భల్లాల రాజు నిర్మించిన కోట

manachartraనాగబాల సురేష్‌ కుమార్‌ 

తెలంగాణ అంటే సాయుధ పోరాటాలకు, ఆత్మ గౌరవం కోసం గళమెత్తిన పోరు గడ్డగా ప్రపంచానికి తెలుసు. ఇదంతా నాణేనానికి ఒక వైపు మాత్రమే, మరో వైపు చూస్తే, తెలంగాణ అంటే ప్రకృతి అందాలకు, గొప్ప శిల్పకళా సంపదకు, చారిత్రక వారసత్వ సంపదలైన అనేక కోటలకు నెలవు. అంతకు మించి ఆధ్యాత్మిక శోభతో విరజిల్లే అనేక ప్రార్థనా మందిరాలకు కూడా నెలవు.

తెలంగాణ కాశ్మీర్‌గా భావించే అడవుల జిల్లా ఆదిలాబాద్‌ మొదలుకొని, మహబూబ్‌నగర్‌ వరకు ఎంతో ఘనమైన చారిత్రక వారసత్వ సంపదలకు తెలంగాణ రాష్ట్రం నిలయం.

రాష్ట్రంలో ఒక్కో జిల్లాది ఒక్కో ప్రత్యేకత. ఆదిలాబాద్‌ జిల్లాను తీసుకుంటే అడవుల జిల్లాగా అందమైన ప్రకృతి శోభకు, అమాయక గిరిజన గోండు సోదరుల నిలయంగా నిలిస్తే, జిల్లాలోని మిగతా ప్రాంతాలన్నీ ఏదో ఒక ప్రత్యేకతను కలిగి వున్నాయి. ఆదిమ గిరిజన గోండుల సాంప్రదాయాలకు మూలంగా భావించే ఆదిలాబాద్ జిల్లాలోని ‘సిర్పూర్’ ప్రాంతం దేశంలోనే మొట్ట మొదటి ‘గోండు’ రాజ్య సామ్రాజ్య స్థాపనకు నెలవైంది.

‘సిర్పూర్‌’ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘సిర్పూర్‌ పేపర్‌ మిల్‌’. భారతదేశంలో అతి పెద్ద పేపరు కర్మాగారం. 1942లో కాగజ్‌నగర్‌లో స్థాపించబడింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కి సుమారు 308 కి.మీ. దూరంలో ఆదిలాబాద్‌ జిల్లాలో వున్న సిర్పూర్‌ కోట ‘సిర్పూర్‌’ పట్టణానికి తూర్పున వుంది. సిర్పూర్‌ని గతంలో ‘సూర్యాపురం’గా పిలిచేవారు. ఒకప్పుడు ఇదంతా దండకారణ్య ప్రాంతం కాబట్టి 1200 సంవత్సరాల క్రితం ఇక్కడి ఆదిమజాతి గిరిజనులు నాగరికతకు కొంత దూరంగా ఉండేవారు. అప్పటికే కరీంనగర్‌ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులు, నిజామాబాద్‌ ప్రాంతాన్ని రాష్ట్ర కూటులు ‘మరట్వాడా’ ప్రాంతాన్ని పీష్వాలు పాలించేవారు. ఆ సమయంలో తెగలు తెగలుగా జనుగాం, సిర్పూర్‌ ప్రాంతంలో విడిపోయి బతుకుతున్న గిరిజనులను అందరినీ ఒక్కతాటి మీదికి తీసుకువచ్చిన రాజగోండు నాయకుడు ‘భల్లాల’. తమకంటూ ఒక రాజ్యం ఉండాలని భావించి సిర్పూర్‌ని మొట్ట మొదటగా తన గోండు సామ్రాజ్య స్థావరంగా ఎంచుకొని కోట నిర్మాణానికి నాంది పలికాడు. ఇతని పూర్తి పేరు ‘భీమ్ భాల్లల సింగ్’. దాదాపు 9వ శతకంలో ఈ కోటను ‘భీమ్ భాల్లల సింగ్’ నిర్మించినట్టు మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సిర్పూర్‌ కోటకు సంబంధించిన ముఖద్వారం నేటికీ శిథిలావస్థలో మనకు కనబడుతుంది. కోట చుట్టూ 18 అడుగుల ఎత్తయిన మట్టిగోడ రెండు కిలోమీటర్ల మేర నిర్మించారు. ఎత్తయిన బురుజులు, కోట చుట్టూ 12 అడుగుల లోతైన కందకం ఉండేది. కాలంతోపాటు కోటకు సంబంధించిన అనేక ఆనవాళ్ళు ధ్వంసమయ్యాయి. నాటి గోండు రాజులు నిర్మించిన అనేక కట్టడాలు పూర్తిగా శిథిలమయ్యాయి. విలువైన నిధి నిక్షేపాల కోసం కోటలో వందలసార్లు దుండగులు తవ్వకాలు జరిపారు. ఇంటి నిర్మాణాల కోసం స్థానికులు కోటకు సంబంధించిన రాళ్ళు ఉపయోగించుకున్నారు.

