|

సిద్ధిపేట వెంకటరావు

By: జింబో

  • నా కోరిక మేరకు నాకు తిరుపతి నుంచి సిద్ధిపేటకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది.

నేను న్యాయవాదిగా ప్రాక్టిస్‌ చేసింది సిరిసిల్లలో. సిద్ధిపేట, సిరిసిల్లా రెండు ఆనుకుని వుంటాయి. మా వూరు వేములవాడ కూడా చాలా దగ్గర. సిద్ధిపేటలో నాతోపాటు ‘లా’ చదువుకున్న సీనియర్‌ రాజారెడ్డి, రామేశ్వర రావులు అక్కడే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. నా జూనియర్‌ రఘోత్తమరెడ్డి కూడా అక్కడే ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అన్నీ తెలిసే నేను సిద్ధిపేటకు ట్రాన్స్‌ఫర్‌ కావాలని అడిగాను. జస్టిస్‌ సుభాషణ రెడ్డి ‘నీకు ఏమీ సమస్య వుండదు అక్కడ’ అన్నారు.

అలాగే అక్కడ జాయినయ్యాను. నా మిత్రులతో పాటూ చాలా మంది న్యాయ వాదులు వచ్చి కలిశారు. మా సీనియర్‌ నర్సింహారవు అక్కడ సబ్‌ జడ్జి. గతంలో ఇద్దరమూ కలిసి నిజామాబాద్‌లో పనిచేశాం. తిరుపతి ఒత్తిడి నుంచి బయటపడ్డ నాకు అక్కడ హాయిగా ఆనందంగా వుంది.

ఓ నెల రోజుల తరువాత మా అమ్మ వేములవాడ నుంచి సిద్ధిపేటకు వచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసింది. నేను మా వూరికి వెళ్ళి అమ్మను తీసుకొని వచ్చాను.

ఓ రోజు సాయంత్రం నేను చాంబర్‌లో సంతకాలు పెడుతూ వుండగా మా అటెండర్‌ వచ్చి ‘‘సీనియర్‌ న్యాయవాది వెంకటరావు గారు కలుస్తారట’’ అని చెప్పాడు.

ఆయన పేరు కోర్టులో వినడమే కానీ ఆయన్ని కోర్టులో ఎప్పుడూ చూడలేదు. ఆయన ఆఫీసుని రాజారెడ్డి ఎక్కువగా చూసే వాడు. ఏవైనా పెద్ద కేసులు వున్నప్పుడు మాత్రమే ఆయన కోర్టుకు వస్తారని, ఆర్గ్యు మెంట్స్‌ చెబుతారని విన్నాను. ఆయన జూనియర్లు రాజారెడ్డి, ప్రవీణ్‌ వాళ్ళ ఆఫీసు పనిని చూసేవాళ్ళు. సిద్ధిపేటలో అది పెద్ద ఆఫీసు.

రమ్మనమని అటెండర్‌తో చెప్పి, సంతకాలు వగైరా పనులు తరువాత చేస్తానని మా స్టాఫ్‌కి చెప్పాను. వెంకటరావు చాంబర్లోకి వచ్చారు. ఆయన వెంట రాజారెడ్డి కూడా వచ్చారు. మనిషి సన్నగా వున్నారు. నాకు మల్లే అజానుబాహువు. తెల్లని దుస్తులు చిరునవ్వుతో నమస్కారం చేశారు. లేచి నిల్చోని ప్రతి నమస్కారం చేశాను. అందరమూ కూర్చున్నాం.

‘‘మీరు ఇక్కడ చార్జి తీసుకున్న తరువాత కోర్టువైపు రావడం ఇదే మొదటిసారి. మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను’ అన్నారు.

‘‘మీ పేరు రోజూ కోర్టులో వినిపిస్తుంది. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి’’ అన్నాను.

‘‘మీరు నాకు తెలుసు. మీ గురించీ తెలుసు. కానీ చూడటం ఇదే మొదటిసారి. మీరే కాదు మీ కుటుంబం అంతా నాకు తెలుసు’’ అన్నారు.

నాకు సిద్ధిపేటకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందరి చెప్పినప్పుడు మా చిన్నన్న వెంకటరావు గారిని గుర్తు చేశాడు.

అప్పుడు ఆ మాట నాకు రిజిస్టర్‌ కాలేదు. వెంకటరావు గారితో మాట్లాడుతుంటే ఆ విషయం గుర్తుకొచ్చింది.

‘‘నాకు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్‌ అయినప్పుడు మా చిన్నన్న మీ ప్రస్తావన తెచ్చారు’’ అన్నాను.

