పోటీ పరీక్షలకు టి. సాట్‌

By: పీసరి లింగారెడ్డి

పల్లె నుండి పట్నం…పిల్లాడి నుండి ముదుసలి…విద్యార్థి నుండి అధికారి వరకు… ఇలా ఒక్కరేమిటి అన్ని వర్గాలూ టి-సాట్‌ పాఠ్యాంశాలనే కోరుకుంటున్నాయి.యువతీ-యువకులు, మహిళలు, మూగ- చెవిటి, వికలాంగులు, మానసిక వికలాంగులు…తర తమ బేధం లేకుండా అన్ని వర్గాలకు టి-సాట్‌ నెట్‌వర్క్‌ సేవలందిస్తోంది. సామాన్య వ్యక్తి నుండి ముఖ్యమంత్రి వరకు టి-సాట్‌ నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ఉటంకిస్తూ అభినందనలు తెలుపుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు, ఐఏఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ‘టి-సాట్‌ భేష్‌’ అని కితాబులిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన ప్రకటనతో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ‘మాకు టి-సాట్‌ పాఠ్యాంశాలు కావాలి’ అని పట్టుబడుతున్నారంటే టి-సాట్‌ ప్రసారం చేసే పాఠ్యాంశాలకు ఎంత ప్రాధాన్యత పెరిగిందో ఇట్టే అర్థమౌతుంది.

‘తింటే గారెలు తినాలి…వింటే టి-సాట్‌ పాఠాలు వినాలి’ నేటి సామెతగా ప్రాచుర్యం పొందుతోంది. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు టి-సాట్‌ ప్రసారం చేసే పాఠ్యాంశాలే బాగున్నాయంటూ వినేందుకు పోటీ పడటం అందుకు నిదర్శనం.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుండి టి-సాట్‌ నెట్వర్క్‌ లో గ్రూప్‌-1, పోలీసు ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవగాహన పాఠ్యాంశాలు కొనసాగుతున్నాయి. టెట్‌ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కు గత రెండు నెలలుగా ప్రసారాలు అందించి పోటీ పరీక్షకు సిద్ధం చేసింది. గ్రూప్‌-1 ఉద్యోగాలకు తెలుగు, అంగ్లమాధ్యమంలో సుమారు 1200 గంటలు, పోలీసు ఉద్యోగాలకు సంబంధించి సుమారు 600 గంటలు పాఠ్యాంశాలను ప్రణాళిక ప్రకారం ప్రసారం చేస్తోంది. ఇప్పటికే టెట్‌ కు 150 గంటల ప్రసారాలు అందించి వారు పరీక్షలు విజయవంతంగా రాసేందుకు చేయూతనిచ్చింది. భవిష్యత్‌ లో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే వైద్య-ఆరోగ్య శాఖ, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్‌, పంచాయత్‌ రాజ్‌ తదితర శాఖల ఉద్యోగాలకు సంబంధించిన కంటెంట్‌ అందించేందుకు టి-సాట్‌ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుని సిద్ధంగా వుంది. పోటీ పరీక్షలతో పాటు పాఠశాలల విద్యార్థులకు సైట్‌ (ఎస్‌.ఐ.ఈ.టి) ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు డిజిటల్‌ పాఠాలను అందించేందుకు షెడ్యూలు ఖరారు చేసినట్లు సీఈవో రాంపురం శైలేష్‌ రెడ్డి స్పష్టం చేశారు. వీటితో పాటు వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం, యోగా, వృత్తి నైపుణ్యం, పాలిసెట్‌, ఎంసెట్‌ వంటి అంశాలపైనా ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు చేస్తోంది.

రెండు నెలల్లో 2,23,440 సబ్‌ స్క్రైబర్లు

పోటీ పరీక్షలు ప్రారంభమైన రెండు నెలల్లో టి-సాట్‌ యాప్‌, యూట్యూబ్‌లో సుమారు 2.23,440 స్క్రైబ్స్‌ లభించాయి. వీటిలో యాప్‌  163.44కె, యూట్యూబ్‌ 60.1కెగా నమోదు అయ్యాయి. యాప్‌ వ్యూస్‌ 1.89 మిలియన్‌, యూట్యూబ్‌ వ్యూస్‌ 6.1 మిలియన్‌ గా నమోదు కాగా, యాప్‌ పూర్తి కాలపు వ్యూస్‌ 13.74 మిలియన్‌,  సబ్‌ స్క్రైబ్స్‌ 1.02 మిలియన్‌, యూట్యూబ్‌ వ్యూస్‌ 82.8 మిలియన్‌,  సబ్‌ స్క్రైబ్స్‌ 675.7కె లభించాయి అంటే పాఠ్యంశాలకు ఎంత ప్రాధాన్యత ఉందో గుర్తించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన నిస్వార్థ సేవలందిస్తున్న టి-సాట్‌ ను, సంబంధిత అధికారులకు, సామాన్య వ్యక్తి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అభినందనలు, ప్రశంసలు అందుతున్నాయి.