ప్రస్తుత పట్టణ ప్రాంతమంతా కోట చుట్టూ విస్తరించుకొని వుంది. అంటే కోట ఆనవాళ్ళు ప్రస్తుత జన జీవనంతో పాటు కలిసిపోయాయి. కాల క్రమేణా గోండు రాజుల చేతుల్లో నుంచి ఈ కోట వేములవాడ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, మరాఠాలు, మొఘలాయిలు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాఫీల చేతుల్లోకి వెళ్ళింది. డెక్కన్‌ ప్రాంతం భారత దేశంలో విలీనం అవకముందు ఈ ‘సిర్పూర్‌ తాండూర్‌’ ప్రాంతమంతా ‘నోనార్‌తాండా’ సామ్రాజ్యంలో వుండేది. అనంతరం ప్రస్తుత ఆదిలాబాద్‌ (ఎదులపురం)లో విలీనం అయింది. గతంలో ఎదులాపురంగా ఉన్న ఆదిలాబాద్‌, బీజాపూర్‌ సుల్తాన్‌, అలి అదిల్‌షా పేరు మీదుగా ఆదిలాబాద్‌గా మార్పు చెందింది. ‘అలి అదిల్‌షా’ బీజాపూర్‌ ప్రాంత సామ్రాజ్యానికి సుల్తాన్‌గా వుండేవారు.

1724 ప్రాంతంలో నిజాం ఇ ముల్క్‌, ముబారిజ్‌ ఖాన్‌ని ఓడించి దక్కన్‌ ప్రాంతానికి చక్రవర్తిగా వ్యవహరించి దర్గాలు, మసీదుల నిర్మాణాలను మొదలుపెట్టాడు. అయితే 1773లో మల్సోజి భోంస్లే తన సామ్రాజ్యాన్ని (రాజూరా – చంద్రాపూర్‌) ఒప్పందాన్ని అనుసరించి నిజాం అలీ ఖాన్‌కి అప్పగించాడు. అయితే రాంగోజి భోంస్‌లేకి, బ్రిటీషు పాలకులకు మధ్య వచ్చిన యుద్ధం వాతావరణం కారణంగా, అతడు నిజాంల మద్దతు కోరగా, నిజాం అతనికి సాయపడ్డాడు. ఆ విధంగా డెక్కన్‌ ప్రాంతంలో వున్న గోండ్వానా ప్రాంతం నిజాంల చేతుల్లోకి వెళ్ళింది.

అంతటి ఘన చరిత్ర కలిగిన సిర్పూర్‌ కోటలో హిందువులు, ముస్లిమ్‌లకు సంబంధించిన అనేక కట్టడాలు నిర్మించబడి వివిధ మతాలు సంస్కృతులకు సమ్మేళనానికి నెలవైంది.

జనుగాం, తిర్యాని, వాంకిడి, కేరామేరి, గాంధారి ఖిల్లా, తాండూరు, సిర్పూరు ప్రాంతాల్లో చెల్లా చెదురుగా ఉన్న గోండులందర్నీ ఏకతాటిపైకి తెచ్చి వారిని ఒక జాతిగా నిలబెట్టింది మాత్రం గోండు సామ్రాజ్యపు మొదటి రాజు ‘కోల్‌బిల్‌’. అతని అద్భుత సామర్థ్య నైపుణ్యాలే గోండులను ఒక బలమైన శక్తిగా ఒక జాతిగా నిలబెట్టింది.

