రాష్ట్ర మునిసిపాలిటీలు విదేశాలకు ఆదర్శం

తెలంగాణలోని మున్సిపాలిటీలలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇతర దేశాల నుంచి సందర్శనకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇక్కడ అమలవుతున్న పథకాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్‌శాఖ అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలు ఇతర దేశాలను సైతం ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ పట్టణాల్లో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు వివిధ దేశాలు తమ ప్రతినిధులను పంపిస్తున్నాయి. ఇప్పటికే నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన ప్రతినిధులు ఒక దఫా అధ్యయనం చేసి వెళ్లగా, తాజాగా నేపాల్‌ నుంచి మరో ప్రతినిధి బృందం రాష్ట్రానికి వచ్చింది.

నేపాల్‌కు చెందిన 31 మంది ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రతినిధి బృందం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయాన్ని సందర్శించింది. మున్సిపల్‌శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను సీడీఎంఏ ఎన్‌. సత్యనారాయణ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారికి వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం, ప్రజా మరుగుదొడ్లు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఎఫ్‌ఎస్‌టీపీలు, టీఎస్‌-బీపాస్‌, బయోమైనింగ్‌, ఇన్‌స్టంట్‌ మ్యూటేషన్‌, ఇన్‌స్టంట్‌ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర కార్యక్రమాలు బాగున్నాయని నేపాల్‌ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ తరహా కార్యక్రమాలను తమ దేశంలో కూడా అమలు చేస్తామని తెలిపారు. నేపాల్‌ బృందంలో మేయర్లు మనోజ్‌ కుమార్‌షా, ప్రశాంత్‌ బిస్త్‌, లక్ష్మీ మహారాజన్‌, కబిత తివారి గిరాహి తదితరులు ఉన్నారు.