|

సాకారమవుతున్నకోటి ఎకరాల మాగాణం

వి. ప్రకాష్‌
tsmagazine
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నాలుగేళ్లు. తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సాగునీటిరంగంపై దృష్టి సారించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సమైక్య రాష్ట్రంలో సుమారు ఐదున్నర దశాబ్దాలు ఈ రంగంలో జరిగిన విధ్వంసం నుంచి పునర్నిర్మాణంకోసం ఎంతో దూరదృష్టితో ప్రణాళికలు సిద్ధం చేశారు. తన కోటి ఎకరాల మాగాణం ‘స్వప్నాన్ని’, లక్ష్యాలను శాసనసభలో స్వయంగా ఆవిష్కరించారు.

వర్షాలు బాగా కురిసిన ఏళ్ళలో కూడా చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల కాల్వలక్రింద ఏనాడూ తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు మించి సాగు కాలేదు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌, నాగార్జునసాగర్‌, రాజోలిబండ, కడెం, మూసీవంటి భారీ ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు నాల్గోవంతుకుదపడిపోగా చెరువుల క్రింద ఆయకట్టు ఐదోవంతుకు పడిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో నిజాంసాగర్‌ స్థిరీకరణలో భాగంగా నిర్మించిన గుత్ప, అలీసాగర్‌లుతప్ప మరే ప్రాజెక్టూ ఆ పదేళ్లలో పూర్తికా లేదు. జలయజ్ఞం ముసుగులో జరిగింది ‘ధనయజ్ఞం’ అని తేలిపోయింది.

తెలంగాణ ఆంధ్రతో కలిసేనాటికి ఈ ప్రాంతంలో బావులు తప్ప ఒక బోరు బావికూడా లేదు. కానీ గత నలభై ఏళ్లలో చెరువుల్లో పూడికమట్టి పేరుకుపోయి, ఆ మట్టిని ఎప్పటికప్పుడు తీసేవారు లేక భూగర్భజలాలవృద్ధి నిలిచిపోయింది. ఫలితంగా బావులు ఎండి రైతులు బోర్లు వేసుకోవడం మొదలైంది. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 24 లక్షల బోర్లు వున్నాయి. ఈ బోర్లలో 2014 నాటికి చాలావరకు నీరులేక ఎండిపోగా మిగిలిన బోర్లలో ఎక్కువశాతం ఒక్క పంటకు కూడా పూర్తిగా నీరందించని స్థితి వుండేది. అప్పటి ప్రభుత్వాలు కనీసం 7 గంటలు కూడా సరిగ్గా కరెంట్‌ ఇవ్వలేని దుస్థితి ఉండేది. అవసరమైన సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్‌లు, సబ్‌స్టేషన్‌లు నిర్మించక పోవడంవల్ల లోవోల్టేజీ రైతుల మోటర్లు, సబ్‌మెర్సిబుల్‌ పంపులు, ట్రాన్స్‌ఫార్మర్లు తరచుగా కాలిపోయేవి. ఈ పరిస్థితి వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిపై ప్రభావం చూపేది. ఫలితంగా చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో రైతులు ప్రతినెలా వందలాదిగా ఆత్మహత్యలకు పాల్పడేవారు. సాగుభూమిలో మూడింట రెండువంతుల భూమికి బోర్ల ద్వారానే సాగు నీరందేది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన స్థితి
2014 జూన్‌ 2 తర్వాత గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ సాగునీటిరంగం తీరు పూర్తిగా మారింది. క్రమంగా రైతాంగానికి భరోసా ఏర్పడింది. ఆత్మహత్యలు క్రమంగా తగ్గుతున్నాయి. నేటికీ 80 శాతానికి పైగా సాగు బోర్లు, బావుల క్రిందనే వున్నా మిషన్‌ కాకతీయ పనులవలన భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. చెరువులు, కుంటల క్రింది సాగు బాగా పెరిగింది. మిషన్‌ కాకతీయ, నాలుగు, ఐదో దశలు కూడా పూర్తయితే వీటిక్రింది సాగు 25 లక్షల ఎకరాలకు చేరుకుంటుంది. మరోవైపు పెండింగ్‌ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరందడంతో కరువు జిల్లాగా పేరొందిన పాలమూరు (మహబూబ్‌నగర్‌) జిల్లాలో పండుగ వాతావరణం నెలకొన్నది. దశాబ్దాలుగా ఏనాడూ నిండని పాలమూరు చెరువులు, కుంటలు ఈ సంవత్సరం అలుగుపారుతున్నాయి. ఫలితంగా వలసలు తగ్గినాయి. నగరాలు, పట్టణాలతోకూడిన శాసనసభ నియోజక వర్గాలు, ఇప్పటికే లక్ష ఎకరాలకుపైగా (ప్రాజెక్టులద్వారా) సాగునీరందే నియోజకవర్గాలు పోగా మరో 72 నియోజకవర్గాలలో ఒక్కో నియోజక వర్గంలో లక్ష ఎకరాల చొప్పున సాగు నీరందించాలనే ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. సంకల్పం శరవేగంగా పనులు జరుగుతున్న ప్రాజెక్టుల రూపంలో మన ముందున్నది. త్వరలో నిజం కాబోతున్నది.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ అద్భుతాల్లో మరొక అద్భుతంగా నిలుస్తుంది. మంచిర్యాల సమీపంలో నిర్మించిన ఎల్లంపల్లి (శ్రీపాదసాగర్‌) ప్రాజెక్టు దిగువన 115 కి.మీ. నీటిధారలే లేక నది ఎండిపోయింది. వర్షాకాలంలో మాత్రమే వర్షపునీటి జాడ కొద్దిగా ఈ నదిలో కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు పూర్తయితే ఈ 115 కి.మీ. నదిలో ఎప్పుడూ నీరు నిల్వ వుంటుంది. గోదావరి నదిని పునరుజ్జీవింపజేయడానికి, రైతాంగానికి సాగు నీరందించడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ‘వాటర్‌మాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరొందిన రాజేందర్‌సింగ్‌, ఆయన వెంట ఇటీవలే ఈ ప్రాజెక్టును సందర్శించిన పలు రాష్ట్రాల జలరంగ నిపుణులు, పర్యావరణవేత్తలు ఎంతో ప్రశంసించారు.