‘కోల్‌ బిల్‌’ గోండులను చైతన్యపరిచి, వారిని వికాసవంతుల్ని చేయటానికి నిరంతరం కృషి చేశారు. ఆ మార్గంలోనే మిశ్రమలోహాల నుండి ఇనుమును వెలికితీసే విద్యను వారికి నేర్పించాడు. ఇది వారి జాతి సాధించిన మొదటి విజయంగా గోండులు భావిస్తారు. కోల్‌బిల్‌ స్పూర్తితో గోండులు ఎంతో పరివర్తన చెంది వారి జీవితాల్ని వికాసవంతం చేసుకున్నారు. ఈ నూతన ప్రక్రియని వారిని సొంత ఆయుధాలను తయారు చేసేవరకు తీసుకెళ్ళి వారిలో సొంత సామ్రాజ్య కాంక్షను కలిగేలా చేసింది. ఆ కాలంలో వారి చుట్టూ నెలకొని వున్న వివిధ సామాజిక పరిస్థితులే వారి స్వరాజ్య కాంక్షకు కారణమయ్యేలా చేసి వారిని చైతన్యవంతుల్ని చేసింది. ఈ ఇనుము పరికరాల తయారీ మూలంగా వీరిని చూసి ఇతర సామ్రాజ్య రాజులు సైతం భయపడేలా చేసింది. గోండు సామ్రాజ్య విస్తరణలో ఎక్కువగా తోడ్పడింది. గోండు సామ్రాజ్య మొదటి ముగ్గురు రాజులు ‘భీమ్‌ భల్లాల్‌ సింగ్‌, కార్జా భల్లాల్‌ సింగ్‌, హీర్‌ సింగ్‌’. ఇందులో కార్జా భల్లాల్‌ సింగ్‌ కొంచెం మృదుస్వభావం గల వ్యక్తి. అయితే కార్జా కొడుకైన హీర్‌ మాత్రం వివేకవంతుడు, అతను ప్రజల మనిషిగా చరిత్రలో నిలిచిపోయాడు. మొట్టమొదటిసారి భూమి శిస్తు విధానాన్ని వారి సామ్రాజ్యంలో అమలు చేసిన నాయకుడు ఇతడే. ఇతడు ఆదియా భల్లాల్‌ సింగ్‌పై పోరాడి అతన్ని ఓడించాడు. ఆదియా భల్లాల్‌ సింగ్‌ ఒక క్రూర స్వభావం గల వ్యక్తి.

ఈ ఆదియా భల్లాల్‌ సింగ్‌ తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో తన సామ్రాజ్యపు రాజధానిని సిర్పూర్‌ నుండి ‘భల్లార్షా’కు మార్చాడు. ఇతని పేరుమీదుగానే ఆ ప్రాంతానికి ‘భల్లార్షా’గా పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. భల్లార్షా

మొగలుల ఆధిపత్యం మూలంగా వారు తమ నావికాదళ సైన్యంతో చాందా సామ్రాజ్యం నుండి తమ దండయాత్రలను మొదలుపెట్టారు. అయితే అక్బర్‌ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా బెరార్‌ను వశపరచుకున్న తరువాత తన రాజ్య కాంక్షను గోండు సామ్రాజ్యాలమీద దండ యాత్రల ద్వారా తీర్చుకున్నాడు. ఆ విధంగా ‘వార్దా’ సామ్రాజ్యాన్ని వశపరచుకొని ‘చంద్రాపూర్‌’ వరకు రాగా ‘చంద్రాపూర్‌’ రాజు అక్బర్‌తో సంధి చేసుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. 

కోటని తన సైనిక, ఆర్ధిక స్థావరంగా ఏర్పరచుకున్నాడు. అయితే గోండు రాజుల సామ్రాజ్యాన్ని స్థాపించిన ‘కుల్‌ బిల్‌’ గోండు సామ్రాజ్యాన్ని ‘సిర్పూర్’ (తెలంగాణ ప్రాంతం) కేంద్రంగా రాజ్య స్థాపన చేశారు.

18 మంది గోండు రాజులు 870 నుండి 1751 వరకు అంటే సుమారు 880 సంవత్సరాల పాటు పాలించినట్టు చారిత్రక ఆధారాలు లభించాయి. ఈ రాజులు మొదటగా సిర్పూర్‌ అనంతరం బల్లార్షా ఆ తర్వాత చంద్రాపూర్‌ కేంద్రంగా తమ పాలన కొనసాగించినా మొదటి కోట సిర్పూర్‌పై మాత్రం వారికి ప్రత్యేక అభిమానం ఉండేది. గోండు రాజ్య స్థాపన అధికారికంగా క్రీ.శ. 870లో సిర్పూర్ రాజధాని కేంద్రంగా జరిగినా సిర్పూర్‌ కోటలో వారు క్రీ.శ. 1242 వరకే పాలించారు.

