|

పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్న రాష్ట్రం

4వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ ఏడు సంవత్సరాలలో పరిశ్రమలను స్థాపించడంలో దూసుకుపోతున్నది. పారిశ్రామిక పెట్టుబడులు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే మలబార్‌ గోల్డ్‌, జూట్‌ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమతో కలిపి సుమారు 4వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పరిశ్రమల అనుకూల పారిశ్రామిక విధానాల ఫలితంగానే జరుగుతున్నదని స్పష్టమవుతున్నది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు తాము ఈ రాష్ట్రానికి రావడానికి కారణం ప్రభుత్వం తమతో స్నేహపూర్వకంగా ఉండడంతో పాటు, మాకు కావాల్సిన రాయితీలు, వసతి సౌకర్యాలు కల్పించడమేనని వారు పేర్కొంటున్నారు. 

రూ. 2400 కోట్లతో కిటెక్స్‌ వస్త్ర పరిశ్రమ

అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన ప్రతిష్ఠ్ఠాత్మక చిన్నపిల్లల వస్త్ర తయారీ పరిశ్రమ కిటెక్స్‌ సంస్థ తన పరిశ్రమను రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకు వచ్చింది.  వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పరిశ్రమలు స్థాపించనుంది. రూ. 2400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో  పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో కిటెక్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు జరిగితే, 40 వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన జరుగుతుంది.  ఇందులో 90 శాతం మంది మహిళా ఉద్యోగులే ఉంటారని యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కిటెక్స్‌ రాకతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎంతటి అనుకూల పరిస్థితులు, విధానాలు ఉన్నాయనేందుకు కిటెక్స్‌ పెట్టుబడే ఉదాహరణ అని పేర్కొన్నారు. కిటెక్స్‌ పరిశ్రమ వల్ల రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం రావడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 3 లక్షల ఎకరాల్లో పండే మేలిమిరకం పత్తిని ఈ సంస్థ కొనుగోలు చేస్తుందని, తద్వారా రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 

80-90 శాతం మహిళలకే ఉద్యోగాలు కల్పిస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో మహిళలు స్వయంసమృద్ధి సాధిస్తారని చెప్పారు. తమది హామీలిచ్చి ఊరుకొనే ప్రభుత్వం కాదన్నారు. ఇతరులలాగ మేము ప్రకటనలు, హామీలకు పరిమితం కాము. ఒప్పందం జరిగినప్పటినుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యేవరకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే మిషన్లకు ఆర్డర్‌ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి వరంగల్‌లో ఉత్పత్తి ప్రారంభ మవుతుంది. కంపెనీకి ఎలాంటి ఇబ్బంది కలుగదు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అండగా ఉంటారు. ప్రభుత్వపరంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం. అనుమతులన్నీ వేగంగా మంజూరు చేస్తామని కిటెక్స్‌ యాజమాన్యానికి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

మేం ఇక్కడికి రావడానికి కేటీఆరే కారణం: సాబూ జాకబ్‌

తాము తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మంత్రి కేటీఆరే కారణమని కిటెక్స్‌ సంస్థ ఎండీ సాబూ జాకబ్‌ తెలిపారు. ‘మాది చిన్న పిల్లల బట్టల తయారీ సంస్థ. ప్రస్తుతం ఏటా ఒక మిలియన్‌ పీసెస్‌ అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. కేరళ నుంచి ఎగుమతి చేసిన కిటెక్స్‌ బట్ట తొడగని చిన్నారి అమెరికాలో లేదంటే అతిశయోక్తి కాదు. కేరళ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాక రాష్ట్రాల నుంచి మాకు ఆహ్వానాలు వచ్చాయి. ఇతర దేశాలనుంచి కూడా ఆహ్వానాలు అందాయి. నేను ఇక్కడికి రావడానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఆయనే మంత్రి కేటీ రామారావు. నన్ను తెలంగాణకు ఆహ్వానించిన మొదటి వ్యక్తి. నేను ఆయన్ను కలిసిన తరువాత మీకు పెట్టుబడులు కావాలా? ఉద్యోగాలు కావాలా? అని అడిగాను. ఆయన వెంటనే ఉద్యోగాలు కావాలన్నారు. రాష్ట్ర ప్రజలపట్ల వారికున్న కమిట్‌మెంట్‌ నాకు బాగా నచ్చింది. మేము ఫైబర్‌ నుంచి ఫినిషింగ్‌ వరకు అన్నీ తయారుచేస్తాం. 3 మిలియన్‌ పీసెస్‌ తెలంగాణ నుంచి అమెరికాకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణలో తయారైన కిటెక్స్‌ బట్టలు వేయని బేబీ ప్రపంచంలో ఉండని రోజు వస్తుంది. ఏ వ్యాపారి అయినా, పెట్టుబడిదారుడైనా తక్కువ రేటుకు కార్మికులు, తక్కువ వ్యయంతో ప్లాంటు ఏర్పాటు కోసం చూస్తారు. మేము అలా కాదు. ఇక్కడికి కేవలం వ్యాపారం కోసం రాలేదు. ఒక పెట్టుబడిదారుగా మేము కూడా లాభాలు ఆశించవచ్చు. కానీ దేశంపట్ల మాకు కమిట్‌మెంట్‌ ఉన్నది. స్థానిక ప్రభుత్వానికి సహకరించడంతోపాటు స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం, వారి సంక్షేమం చూడటం మా బాధ్యత. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తాం. మొత్తం 22,000 మందికి పీఎఫ్‌, ఈఎస్‌ఐ, మెడికల్‌ సౌకర్యం, సోషల్‌ సెక్యూరిటీ ఏర్పాటుచేస్తాం. మా సంస్థలో పీపీఈ కిట్లు కూడా తయారు చేస్తున్నాం. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ కింద రాష్ట్రప్రభుత్వానికి రూ.6 కోట్ల విలువైన 1.50 లక్షల పీపీఈ కిట్లను అందిస్తున్నాం’ అని వివరించారు.

ఆజంజాహీ మిల్లు లేని లోటు తీరుతుంది. : ఎరబ్రెల్లి దయాకర్‌రావు

కిటెక్స్‌ రాకతో వరంగల్‌లో అజంజాహీ మిల్లు లేని లోటు తీరుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కిటెక్స్‌ రావడం వరంగల్‌వాసుల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, కాలె యాదయ్య, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.