టి-సాట్‌ ప్రసారాలకు లభిస్తున్న ఆదరణను తెలుసుకుని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు దానిని ఉపయోగించుకోండి. ముఖ్యంగా వ్యయసాయంలో పంట మార్పిడి… సాగు పద్ధతుల వంటి విషయాల ప్రచారానికి వాడుకోండి… ఇతర ప్రత్వ కార్యక్రమాలను కూడా టి-సాట్‌ ఛానల్‌ ద్వార నిర్వహించుకోండి..గత కొన్ని నెలల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన సహచర మంత్రులు, అధికారులనుద్దేశించి మాట్లాడిన మాటలు.

టి-సాట్‌ వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి.

టి-సాట్‌ ఛానళ్లు పోటీ పరీక్షలకు అవగాహన పాఠ్యాంశాలు ప్రసారం చేయడం వల్ల నాకు పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. ఇంటి దగ్గరే ఉండి టి-సాట్‌ ప్రసారం చేసే పాఠ్యాంశాలు  రెగ్యులర్‌గా చూశాను. కోచింగ్‌ వెళ్లాల్సిన పని లేకుండా అయింది. ఎటువంటి ఖర్చు లేకుండా పోటీ పరీక్షలకు సిద్ధమై ఉద్యోగం పొందగలిగాను.. క్రెడిట్‌ అంతా టి-సాట్‌ దే…

          – నరేష్‌, పోలీస్‌ ఉద్యోగం పొందిన యువకుడు

‘నేను డ్రైవింగ్‌ చేస్తాను. మా సార్‌తో డ్రైవింగ్‌కు వెళ్లాక…ఖాళీ సమయాల్లో మొబైల్‌లో టి-సాట్‌ కాంటీటివ్‌ ఎగ్జామ్స్‌ పాఠాలు వినే వాడిని…ఆ పాఠాల ద్వార చాలా నేర్చుకున్నాను. కోచింగ్‌కు వెళ్లకుండా ఉచితంగా ఉద్యోగం పొందగాలిగాను…

          – శ్రీకాంత్‌, ఉద్యోగం పొందిన మరో యువకుడు.

తెలంగాణ ప్రభుత్వం సుమారు 80 వేల కొత్త ఉద్యోగాల భర్తీకి సిద్ధమై సుమారు 11 వేల ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించింది. టెట్‌ అర్హత పరీక్ష కు పోటీ పడే అభ్యర్థుల కోసం ఏప్రిల్‌ నాల్గవ తేదీ నుండి జూన్‌ ఐదవ తేదీ వరకు టి-సాట్‌ అవగాహన పాఠ్యాంశాలు ప్రసారం చేసింది. జూన్‌ ఐదవ తేదీ వరకు 60 రోజుల పాటు 120 పాఠ్యాంశ భాగాలతో రికార్డెడ్‌, వారం రోజుల పాటు రెండు పేపర్లకు సంబంధించి లైవ్‌ 78 పాఠ్యాంశాలను టి-సాట్‌ నిపుణ ఛానల్‌ ప్రసారం చేసింది. టి-సాట్‌ యూట్యూబ్‌ వ్యూస్‌ 7.25, వాచ్‌ టైమ్‌ 7,897 గంటలు, ప్రతి వీడియో యావరేజ్‌ వాచ్‌ టైమ్‌ 15 నిమిషాలుగా నమోదు అయింది. టి-సాట్‌ యాప్‌ లో వారం రోజుల్లో 27 పాఠ్యాంశాలు అప్‌ లోడ్‌ చేయగా 4.50 లక్షల వ్యూస్‌ లభించాయి. అంటే  కేవలం వారం రోజుల్లో 11.25 వ్యూస్‌ లభించడం పాఠ్యాంశాల ప్రాధాన్యతను గుర్తుచేస్తుంది.

టి-సాట్‌ మంచి పని చేస్తుంది. యు ఆర్‌ డూయింగ్‌ గుడ్‌ జాబ్‌. మీ లెవెల్‌ లో మీరు కష్టపడుతున్నారు. మిగతా డిపార్ట్‌ మెంట్స్‌ ఎఫెర్ట్స్‌ పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం మంచి డయాస్‌ ఏర్పాటు చేసింది. మిగతా వారంతా ఉపయోగించుకోండి’ అని గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో అభినందిస్తూ మిగతా శాఖలకు పలు సూచనలు చేశారు గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఉన్న సి.ఎస్‌. సోమేష్‌ కుమార్‌.