సిర్పూర్ సామ్రాజ్యం క్రింద తాండూర్, గాంధారి, జునగాం, దవేదుర్గం, వెల్లి మొదలైన ప్రాంతాలు ఉండేవి. ఆయా ప్రాంతాల్లో సామంతరాజులు సిర్పూర్‌ రాజులకు కప్పం కడుతూ పరిపాలనను కొనసాగించేవారు. ఆ కాలంలో ఈ ప్రాంతంలో ఎక్కుకవగా గోండుల ఆధిపత్యమే ఉండేది. ఇతర రాజుల దండయాత్రలు గోండు రాజులపై మొదలైన తర్వాత వివిధ కులాలవారు, మతాలవారు ఈ ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం ప్రారంభమైంది. గోండు రాజులు తమ పాలన సజావుగా సాగటానికి పాలనలో మంత్రులుగా, సలహాదారులుగా నియమించుకోవడానికి, వార్ధా, నాగ్‌పూర్‌ ప్రాంతాల నుండి కొంతమంది బ్రాహ్మణులను, షావుకార్లను రప్పించుకున్నారు. బల్లాల్‌షా తన రాజదానిని బల్లార్షాకుమార్చటంతో సిర్పూర్‌ కోట కొంత కాలం పాటు రాజులు లేకుండా ఉండిపోయింది. పరిపాలనా సౌలభ్యం కోసం బల్లాల్‌ షా సిర్పూర్‌లో గోండు సామంత రాజులను కొనసాగించాడు. ఆ రాజులు కోటను పటిష్టపరచి సిర్పూర్‌ ప్రాంతంలో గోండు రాజ్య విస్తరణ జరిగేలా కృషి చేశారు.

గోదావరి తీర ప్రాంతం నుండి క్రమంగా కాకతీయులు, చాళుక్యుల దండయాత్రలు ఒకవైపు, మొఘల్‌ సేనల దురాక్రమణ మరొకవైపు నుండి కొనసాగటంతో సరైన సెనిౖక బలం లేని గోండు రాజులు చంద్రాపూర్‌ మహారాజు రక్షణలోకి వెళ్ళిపోయారు. ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావటం వల్ల కొంత, అడవీ జంతువుల భయం వల్ల మరికొంత, ఎడతెగని కరువుకాటకాల పీడన వల్ల కొంత ‘సిర్పూర్‌ ప్రాంతం’లో గోండు రాజులు స్థిమితంగా పాలన సాగించటం కష్టమైంది. కోటలో 12 వందల ఏళ్ళ నాడు వారు నిర్మించిన రాతి నిర్మాణాలు ఈ నాటి వారిని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి, అబ్బుపరుస్తున్నాయి.

మొగలుల ఆధిపత్యం మూలంగా వారు తమ నావికాదళ సైన్యంతో చాందా సామ్రాజ్యం నుండి తమ దండయాత్రలను మొదలుపెట్టారు. అయితే అక్బర్‌ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా బెరార్‌ను వశపరచుకున్న తరువాత తన రాజ్య కాంక్షను గోండు సామ్రాజ్యాలమీద దండ యాత్రల ద్వారా తీర్చుకున్నాడు. ఆ విధంగా ‘వార్దా’ సామ్రాజ్యాన్ని వశపరచుకొని ‘చంద్రాపూర్‌’ వరకు రాగా ‘చంద్రాపూర్‌’ రాజు అక్బర్‌తో సంధి చేసుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే ఒకానొక సమయంలో గోండులు తమ ఆధిపత్యాన్ని ‘వార్ధా’ వరకు కూడా కొనసాగించారు. చరిత్ర, కాలం మారుతున్న కొలదీ బెరార్‌ సామ్రాజ్య విస్తరణ వరకు వున్న గోండు సామ్రాజ్యాలు కాలక్రమేనా తరుగుతూ బహుమనీ సుల్తానులు, ఆ తరువాత గోల్కొండ నవాబులు, అనంతరం నిజాముల దండ యాత్రల వల్ల వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇంతటి చరిత్ర కలిగిన గోండు సామ్రాజ్యపు ఆనవాళ్ళు ఇప్పటికీ సిర్పూర్‌లోని కోటలో నిక్షిప్తమై వుండి వారి తాలూకు వైభవాలను నేటి వారికి తెలియజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కోటలో కొన్ని మరమ్మతులు జరిపి పర్యాటకులకు కొన్ని వసతులు కల్పిస్తే ఇది మంచి పర్యాటక స్థలంగా మారుతుంది.