విద్యారంగ వికాసం
విజ్ఞాన ప్రపంచం తలుపులు తెరవడానికి కావల్సిన సాధనం విద్య. విద్య జ్ఞానంతోపాటు మనిషికి ఒక గుర్తింపునిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విద్యావంతులతో నిండిన సమాజమే అభివృద్ధి పథంలో వేగంగా పయనించగలుగుతుంది. విద్యా వికాసాన్ని సాధించిన సమాజాలు ఇతర రంగాలలోనూ ముందంజలో ఉంటాయి.
మన రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. పాఠశాల విద్యతో మొదలుకొని విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పటిష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని ఆర్థిక శాఖా మంత్రి టి. హరీష్ రావు చెప్పారు.

పేద విద్యార్థులు చదువులో ముందుండాలంటే అది గురుకుల విద్య ద్వారానే సాధ్యమవుతుందని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో గురుకుల విద్యకు పెద్దపీట వేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో 293 గురుకులాలు అరకొర వసతులతో అధ్వాన్నంగా ఉండేవి, వాటిలో లక్షా 31 వేల విద్యార్థులు వసతుల లేమిని ఎదుర్కొంటూ చదువుకునే వారు.
తెలంగాణ ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన గురుకుల విద్యాలయాల స్థాపనకు నడుం బిగించారు. నేడు రాష్ట్రంలో గురుకులాల సంఖ్య 1,002 వరకు పెరిగితే, వీటిలో చదివే విద్యార్థుల సంఖ్య 5 లక్షల 59 వేలకు పెరిగింది.
రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో గురుకులాల మీద బడ్జెట్ కేటాయింపులు 784 కోట్లు ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ఈ కేటాయింపులను భారీగా పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,400 కోట్లకు కేటాయింపులను పెంచింది. పేదలకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం.
యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం 500 కోట్లు ఈ వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
ఆంగ్ల మాధ్యమం
ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వటం జరిగింది. ప్రతిష్ఠాత్మక సంస్థ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ మన పాఠ్యపుస్తకాలను పరిశీలించి అభినందించింది.
మన రాష్ట్రంలో 2,962 ఇంటర్మీడియట్ కళాశాలల్లో 9,48,321 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు హాజరు కావడానికికావాల్సిన శిక్షణను ప్రభుత్వం అందిస్తున్నది.
సాంకేతిక విద్య
రాష్ట్రంలో సాంకేతిక విద్యకు కూడా ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గత ఎనిమిదిన్నరేళ్లలో కొత్తగా 14 పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసింది. 2023-24 విద్యాసంవత్సరం నుంచి రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించబోతున్నది.
రాష్ట్రంలో జెఎన్టీయూ పరిధిలో 4 కొత్త ఇంజినీరింగ్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. వీటిలో సిరిసిల్ల, వనపర్తి కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. త్వరలోనే మహబూబ్ నగర్, కొత్తగూడెంలో ప్రారంభించబోతున్నది.
తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న ఫార్మారంగాన్ని దృష్టిలో ఉంచుకొని సుల్తాన్ పూర్ లో జేఎన్ టీయూకు అనుబంధంగా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ను ఏర్పాటు చేసింది.

మన ఊరు మన బడి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద డిజిటల్ విద్యతోపాటు, తాగునీటి వసతి, సరిపడినంత ఫర్నిచర్, ప్రహరీలు, కిచెన్ షెడ్‌లు, మరుగుదొడ్ల నిర్మాణంవంటి పన్నెండు రకాల అంశాల్లో పనులు చేపట్టడం జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 26,065 పాఠశాలల్లో మూడు దశల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం 7,289 కోట్లు కేటాయించింది. మొదటి దశలో భాగంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. వీటిలో ఇప్పటికే చాలా స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఊరూరా ఉత్సవంలా సంబురంగా ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారు.
విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం
రాష్ట్రవ్యాప్తంగాఉన్న 28,606 పాఠశాలల్లో చదువుతున్న 25.26 లక్షల మంది విద్యార్థులకు, 4,237 హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థల్లోని 9.77 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం పెడుతున్నది. ఇందుకోసం ప్రతి నెలా 21,868 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ రైస్, సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నది.
భావి పౌరులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనే మంచి మనసుతో ముఖ్యమంత్రి విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలో సన్నబియ్యంతో విద్యార్థులకు అన్నం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే.
మధ్యాహ్న భోజన పథకంలో వంటపని చేసే 54,201 మందికి ఇప్పటివరకు నెలకు 1000 రూపాయల పారితోషికం అందుతున్నది. ముఖ్య మంత్రి కేసీఆర్ గతంలో ఈ సభలో ప్రకటించిన విధంగా వారికిచ్చే పారితోషికాన్ని నెలకు 3 వేలకు పెంచామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.
తెలంగాణ విద్యావికాసం కోసం ప్రభుత్వం విద్యాశాఖ ద్వారానే కాకుండా వ్యవసాయం, వైద్యం, అటవీ, పశు సంవర్ధక, మత్స్య, కార్మిక శాఖల ద్వారానూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారానూ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నదని మంత్రి తెలిపారు.
విద్యా శాఖకు ఈ బడ్జెట్ లో రూ.19,093 కోట్లు ప్రతిపాదించడమైనది.