలు పెట్టి, ప్రతి అంశానికీ మనం భూమిమీదనే ఆధారపడక తప్పదు. ఇంతటి సంపదలను, ఆనందాన్ని మనకు కలిగించే ఈశ్వరారాధనే ఈ శివపూజ. శివుడు మన దరిద్రాలన్నీ తీర్చేవాడు. (దారిద్య్ర దు:ఖ హరణాయ నమ:శివాయ) ఈ శివరాత్రి అంటే వైజ్ఞానికంగా భూమి పుట్టిన సందర్భం. మన పుట్టిన రోజులకు మనం వేడుకలు చేసుకుంటాం. మరి మనకు అన్ని విషయాలకు ఆధారమైన భూమికి పుట్టిన రోజు వేడుకలు ఒక శాస్త్రబద్ధంగా, దీక్షతో, దాని క్షేమాన్ని కోరుకుంటూ చేసే ఉత్సవమే శివరాత్రి పర్వదినం నాడు మనం చేసుకునే ఉత్సవం.

ఆకాశంలో మనం గమనించే పన్నెండు రాశులలో వృషభ, మిథున రాశులు మనకందరికీ తెలుసు. మిథున రాశిలోని ఆర్ద్ర నక్షత్రం శివునికి సంకేతంగా చూస్తారు. వేదం కూడా ‘ఆర్ద్రయా రుద్రః ప్రథమాన ఏతి’అని చెపుతుంది. మిథునం అంటే పార్వతీ పరమేశ్వరుల ఆర్ధనారీశ్వర భావనా మైథునమే. దాని ముందున్న రాశి వృషభం. భూమి గోళాకారంగా ఉన్నందువల్ల ఆకాశంలోనూ మనకు సగభాగమే కనిపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఆకాశంలో ఉదయం, అస్తమయం అనే రెండు పదాలు ఏర్పడినాయి. ఆకాశంలో వృషభ రాశి తూర్పు ఆకాశంలో కనిపిస్తే (శివునికి వాహనమైన నంది ` వృషభం) శివునికి ధ్వజంలా, పశ్చిమాకాశంలో అస్తమించే ముందు శివునికి వాహనం లాగా కనిపిస్తుంది. అందుకే శివునికి నంది మాత్రమే వాహనంగా మన వారు నిర్ణయించిన ఖగోళాంశం. అంతేకాదు ఈ విశ్వమంతా ఒక శివలింగంలా ఉన్నదని ఇటీవలి ఛాయాచిత్రం తెలియజేస్తుంది. దీనిలో అన్ని కాంతివత్పదార్థాలు ఉన్నాయి. అందువల్ల శివుడు విశ్వనాథుడు కూడా అవుతున్నాడు. ఆరోగ్యాన్నిచ్చే వైద్యనాథుడూ అవుతున్నాడు. మోక్షాన్నిచ్చే మల్లినాథుడూ అవుతున్నాడు.

మనకు మనలోని శక్తి చుట్టూ, చైతన్యం చుట్టూ ప్రదక్షిణం చేయాలని తెలియ జేస్తున్నది కూడా ఈ భూమి మాత్రమే. తన చుట్టూ తాను తిరగడం అంటే ఆత్మ భ్రమణం వల్ల తనలోని శక్తుల ఏకీకృత వ్యవస్థ అర్థం అవుతుంది. తన పనులు తాను చేసుకునే విధానమూ అర్థం అవుతుంది. ఈ పని చేస్తూ ఒక క్రమ పద్ధతిలో 365 రోజులకు ఒకసారి తనకు శక్తిని అందించే సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. ఇదే ప్రదక్షిణం. దీని వల్ల భూమికి అపరిమితమైన శక్తి వస్తుంది. ఆ శక్తితో భూమిపైన అన్ని జీవ రసాయన చర్యలు జరుగుతూ ఉంటాయి. జీవులన్నింటికీ అది ఆధారం అవుతుంది. దేవాలయాల్లో మనం చేసే ప్రదక్షిణను అవగాహన చేయిస్తున్నది కూడా ఈ భూమి మాత్రమే. ఇటువంటి భూమికి మనం ఎంతో ఎంతో ఋణపడి ఉంటాం. అందువల్ల శివారాధన నిరంతరం చేయడం భూమిని ప్రతి నిమిషం నమస్కరించడమే. మనకన్నా ఉన్నత శక్తి చుట్టూ మనం నిరంతరం సంచరిస్తే మనకూ శక్తి పెరిగి, మనచుట్టూ కొత్త ప్రపంచం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సాధనలన్నీ ఈ చిన్న అంశంతోనే ముడిపడి ఉంటాయి. భారతీయమైన పూజలు, స్తోత్రాలు, వ్రతాలు, దీక్షలు, హోమాలు, ధ్యానాలు అన్నీ దీనికి సంబంధించిన అంశాలే. అందుకే భూమిని శివుని రూపంలో నిరంతరం ఆరాధన చేద్దాం.

శాంతిని కలిగించేవాడు శంకరుడు. మంగళాన్ని కలిగించేవాడు శివుడు. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఎన్నో పేర్లున్నా రూపం మాత్రం లింగరూపమే. ఈ లింగానికే మన ఆరాధన. ఈ భూమికే మనం చేసే నమస్కారం. అందుకే శివరాత్రి అంటే భూమి ఉద్భవించిన రోజు. అందుకే శివారాధన చేయాలి. మనని కాపాడి సంపదలిచ్చే భూగోళానికి నిరంతరం నమస్కరిస్తూనే ఉండాలి. కనీసం కృతజ్ఞత తెలుపుకోవాలి. అభిషేకం చేస్తూనే ఉండాలి. మారేడు, తులసీ వనాలను బాగా బాగా అభివృద్ధి చేయాలి. పర్యావరణాన్ని కాపాడాలి. ఈ సందేశాన్నిచ్చే శివరాత్రిని ఇంకా భక్తితో అన్ని ప్రదేశాల్లో జరుపుకుందాం.

తత్ప్రణ మామి సదాశివ లింగం………