నోరూరించే తెలంగాణ వంటకాలు

నోరూరించే--తెలంగాణా-వంటకాలభారతీయ వంటల్లో భళా అనిపించే తెలంగాణ వంటలన్నింటినీ ఏర్చికూర్చి తీర్చిదిద్దిన తీరైన పుస్తకం ఈ తెలంగాణ ఇంటివంట పుస్తకాలు. స్థానిక వనరులతో వండుకునే వంటలు ఆయా ప్రాంతపు వంటలుగా ప్రసిద్ధి పొందుతాయి. ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా వండుకునే వంటలన్నింటినీ, ఇతర ప్రాంతాలలో వుండే వారితోపాటు తెలంగాణలో వుండేవారికి కూడా పరిచయంలేని వంటలు వుంటే వారందరికీ తెలియవచ్చే విధంగా సిద్ధం చేసిన ‘‘వడ్డించిన విస్తళ్ళు’’. ఈ రెండు పుస్తకాలు అందరి రుచులకి అదనపు వనరులుగా పనికిస్తాయి.

రెండు పుస్తకాలలో భిన్నరుచులను విభిన్న అభిరుచులున్న వారందరికీ అవసరమయ్యే విధంగా రూపొందించారు. వెజ్‌, నాన్‌వెజ్‌గా రెండు పుస్తకాలను, శాఖాహార, మాంసాహార ప్రియులను దృష్టిలో వుంచుకుని అందరికీ అర్థమయ్యి, ఆయా వంటకాలను సులభంగా వండుకుని తినగలిగే విధంగా ‘అక్షరపాకం’గా అమర్చారు జ్యోతి వబోజు.

ఇక వెజ్‌ విభాగాన్ని పరిశీలిస్తే ఇందులో స్వీట్లు, టిఫిన్లు, పచ్చళ్ళు, పప్పు, పుసుకూరు వగైరా అన్నింటినీ వంటింటి పరిధిలోనే పదిలపరిచారు. వీటన్నింటిలోనూ కొన్ని వంటకాలను వేరే ప్రాంతాల్లో మరొక పేరుతో పిలిచే వంటకాలను తెలంగాణ ప్రాంతంలో పిలిచే పేరుతో పరిచయం చేయడం బాగుంది. ఉదాహరణకు పోలొ/భక్ష్యాలు, పరమాన్నం/బెల్లపు అన్నము, గుడాలు/గుగ్గిళ్ళు ఇలా అన్నిరకాల వంటలని అందంగా అక్షరీకరించారు రచయిత్రి.

నాన్‌వెజ్‌ విషయానికి వస్తే కోడిగుడ్ల కూరలు మొదులుకొని తలకాయ, బోటి, బొమ్మిడిచాపలు, ఎండ్రికాయనుండి మాంసాహార సమాహారంగా వివరంగా మలిచారు పుస్తకాన్ని. మాంసాహారం వంటలు వండుకునే చాలామందికి అన్ని రకాల కొత్తగా విని/అనిపించే మాంసాహార పచ్చళ్ళను కూడా పరిచయం చేశారు రచయిత్రి.

ఈ పుస్తకాలను అక్షరబద్దం చేయడంలో రచయిత్రి చేసిన కృషి తన ముందుమాటలో పొందుపరిచారు. ఈ పుస్తకాలు రెండూ వంటలు నేర్చుకునే వాళ్ళకే కాకుండా తెలంగాణ ప్రాంతంవారి అభిరుచులను తెలుసుకోగోరే వారికి కూడా ఉపయోగకరంగా వుంటాయి.

– ఎంకె