‘‘నా బాల్యం వేములవాడలో గడిచింది. మీకంటే ముందే మీ ఇంటి, కుటుంబ వాతావరణంలో నేను అంతర్భాగం. పాత కొత్త ఇండ్లు కలియ తిరిగిన వాడిని. మీ అమ్మగారు వచ్చారని విన్నాను. ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మని కలుస్తాను’’ అన్నారు.

‘‘తప్పకరండి’’ అన్నాను.

అంతలో టీ వచ్చింది. టీ త్రాగి వాళ్ళిద్దరూ వెళ్ళిపో యారు. నాతోపాటూ వున్నంత సేపు మా వేములవాడ ముచ్చట్లే చెప్పారు. తాను తిరిగిన ప్రాంతం మా పాత ఇల్లూ కొత్త ఇల్లూ ఇలా ఎన్నో ముచ్చట్లు చెప్పారు.

సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత అమ్మతో వెంకటరావు విషయం చెప్పాను. అమ్మ గతంలోకి వెళ్ళిపోయింది.

నేను పుట్టక ముందు మా బాపు దేవస్థానం వెనక వున్న ఇంట్లో వుండేవారు. రాజేశ్వరుని గుడి వెనక బాల త్రిపుర సుందరి, నాగిరెడ్డి మండపం వున్నాయి. ఆ తరువాత మహిషాసుర మర్దని గుడి వుంది. రాజేశ్వరుడు, అమ్మవారితో పాటూ మాకు అత్యంత ఇష్టదైవం మహిషాసురమర్ధని అమ్మవారు. అది చిన్న గుడి. మేం గుడికి వెళ్ళి నప్పుడల్లా అక్కడికి వెళ్ళి అమ్మవారిని పూజించ కుండా వెళ్ళం. ప్రతి సంవత్సరం అక్కడ అన్నంతో దిష్టికుంభం పోసేది మా అమ్మ. కాల క్రమంలో రాజేశ్వరుడు వూరి వాళ్ళకి దూరం అయిన తరువాత కొత్త అధికారుల అది అనుమతించడం లేదు.

అక్కడి నుంచి ఎడమవైపుకు దారి వుంది. శివరాత్రి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు దేవుడిని దర్శించుకున్న భక్తులని ఆ దారి నుంచి బయటకు పంపించేవారు. అక్కడి నుంచి మెట్లు దిగగగానే ప్రధాన దారి. ఆ దారి తరువాత మా చెరువు నుంచి పొలాలకు నీరు వెళ్ళడానికి ఓ చిన్న కాలవ వుండేది. కాలువకు అటువైపున మావూరి బ్రాహ్మల ఇండ్లు వుండేవి. ఆ కాలువ మీద నుంచి అటువైపు వెళ్ళడానికి పెద్ద స్తంభాల లాంటి రాళ్ళతో దారి వుండేది. అక్కడ ఒక చిన్న సందు వుండేది. ఆ సందులో ఎడమ వైపున మధు గోపయ్య ఇల్లు వుండేది. వారి అబ్బాయి మధు మృత్యుంజయం. మధు గోపయ్య ఇల్లు చాలా పెద్దది. ఇంటి వెనక కూడా రూంలు వుండేవి. ఆ రూంలో వుండి వెంకటరావు ఆయన సోదరుడు విద్యాసాగర్‌ రావులు చదువుకున్నారు. ఆయన గ్రామం సిరికొండ. అది సిద్ధిపేటకు దగ్గర. రాజేశ్వర స్వామి మీద భక్తి వల్లో, గోపయ్యగారి విద్వత్తు వల్లో వెంకటరావు గారి తండ్రి నారాయణ రావు వాళ్ళని వేములవాడలో చదివించారు.

అప్పుడు మా బాపు రాజేశ్వరుని దేవాలయంలో ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేసేవారు. మహిషాసుర మర్ధని గుడి వెనక దేవస్థానం వారి ఇంటిలో వుండేవారు.

వెంకటరావు రోజూ సాయంత్రం మా ఇంటికి వచ్చేవారు. మా పెద్దన్న జనార్ధన్‌తో కలిసి ఆడేవారు. మా బాపుని మామా అని, అమ్మని అమ్మా అని పిలిచేవారు. అలా మా ఇంటిలో ఆయన అంతర్భాగం అయినారు.

పోచమ్మ గుడి నుంచి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళే దారిలో మా బాపు పెద్ద ఇల్లు కట్టి అక్కడికి మకాం మార్చారు. అయినా వెంకటరావుకి మాతో అనుబంధం తగ్గలేదు. తరుచూ అక్కడికి వచ్చేవారు. ఇళ్ళంతా కలయతిరిగేవారు. మా అమ్మ చేతి వంట రుచి చూసేవారు.

