మన గ్రామాలకు జాతీయ అవార్డుల పంట
- రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డుల స్వీకరణ


పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి విభాగాలలో దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరచి, తెలంగాణ రాష్ట్రం 13 జాతీయ పురస్కారాలు కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’, ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాలు రాష్ట్రానికి దేశ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలను తెచ్చి పెడుతున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా పల్లెలు, పట్టణాలలో పరిశుభ్రత, మంచినీటి వసతి, చెట్ల పెంపకం, అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, పల్లె వనాలు, హరితహారం, వైకుంఠధామాలు, రైతు కేంద్రాలు, కమ్యునిటీ హాళ్ళు తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంతో దేశ స్థాయిలో ఈ కార్యక్రమాలు పేరు తెచ్చుకున్నాయి. ఉత్తమ పంచాయతీలకు ఉండాల్సిన అన్ని అర్హతలు మన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఉండడంతో కేంద్ర అధికారులు మన గ్రామ పంచాయతీలకు అవార్డుల పంట పండించారు.
తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరికొన్ని అవార్డులు వచ్చి చేరాయి. ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి కేంద్ర అవార్డుల పంట పండింది. అద్భుత ఆదర్శప్రాయ పరిపాలనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నిలిచింది. దేశంలో నెంబర్ వన్ తో పాటుగా, వరసగా 4 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. అలాగే దేశంలో మొత్తం 9 వివిధ కేటగిరిల్లో ప్రకటించిన ఈ అవార్డుల్లో 8 కేటగిరీల్లో 8 అవార్డులు వచ్చాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 8 గ్రామ పంచాయతీలు అవార్డులను గెలుచుకున్నాయి.

ఈ అవార్డుల ప్రధానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ‘పంచాయతీలకు ప్రోత్సాహంపై జాతీయ సదస్సు`అవార్డుల ప్రధానోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రానికి దక్కిన అవార్డులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిపి, జడ్పీ ఛైర్మన్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులు రాష్ట్రపతి ముర్ము, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ల చేతుల మీదుగా స్వీకరించారు.
దేశానికే ఆదర్శం మన పల్లెలు : సీఎం కేసీఆర్
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశంసించారు. కేంద్ర అవార్డులను స్వీకరించిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమీషనర్ హన్మంతరావు, ఇతర అధికారులు, సర్పంచ్‌లు, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను అభినందించారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణకు మరే రాష్ట్రం సాటిరాదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పచ్చదనం `పరిశుభ్రత’, ‘హరితహారం’ తదితర కార్యక్రమాలు ఇందుకు దోహదపడ్డాయన్నారు. పంచాయతీల అభివృద్ధిలో రాష్ట్రం ప్రతి అంశంలోను అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకుందన్నారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు పోటీ పడగా, అందులో 46 గ్రామాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయన్నారు. ఇందులో 13 తెలంగాణకే రాగా, ఇందులో 4 మొదటి ర్యాంకులు రావడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డుల్లో 30 శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకోవడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు.
అవార్డులు వచ్చిన గ్రామాల వివరాలు

1-ఆరోగ్య పంచాయతీ విభాగంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్, 2-సరిపోను మంచినీరు అందుబాటులో ఉన్న విభాగంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల, 3-సామాజిక భద్రత గల గ్రామాల విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్ పల్లి, 4-స్నేహపూర్వక మహిళా గ్రామాల విభాగంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం అయిపూర్, 5-పేదరిక నిర్మూలన, జీవనోపాధులు పెంచిన గ్రామాల విభాగంలో గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం, 6-సుపరిపాలన గ్రామ పంచాయతీల విభాగంలో వికారాబాద్ జిల్లా మొమిన్ పేట మండలం చీమల్ దారి, 7-క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్ పూర్, 8-స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాల విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్ రావు పేట మండలం గంభీర్ రావు పేట గ్రామం దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అవార్డులు
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలను స్థానిక స్వపరిపాలనలో వారి పనితీరును మెరుగుపరచడానికి ప్రోత్సాహకంగా అవార్డుల రూపంలో ప్రోత్సహిస్తుంది. జాతీయ పంచాయతీ అవార్డులలో భాగంగా, ఆన్‌లైన్‌లో పంచాయతీల ద్వారా నామినేషన్ లను తీసుకొని 9 అంశాలలో(థీమ్‌లలో) ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులను ఇవ్వటం జరుగుతుంది.
అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీలలో పోటీతత్వం పెరిగి మరింత అభివృద్ధికి కృషి చేస్తాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ బాగా కృషి చేస్తున్న గ్రామ పంచాయతీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఇచ్చే అవార్డుల మాదిరి కాకుండా ఈ సంవత్సరము నుండి అవార్డులను 9 అంశాలలో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా అవార్డులు ఇచ్చింది.
ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులతో సూచికలను ప్రకటించింది ఈ తొమ్మిది అంశాలలో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో అత్యుత్తమ పంచాయతీలుగా ప్రకటించారు. 1. పేదరికం లేని మెరుగైన జీవనోపాధులు కల్పించిన గ్రామం. 2. ఆరోగ్యవంతమైన గ్రామం, 3. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, 4. నీరు సమృద్ధిగా ఉన్న గ్రామం, 5. పచ్చదనం, పరిశుభ్రత గ్రామం, 6. స్వయం సమృద్ధితో, మౌలిక సదుపాయాలతో కూడిన గ్రామం, 7. సామాజిక భద్రత కలిగిన గ్రామం, 8. సుపరిపాలన ఉన్న గ్రామం, 9. మహిళా స్నేహపూర్వక గ్రామం.

మంత్రి ఎర్రబెల్లి స్పందన
ముఖ్యమంత్రి కేసిఆర్ మార్గనిర్దేశనం, వారి మానస పుత్రిక పల్లె ప్రగతి వల్లే..వారి సహకారం వల్లే ఈ అవార్డులు దక్కాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ అవార్డులు రావడానికి కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాఖ కార్యదర్శి అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు వచ్చిన గ్రామాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, రాని గ్రామాలు అవార్డులు తెచ్చుకోవడానికి పట్టుదలతో పని చేయాలని సూచించారు.

ఇదిలావుండగా, గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఈ- పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు, బహిరంగ మల మూత్ర రహిత రాష్ట్రంగా, ఉత్తమ ఆడిటింగ్ వంటి అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా, అనేకానేక అవార్డులు, రివార్డులు వచ్చాయన్నారు. అలాగే ఆయా అంశాల్లో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయి అని మంత్రి వివరించారు.

మంత్రి కేటీఆర్ అభినందన
జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో అద్భుత ప్రతిభను చాటిన, జాతీయ స్థాయిలో మరోసారి మెరిసి, ఉత్తమంగా గ్రామ పంచాయతీలు నిలిచిన వాటికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును అభినందించారు.
కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం: మంత్రి హరీశ్‌రావు
జాతీయస్థాయిలో తెలంగాణకు పంచాయతీరాజ్ అవార్డులు దక్కడం సీఎం కేసీఆర్‌కు గ్రామీణాభివృద్ధి పట్ల ఉన్న ముందు చూపునకు నిదర్శనం అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ విజయానికి ఇది దర్పణం అని వ్యాఖ్యానించారు. నాలుగు క్యాటగిరీల్లో మొదటి ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికి అభినందనలు తెలిపారు.