శృంగేరి దర్శనం

కవి, రచయిత, విమర్శకులుగా సాహితీ లోకానికి పరిచితులైన ప్రసాద వర్మ కామఋషి ఆధ్యాత్మిక తత్త్వవేత్త. ఆది శంకరుల యెడ ఎనలేని భక్తి. ఆ భక్తి ప్రపత్తులే శంకరుల వారు మొట్టమొదట స్థాపించిన శృంగేరి శారదాపీఠంపై ప్రస్తుత సంకలనాన్ని వ్రాయ పురిగొల్పింది. సనాతన ధర్మ సంరక్షణకై శంకర భగవత్పాదుల వారు (788 – 820 ఎడి) దేశమంతా పర్యటించి అద్వైత మత ప్రచారంలో భాగంగా నాలుగు దిక్కులందు 4 పీఠములను స్థాపించినారు. పవిత్ర తుంగభద్రా నదీ తీరాన వీరిచే ప్రతిష్టించబడిన శృంగేరీ శ్రీ శారదా పీఠము నేటి వరకు అవి చ్ఛిన్న గురు పరంపరతో అలరారుతూ, భక్తులకు ఆధ్యాత్మికా నందాన్ని కలుగ చేస్తున్నది. సాక్షాత్తు పరమేశ్వరావతారముగ కొలువబడే శంకర భగవత్పాదుల జననం, బాల్యం, సన్యాసము, వారి దేశాటనము, శంకరుల వారి గురువులు, ఆయన శిష్యుల గురించి యే కాకుండా వారి అద్వైత సందేశ సారాంశము, వారి రచనలు వివరిం చబడ్డాయి. శృంగేరి పీఠ చరిత్ర సరళమైన భాష, శైలితో వ్రాయబడింది. ఉపన్యాస ధోరణిలో కాకుండా, ఎన్నో ఆసక్తికరమైన అంశాలను ఇచ్చి రచయిత పఠనీయతను పెంచారు. నర్మదా నది ఉప్పొంగి ఊళ్ళు ముంచెత్తితే, శంకరుల వారు తన కమండలాన్ని అడ్డుపెట్టి ప్రవాహాన్ని ఆపారట! (పే. 25) ఋష్యశృంగుడను ఋషి యాగము చేసిన స్థలము కనుక ఆ పేరు వచ్చినదట! (పే 48) శృంగేరికి సమీపమున ‘కెగ్గ’ అనే గ్రామంలో ఋష్య శృంగుడు శివైక్యము చెందినందుకు సాక్ష్యంగా శివలింగముపై శృంగము గుర్తు ఉన్నదట! (పే 48) ఆచార్య పరంపరలో మొట్టమొదటి వారు సురేశ్వరాచార్యులు (పే. 51). నాటి విజయనగర స్థాపనకై ప్రేరణ అందించిన శ్రీ విద్యారణ్యులు 12వ గురువు (పే 48).శంకరుల వారి జయంతి (వైశాఖ శుద్ధ పాడ్యమి)ని ఫిలాసఫర్స్‌ డే గా పరిగణించవలెనట! (పే 112) ఒక మత పెద్దకు జనాకర్షణకై లౌకిక పరమైన అధికారం, ఆకర్షించే ఆడంబరాలుండాలట! (పే 49). ‘ఎప్పుడైతే మీకు ప్రాపంచిక విషయాల్లో శాంతి కరువవుతుందో, ఎప్పుడైతే మీకు జీవితం అస్తవ్యస్తం అయినట్లనిపిస్తుందో… అప్పుడు శృంగేరి సందర్శించండి’ అనే జనవాక్యం ప్రత్యక్షర సత్యం. శారదా పీఠ చరిత్ర, అక్కడి ఆలయాలు, మఠసాంప్రదాయాలు, ముఖ్య ఉత్సవ వివరాలు, యాత్రీకుల కవసరమయ్యే సమాచారము మున్నగు వివరాలను ఇచ్చి రచయిత ఈ సంకలనం యొక్క విలువను ఇనుమడింపచేశారు.

శృంగేరి శ్రీ శారదా పీఠము 
(చరిత్ర సాంప్రదాయాలు) 
రచన: ప్రసాదవర్మ కామ ఋషి
వెల: రూ. 150
కాపీలకు: రచయిత
ఆర్‌.కె. పురం, సికింద్రాబాద్‌, 
ఫోన్‌: 9441274034,
సిహెచ్‌వి. రత్న ప్రసాద్‌, 
ఫోన్‌: 9849159260
శృంగేరి శ్రీ శారదా పీఠం బుక్‌ స్టాల్‌, 
శృంగేరి - 577139