ఇట్లా ఎన్నో ముచ్చటలు మా అమ్మ వెంకటరావు గురించి చెప్పింది.

ఆదివారం సాయంత్రం అనుకున్నట్టుగా వెంకటరావు గారు మా అమ్మను కలువ డానికి సిద్ధిపేటలోని మా ఇంటికి వచ్చారు.

వాళ్ళిద్దరూ గతంలోకి వెళ్ళిపోయారు.
ఎన్నో జ్ఞాపకాలు
మరెన్నో ముచ్చటలు
శ్రద్ధగా అన్నీ విన్నాను.

మా పెద్దన్నకి అత్యంత సన్నిహితులని వారి మధ్య ‘రారా, పోరా’ అనుకునే చనువు అని వాళ్ళ సంభాషణలో తెలిసింది. బయట ఎంత సన్నిహితంగా వుండేవారో, కోర్టు ముందు న్యాయవాదిగా అంత గాంభీర్యంగా మెదిలేవారు. ఎంతటి క్లిష్టమైన కేసునైనా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినంతగా కేసులోని మడతలని విప్పి చేప్పేవారు.

నేను సిద్ధిపేటలో పనిచేసినంత కాలం న్యాయమూర్తిగా ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలా ఇచ్చేవారు. కేసు వాదనలు చెప్పే వరకే ఆయన పట్టించుకునేవారు. ఫలితం ఎలా వచ్చినా నవ్వుతూ స్వీకరించేవారు. ఆయనే కాదు మా యూనివర్సిటీ మిత్రులు రాజారెడ్డి, రామేశ్వర రావు, రఘోత్తమ్‌లు కూడా ఆ విధంగానే మెదిలేవారు. వారందరి మీద వెంకటరావు గారి ప్రభావం వుందని అన్పించేది.

సిద్ధిపేటలోని మా పరిచయం కొంత సాన్నిహిత్యానికి దారి తీసింది. నేను సిద్ధిపేట వదిలినా కూడా అది కొనసాగింది. నిజానికి అది బలపడిందని చెప్పవచ్చు.

వెంకటరావు గారికి సాహిత్యం మీద మక్కువ ఎక్కువగా వుండేది. మేం కలుసుకు న్నప్పుడు చట్ట సంబంధమైన విషయాలకన్నా సాహిత్య సంబంధమైన విషయాలే ఎక్కువ ప్రస్తావించేవారు. నా పుస్తకాలు అడిగి తెప్పించుకునేవారు. అవశ్యం అయితే నిష్ఠూరంగా మాట్లాడేవారు. నా కవిత్వ పుస్తకావిష్కరణ సభకి సిద్ధిపేట నుంచి వచ్చి హాజరైనారు.

‘మా వేములవాడ కథలు’ పుస్తకం చదివి అందులో మమేకం అయి ఓ ఉత్తరం ఇలా రాశారు.

‘‘మీకంటే ముందు మీ ఇంటి కుటుంబ వాతా వరణంలో నేను అంతర్భాగం. మీ పాత, కొత్త ఇండ్లూ కలియ తిరిగిన వాడిని మీ అనుపురం జ్ఞాపకాల నుండి పెట్టెలర్ర అనుభవాల వరకు జరిగిన కథలు అన్నీ నా అనుభూతులలో చెదరకుండా వున్నాయి. మేము (నాతో పాటూ కొందరు మిత్రులు) మీ బాపు గారిని డాక్టర్‌ మామ అని పిలిచేవాళ్ళము.  మీ తల్లిదండ్రుల ఆప్యాయత మూలానా మీ ఇంట్లో నాకు ఏ ఆటంకాలు వుండేవి కావు.

మీ, నా వేములవాడ కథలు చదివిన తరువాత ఒక సహజ సుందరమైన అనుభూతుల్లోకి నెట్టబడ్డాను.’’

ఇలా చాలా విషయాలు ఆయన రాశారు. గతంలోకి వెళ్ళిపోయారు. తన వేములవాడ అనుభవాలను నెమరేస్తే ఓ పెద్ద కథ పుడుతుందని నాకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నారు.

దాదాపు హైద్రాబాద్‌ వచ్చిన ప్రతిసారి నన్ను కలువడానికి వచ్చేవారు. పెద్దవాణ్ణి నేనే రావాలి? మీరు రాకూడదా? అని నిష్ఠూరంగా మాట్లాడేవారు. ఆ నిష్ఠూరంలో ఒకింత ప్రేమ, అభిమానం ధ్వనించేది. మా అమ్మ బతికి వున్నంతకాలం వచ్చి పలకరించారు. ఆ తరువాత కూడా.