విద్యార్థుల పాలిట ప్రభుత్వ వరం

కోవిడ్‌ సందర్భంగా చివరి విద్యార్థి వరకు నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆలోచన చేసి టి-సాట్‌ యాప్‌, యూట్యూబ్‌ ద్వార పాఠ్యాంశాలను మూడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు మూడు మాథ్యమాలు  తెలుగు, ఉర్డూ, ఇంగ్లీష్‌ భాషల్లో అందించాం. గతంలోని పాఠ్యాంశాలను పున:శ్ఛరణ చేసుకునేందుకు బ్రిడ్జి కోర్సును కూడా టి-సాట్‌ ద్వార ప్రసారం చేసి విద్యార్థులకు విద్యా సంవత్సరాలు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలు టి-సాట్‌ టీవి చూస్తున్నారా లేదా…యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకుని వీక్షించారా లేదా…పాఠాలు ఎంతవరకు నేర్చుకున్నారా లేదా అనేది తప్పకుండా చెక్‌ చేయాలి…విద్యార్థులు టి-సాట్‌ పాఠాల ద్వార ఎంత వరకు నేర్చుకున్నారో ఉపాధ్యాయులు కూడా చెక్‌ చేయాలి.

– శ్రీదేవసేన, కమిషనర్‌, పాఠశాల విద్యాశాఖ

అద్భుతమైన వేదిక టి-సాట్‌

‘‘బ్రహ్మండమైన ఇనిస్టిట్యూట్స్‌ ఉన్నాయి, టి-సాట్‌ పేరిట ఒక అద్భుతమైన నెట్వర్క్‌ నడుపుతున్నాం. ఇస్రోతో ఒప్పందం చేసుకుని ఈ రోజు రాష్ట్రంలో ఇంటింటికీ కేబుల్‌ టీవి ద్వార ప్రతి పోటీ పరీక్షకు తయారయ్యే విధంగా అందులో కోచింగ్‌ ఇస్తున్నాం. 35 లక్షల మంది సబ్‌ స్క్రైబ్స్‌, వ్యూస్‌ ఉన్నాయి. టి-సాట్‌ కంటెంట్‌ యూట్యూబ్‌లో కూడా పెట్టాం… ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు.మరో సందర్భంలో  ‘రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో  కోవిడ్‌ రాక ముందే టి-సాట్‌ ఆధ్వర్యంలో విద్య ఒక ఛానల్‌, నిపుణ ఇంకో ఛానల్‌, రెండు ఛానళ్లు కేవలం కేబుల్‌ టీవి ద్వార మాత్రమే కాదు డిజిటల్‌ ప్లాట్‌ ఫాం ద్వార సేవలు అందిస్తున్నాయి. యూట్యూబ్‌ లో 33 లక్షల మంది సబ్‌ స్క్రైబ్స్‌, సుమారు 1500 గంటల పై చిలుకు విలువైన కంటెంట్‌ ఉంది. మీ పిల్లలందర్నీ కోరేదేమంటే  మీరు ట్రైనింగ్‌ తీసుకునే నాలుగైదు నెలలకు  ఒక్కొక్కరికి   40 నుండి 50 వేలు రూపాయలు ఖర్చౌతుంది ప్రయివేటులో… మీకు ఆ ఖర్చు తగ్గాలి, తప్పాలి అన్న ఉద్దేశ్యంతోనే ప్రభుత్వమే ఈ రకంగా కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ మీకేమైనా అర్థం కాలేదంటే  ఇంటికి పోయి చూసుకోవడానికి టి-సాట్‌ యూట్యూబ్‌ ద్వార ఫోన్‌ లో లేదా టీవిలో చూసుకోవాలి మా చెల్లెళ్లు, తమ్ముళ్లు’’… బహిరంగ సభలో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులనుద్దేశించి మంత్రి కేటీఆర్‌ అన్నారు.

కోచింగ్‌ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు

రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే ప్రతి ఉద్యోగానికి టి-సాట్‌ నెట్వర్క్‌ కోచింగ్‌ అందించనున్నది. అనుభవం కలిగిన ఫ్యాకల్టీ, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాఠ్యాంశ ప్రసారాలు చేస్తున్నామని, ఉచితంగా అందించే ప్రసారాలను సద్వినియోగం చేసుకోండి. కోచింగ్‌ సెంటర్లకు వెచ్చించే లక్షల రూపాయలు  ఆదాచేసుకోవాలని సీఈవో రాంపురం శైలేష్‌ రెడ్డి  యువతకు సూచించారు.

  • ఆర్. శైలేష్ రెడ్డి, టి. శాట్ సీఈవో