రైతన్న జీవితానికి ధీమా ఈ బీమా

రాష్ట్ర చరిత్రలోనేకాదు, దేశ చరిత్రలోనే ఇదొక సరికొత్త సువర్ణాధ్యాయం. రైతులందరికీ రైతుబంధు జీవితబీమా కల్పించడం ఓ అద్భుతం. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నంలేదు. రుణ మాఫీచేసినా, 24 గంటలు ఉచితంగా నిద్యుత్‌ సరఫరాచేసినా, ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టినా, మిషన్‌ కాకతీయ పథకంతో పూడిపోయిన చెరువులన్నీ నీటినిల్వలతో కళకళలాడేలా తీర్చిదిద్దినా, గిడ్డంగుల సామర్థ్యం పెంచినా, రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం అందించినా, ప్రాజెక్టులు నిర్మించినా.. అన్నీ రైతన్నల సంక్షేమం కోసమే. రైతన్నను ఆదుకొనేందుకు ఎన్నో వినూత్నపథకాలకు నాందిపలికి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మరో విప్లవాత్మక పథకంతో ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. వచ్చే ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న ఈ రైతుబంధు జీవిత బీమా పథకంతో రైతు జీవితానికే ధీమాకల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కుతోంది.

తెలంగాణ రైతాంగంలో అధికభాగం సన్న, చిన్నకారు రైతులే. వీరికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఎండనక, వాననక, పురుగుపుట్రల మధ్య కండలుకరిగించి, పంటలు పండించి పిడికెడు మెతుకులు అందించే రైతన్న అనూహ్యంగా ప్రమాదంలోనో, అనారోగ్యంతోనో, పాముకాటుకో, పిడుగుపాటుకో విద్యుత్‌ షాకు తోనో , కారణం ఏదైనా కావచ్చు అకాలంగా మరణిస్తే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకొనేదెవరు. తమను పోషించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అనాథ అవుతుంది. దిక్కుతోచనిదవుతుంది. అప్పటివరకూ దేశానికే అన్నం అందించిన ఆ అన్నదాత కుటుంబమే అన్నమో రామచంద్రా అని వీధిన పడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. మరోవంక అప్పులు వడ్డీ అసలుకలిపి ఇబ్బడిముబ్బడిగా పెరిగి ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తూ ఉంటాయి. సమస్యల సుడిగుండంలో విలవిలలాడే ఇలాంటి కుటుంబాలకు ఓ భరోసా కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో, మనసున్నమారాజు మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మానవతా ఆలోచనల పరంపర నుంచి ఉద్భవించిన మరో అపురూప పథకమే రైతుబంధు జీవిత బీమా పథకం.

దేశంలోను, ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ సేవలందించడంలో అగ్రగామిగా ఉన్న భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.సి) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తోంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌.ఐ.సి సంస్థ అవగాహనా ఒప్పందం చేసుకున్నాయి. భూ రికార్డులను ప్రక్షాళనచేసి, ఇటీవల జారీచేసిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఉండి, 2018 ఆగస్టు 15 నాటికి 18 నుంచి 59 ఏళ్ళ వయసుగల రైతులందరికీ ఈ బీమా పథకం వర్తిస్తుంది. ఈ బీమా ఉన్న రైతు ఏ కారణంవల్ల మరణించినా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తారు.

భారత జీవితబీమా సంస్థ ద్వారా అమలుచేస్తున్న ఈ బీమాపథకానికి చెల్లించవలసిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కో రైతుకు ప్రీమియం కింద 1925 రూపాయలు, 18 శాతం జి.ఎస్‌.టి కలుపుకొని సంవత్సరానికి 2271.50 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతులు దరఖాస్తులో నామినీ పేరు పేర్కొంటే చాలు. వ్యవసాయ శాఖ విస్తరణాధికారులే స్వయంగా ప్రతి రైతు ఇంటికి వచ్చి ఈ బీమాకు సంబంధించిన పత్రాలను పూర్తిచేసి, రైతుల నుంచి నామినీ వివరాలను సేకరిస్తున్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 500 కోట్ల రూపాయల నిధులు విడుదల కూడా చేసింది.

ఇప్పటికే రైతుబంధు పథకం పేరుతో ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఇప్పుడు ఈ బీమా పథకం అమలుతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిజమైన రైతుబంధుగా మరోసారి నిరూపించుకున్నారు.