కొత్త పుంతలు తొక్కుతున్న హరిత తెలంగాణ

సీడ్ కాప్టర్ ద్వారా విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమం

  • ఆరుషిక బందు

హరిత తెలంగాణ సాధనలో మరో ముందడుగు చోటు చేసుకుంది. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలకు తోడు సీడ్‌ కాప్టర్‌ ప్రయోగం జత చేరింది. కొండలు, గుట్టలు మానవ ఆవాసాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో సీడ్‌ బాల్స్‌ ను డ్రోన్‌ ద్వారా వెదజల్లి మొక్కలు పెరిగేలా చేయటమే ఈ సీడ్‌ కాప్టర్‌. తాజాగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు హైదరాబాద్‌లో సీడ్‌ కాప్టర్‌ విధానాన్ని ప్రారంభించారు. పెరుగుతున్న సాంకేతికతను అడవుల పునరుజ్జీవానికి వాడుకోవాలన్న సంకల్పంతో ఈ సీడ్‌ కాప్టర్‌ విధానానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్షీణించిన అటవీ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, ముఖ్యంగా మనుషులు వెళ్లి స్వయంగా నాటలేని ప్రాంతాల్లో మొక్కల పెంపకానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. రాష్ట్ర సమాచార సాంకేతిక (ఐటీ), అటవీశాఖల సంయుక్త భాగస్వామ్యంతో మారుత్రోన్డ్‌ టెక్నాలజీ సంస్థ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. మిషన్‌ హరిత తెలంగాణలో భాగస్వామ్యం పొందాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మారుత్రోన్డ్‌ టెక్నాలజీ నిర్వాహకులు ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. తొలి దశలో అన్ని జిల్లాల్లో కలిపి 12 వేల హెక్టార్లలో 50 లక్షల విత్తన బంతులను సీడ్‌ కాప్టర్‌ ద్వారా వెదజల్లటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడిరచారు. ముందుగా నిర్దేశించిన ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసి, మొక్కలు, పచ్చదనం తక్కువగా ఉన్న భాగాలను మ్యాపింగ్‌ చేస్తారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో సీడ్‌ కాప్టర్‌ ద్వారా విత్తన బంతులను వెదజల్లుతారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆ ప్రదేశాలను జియోట్యాగింగ్‌ చేస్తారు. సీడ్‌ బాల్స్‌ వేసిన ప్రాంతాలను తిరిగి పరిశీలించేందుకు, ఏ మేరకు మొక్కలు మొలిచాయో తెలుసుకునేందుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా అవకాశముంది. వెదజల్లిన విత్తన బంతుల్లో కనీసం యాభై శాతం మొక్కలుగా ఎదిగే అవకాశముందని సమాచారం. 

క్రమంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. సిరిసిల్లలో పైలట్‌ ప్రాజెక్టుగా మొదలుపెట్టి ప్రస్తుతం మిగతా జిల్లాలకు కూడా సీడ్‌ కాప్టర్‌ ను విస్తరించారు. సిద్ధిపేట, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో విత్తన బంతులు చల్లడం జరిగింది. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ఈ విధానంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో ఉన్నామని, గ్రీన్‌ ఇండియా కాన్సెప్ట్‌ లో తమ వంతు పాత్ర పోషిస్తామని మారుత్డ్రో టెక్నాలజీస్‌ చెబుతోంది. 

సీడ్‌ బాల్స్‌ ద్వారా గత ప్రయోగాలు

వాస్తవానికి కర్ణాటక అటవీ శాఖ సీడ్‌ బాల్స్‌ విధానాన్ని గతంలో ప్రయోగించింది. అయితే డ్రోన్స్‌ ద్వారా కాకుండా మనుషులే స్వయంగా తయారుచేసిన సీడ్‌ బాల్స్‌ను అడవులు, బోడి గుట్టలపై వర్షాకాలంలో విసరటం అన్నమాట. తెలంగాణకు హరితహారంలో భాగంగా 2018లో మన దగ్గర కూడా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. యాదాద్రి, వరంగల్‌ జిల్లాల్లో తొలుత ఈ ప్రయోగం జరిగింది. మహిళా స్వయం సహాయక బృందాలతో పాటు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని స్థానిక అధికారులు సీడ్‌ బాల్స్‌ తయారు చేశారు. ముందుగా అటవీ ప్రాంతాలు, ఇతర మార్గాల ద్వారా రకరకాల చెట్ల విత్తనాలను సేకరించటం, ఆ తర్వాత నాణ్యమైన మట్టిలో ఆ విత్తనాలను ఉంచి సీడ్‌ బాల్స్‌ తయారు చేస్తారు. వర్షాకాలం మొదలైన తర్వాత ఈ సీడ్‌ బాల్స్‌ను వివిధ ప్రాంతాల్లో విసిరేయటం జరిగింది. తెలంగాణలో తక్కువగా పచ్చదనం ఉండి, గుట్టలు ఉన్న ప్రాంతాలు యాదాద్రి, జనగామ చుట్టపక్కల ఎక్కువగా ఉన్నాయి. సీడ్‌ బాల్స్‌ ప్రయోగం ద్వారా ఈ ప్రాంతాల్లో చెప్పుకోదగిన రీతిలో పచ్చదనం పెరిగింది. ఇటీవల మహబూబ్‌ నగర్‌ జిల్లా అధికార యంత్రాంగం చేసిన సీడ్‌ బాల్స్‌ ప్రయోగం కూడా గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ లో నమోదైంది. రెండు కోట్లకు పైగా సీడ్‌ బాల్స్‌ తయారు చేసిన జిల్లా స్వయం సహాయక గ్రూపు మహిళలు వాటిని అడవులు, బంజరు భూముల్లో విసిరారు. 

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతం కావటంతోపాటు గిన్నిస్‌ బుక్‌లో చోటు చేసుకుంది. వీలున్న అన్ని విధాలను ప్రయోగించి రాష్ట్రాన్ని హరితమయం చేసుకోవటం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఉద్దేశ్యం. దీనిలో భాగంగా గత ఏడేళ్లుగా తెలంగాణకు హరితహారం అమలుకావటంతో పాటు, ఫలితాలు ఇప్పుడు రాష్ట్రమంతటా కళ్లకు కట్టినట్లు పచ్చగా కనిపిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు, రోడ్ల వెంట, ఫారెస్ట్‌ పార్కుల్లో పెరిగిన పచ్చదనం సమాజంలోని అన్ని వర్గాల మన్నలను పొందుతోంది. తాజాగా చేపట్టిన సీడ్‌ కాప్టర్‌ ప్రయోగం కూడా విజయవంతం కావాలని ఆశిద్దాం. పెరిగిన సాంకేతికతను కేవలం అభివృద్ధి ఫలాలకే కాకుండా, పచ్చదనం పెంపు లాంటి పర్యావరణహితమైన కార్యక్రమాలకు వాడుకున్నప్పుడే సార్థకత. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు మనుషుల మనుగడకు పెనుసవాల్‌ విసురుతున్నాయి. వీలున్న అన్ని మార్గాల్లో చెట్లు పెంచి దీనికి అడ్డుకట్ట వేయాలి.