టీ హబ్‌ అద్భుతం మైకోస్రాఫ్ట్‌ సీఈఓ సత్యా నాదెండ్ల

t-hubతెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి) సత్యా నాదెండ్ల ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుమూల గ్రామాలకు కూడా విస్తరింపచేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని, సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోని అన్ని ప్రాంతాలను కలపాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. అందుకు ‘వైట్‌ స్పేస్‌ టెక్నాలజీ’ (నిరుపయోగంగా ఉన్న తరంగాలు) ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిద్వారా ప్రతి ఒక్కరికీ ఇంటర్‌నెట్‌ (అంతర్జాలం) అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ విషయంలో ఔస్సాహిక పారిశ్రామిక వేత్తలను తమ కంపెనీ ప్రోత్సహిస్తుందని ప్రకటించారు. ప్రతి వ్యక్తి ఇంటర్‌నెట్‌తో అనుసంధానం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. డిసెంబరు 28న ఆయన ఐటి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆహ్వానం మేరకు టీ హబ్‌ను సందర్శించారు.

తాము చదువుకునే రోజుల్లో ఇలాంటి టీ హబ్‌లు లేవని, అప్పట్లో టీ అంటే ట్యాంక్‌బండ్‌ మాత్రమేనని చలోక్తి విసిరారు. ఇప్పుడు నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ సాంకేతికాభివృద్ధి ఫలాలు మారుమూల గ్రామాల ప్రజలకు కూడా దక్కాలన్నదే తమ సంకల్పమన్నారు. ఏది సాధించాలన్నా ముందు కొన్ని వైఫల్యాలు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని, పాఠాలు నేర్చుకుని విజయం వైపు పయనించాలన్నారు. మన మస్తిష్కాల్లో మెరిసిన ఆలోచనలకు కార్యరూపం తీసుకురావడానికి ఎవరికి వారు తమ కృషిని కొనసాగించాలన్నారు. పని సంస్కృతిని అలవరచుకుని ముందుకుసాగుతే విజయాలు వాటంతట అవే మన వద్దకు వస్తాయన్నారు. ఆలోచనలు ఎంత కొత్తగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటే అంతగా విజయం చేకూరుతుందన్నారు. వ్యాపార రంగంలో విజయసోపానాలు అధిష్టించడానికి ఇవే మార్గాలన్నారు. తన విజయాలన్నీ కూడా ఓటములనుంచి వచ్చినవేనన్నారు. సమాచార, సాంకేతిక రంగాలలో భారతీయుల నైపుణ్యాలు, విజయాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. త్వరలోనే ప్రపంచ ఐటీ రంగాన్ని శాసించే స్థాయికి భారతీయులు ఎదుగుతారన్నారు.

ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్‌తో కలిసి సాగడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సత్యా నాదెండ్ల టీహబ్‌ పట్ల ఎంతో ఆసక్తి చూపారన్నారు. మా సమావేశం ఉత్సాహవంతంగా, అద్భుతంగా జరిగిందన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కృషిచేస్తామని సత్య నాదెండ్ల హామీ ఇచ్చారన్నారు. టీహబ్‌ ద్వారా స్టార్ట్‌ప్‌లకు మరింత మెరుగైన సదుపాయాలు, అవకాశాలు కల్పించేందుకు మైక్రోసాఫ్ట్‌ సహాయాన్ని తీసుకుంటామన్నారు. ఈ ప్రతిపాదనను సత్య నాదెండ్ల ముందు పెట్టగా ఆయన విశేష ఆసక్తి కనబరిచారన్నారు.

మైక్రోసాఫ్ట్‌ వైట్‌స్పేస్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాలకు ఇంటర్‌నెట్‌ను అందిస్తామని తెలిపారు. టెక్నాలజీ సౌకర్యాన్ని విద్యారంగానికి అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ఈ క్రమంలో స్కూళ్ళలో ఈ-లెర్నింగ్‌కు పెద్ద పీట వేస్తున్నామన్నారు. తెలంగాణలోని పాఠశాలలను కంప్యూటరీకరణ చేసేందుకు ముందుకు రావాలని మైక్రోసాఫ్ట్‌ను కోరుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లా మహబూబ్‌నగర్‌లో వైట్‌స్పేస్‌ టెక్నాలజీ ద్వారా సాంకేతిక ఫలాలను ప్రజలకు అందించాలని సంకల్పించినట్లు తెలిపారు.

సత్యా నాదెండ్ల సుమారు మూడు గంటలపాటు టీహబ్‌లో గడిపారు. కేటలిస్ట్‌ విశిష్టతలను మంత్రి కేటీఆర్‌ వివరిస్తున్న సమయంలో సత్యా నాదెండ్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిగా శక్తిని వినియోగించుకునే గ్రీన్‌ బిల్డింగ్‌గా తీర్చిదిద్దిన తీరును ఆయన అభినందించారు.

ఉత్సాహవంతులైన ప్రారిశ్రామిక వేత్తలకు స్ఫూర్తి నింపే విధంగా టీహబ్‌ ఉందని అంటూ తన ఫోటోను కూడా పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దానిపై ఆటోగ్రాఫ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీహబ్‌ సీఈఓ జయ్‌ కృష్ణన్‌, టీహబ్‌ సీఈఓ శ్రీనివాస్‌ కొల్లిపర, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం తదితరులు పాల్గన్నారు.