ఓసారి ఫోన్‌ చేసి ఇలా అడిగారు.
‘‘వేములవాడ వెళ్తున్నారా లేదా’’
‘‘వెళ్తున్నాం’’
‘‘సిద్ధిపేట నుంచే కదా పోయేది’’ అన్నారు.

‘నన్ను దాటుకుంటూ నన్ను కలువకుండా పోతారా?’ అన్న నిష్ఠూరం ఆయన మాటల్లో ధ్వనించింది. వేములవాడ వెళ్తు న్నప్పుడు సిద్ధిపేటలో ఆగి, ఆయన్ను కలిసి కాస్సేపు మాట్లాడి, టీ, టిఫిన్‌ చేసి వెళ్ళాలని ఆయన కోరిక. ఆయన కోరికను అన్ని సార్లు కాదు గాని కొన్నిసార్లు తీర్చాను.

చనిపోవడానికి నెలనెలా పదిహేను రోజుల ముందు డా॥ సురేంద్ర దగ్గరి నుంచి ఫోన్‌ చేసి చాలా సేపు మాట్లాడినారు. ఆయన మాటల్లో ఏదో బాధ వేదన నిర్వేదం కన్పించాయి.

ఆ తరువాత సురేంద్రతో మాట్లాడినాను. వెంకటరావుగారి ఆరోగ్యం గురించి విచారించాను. పెద్దాయన బాగానే వున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. అని ఆయన చెప్పారు.

ప్రతి పనిషికి తెలియని శక్తి వుంటుంది. కొన్నిసార్లు జరుగబోయేవి తెలుస్తాయేమో. ఇది నమ్మశక్యం కాకపోయినా కొన్ని సంఘటనలని గమనించినప్పుడు నమ్మాలని అన్పిస్తుంది. వెంకటరావుగారి విషయంలో అదే అన్పిస్తుంది. అదే ఆయన మరణవార్త. తన మరణం ఆసన్నమైందన్న దోరణిలో నాతో మాట్లాడినారు. ఆయన మరణ వార్త విన్న తరువాత ఆ రోజటి మా ముగ్గురి సంభాషణ నా స్మృతి పథంలో మెదిలింది.

వెంకటరావు గారు గుర్తు కొచ్చినప్పుడల్లా రెండు విషయాలు గుర్తుకొస్తాయి. అవి స్థలం గురించిన మా సంభాషణ. రెండవది ఇంటిపేరు ప్రస్తావన.

స్థలాలు మన పరిధిని విస్తృతం చేస్తాయి. కుదిస్తాయి కూడా.

ఇదే మాట వెంకటరావు గారితో నేను తరుచూ అనేవాడిని. చిన్న చిరునవ్వు నవ్వి వూరుకునేవారు.

వెంకటరావు విద్వత్తుకి ఆయన ఏ హైకోర్టులోనో కనీసం జిల్లా కోర్టులోనో ప్రాక్టీస్‌ చేస్తే బాగుండేది. కానీ ఆయన ఎంపిక చేసుకున్న స్థలం సిద్ధిపేట. అందుకని ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు న్యాయవాదిగా రాలేదు. అదే విషయం ఆయనతో అన్నప్పుడు ` ‘దైవం లేక విధి’ అన్న సమాధానంతో చిరునవ్వు నవ్వేవారు.

హైద్రాబాద్‌లో ప్రాక్టీస్‌ చేస్తే గొప్ప న్యాయవాదో హైకోర్టు న్యాయమూర్తో అయ్యేవారు.

వెంకటరావు ఇంటిపేరు గురించి తమాషాగా ఓ విషయం చెప్పేవారు. ఆయన ఇంటిపేరు సిరికొండ. ఆయన గ్రామం అనం తగిరి. వేములవాడలో చదువుకున్నప్పుడు అనంతగిరి పిల్లగాడు అనే వాళ్ళట. ఆ తరువాత వేములవాడలో చదువుకున్న వెంకట రావు అనే వాళ్ళట. సిద్ధిపేటలో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పటి నుంచి సిద్ధిపేట వెంకటరావుగా పిలుస్తున్నారని చెబుతూ నవ్వేవారు.

వెంకటరావులు ఎంతో మంది. మల్లెపువ్వు పరిమళంలా వెంటాడే వెంకటరావు ఒక్కడే. సిరికొండ వెంకటరావా? వేములవాడ వెంకటరావా? కాదు కాదు.