రికార్డు టైంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మూడు షిఫ్టుల్లో పని జరుగుతున్నతీరు సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పరిశ్రమల్లో మూడు షిఫ్టుల్లో కార్మికులు పనిచేయడం జరుగుతుంది. కానీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో మూడు షిఫ్టుల్లో పనులు జరగడం గతంలో ఏనాడూ చూడనిది. ఏ దేశంలోనూ ఇంత వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగిన దాఖల్లాలేవు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమైన భాగం పూర్వ కరీంనగర్‌ జిల్లాలోని ధర్మారం సమీపంలో మేడారం వద్దగల భారీ టన్నెల్‌ (6వ ప్యాకేజీ). ఈ టన్నెల్‌ ఇంజినీర్ల నైపుణ్యానికి, కె.సి.ఆర్‌. విజన్‌కు ఒక నిదర్శనం. ఈ టన్నెల్‌ లోపల నిర్మిస్తున్న భారీ సర్జ్‌పూల్‌ను చూసి ఆశ్చర్యపడని వారుండరు. ఇదొక ఇంజినీరింగ్‌ అద్భుతం.

సముద్ర మట్టానికి వంద మీటర్ల ఎత్తులో గోదావరిలో లభ్యమయ్యే నీటిని రోజుకు 2 టి.ఎం.సి.ల చొప్పున 650 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్‌ చేసి సుమారు 36 లక్షల ఎకరాలకు నీరివ్వాలనే కె.సి.ఆర్‌. సాహసాన్ని, పనులు పూర్తవుతున్న తీరును చూసిన వారెవ్వరైనా ఆ మహామనీషిని అభినందించకుండా వుండలేదు. ఇంత గొప్ప ప్రాజెక్టుకు స్వార్థ ప్రయోజనాలను ఆశించి అడుగడుగునా అడ్డుతగులుతున్న వారిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

  • 2014 తర్వాత ప్రభుత్వం చేపట్టిన డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వలెనే లక్షలాది ఎకరాలకు నీరందిస్తూ కరువునేల ప్రజల వెతలను, కష్టాలను తీరుస్తాయనడంలో ఎలాంటి సందేహాలక్కరలేదు.
  • ఏనాడూ పూర్తి ఆయట్టుకు నీరందించని రాజోలిబండ డైవర్షన్‌ స్కీం క్రింద ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం తుమ్మల్ల ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించింది.
  • సమైక్య రాష్ట్రంలో కృష్ణానది నీటిని నిబంధనలకు విరుద్ధంగా యధేచ్ఛగా పోతిరెడ్డిపాడునుండి పెన్నానది పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్లించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పలు ప్రాజెక్టులను ఆంధ్రలో నిర్మించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కృష్ణానదిపై కేంద్రం ఏర్పాటు చేసిన బోర్డు నీటివిడుదల, వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండడం, అవకతవకలపై, ఆరోపణలపై విచారణ జరిపి నియంత్రించడంతో ఇష్టం వచ్చిన రీతిలో కృష్ణా నీటి మళ్లింపు ఆంధ్ర పాలకులకు సాధ్యపడడంలేదు.
  • తెలంగాణలోని మధ్యతరహా ప్రాజెక్టుల క్రింద ఆయకట్టు స్థిరీకరణకు కూడా ప్రభుత్వం చర్యలుచేపట్టింది.గత యాభై ఏళ్లుగా బోర్లు, బావులద్వారా భూగర్భ జలాలను వెలికి తోడడమేతప్ప వాటి వృద్ధికి ఎలాంటి రీఛార్జీ పద్ధతులను సమైక్యరాష్ట్రంలో చేపట్టలేదు. ప్రస్తుతం తెలంగాణలో భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో రీఛార్జిషాఫ్ట్‌లను నిర్మిస్తున్నా రు. వీటిద్వారా భూగర్భ జలాలను వృద్ధి చేయవచ్చు.
  • ‘గోదావరిలోనీరు క్రింద వున్నది, తెలంగాణ ఎంతో ఎత్తులో వున్నది. నీరెలా వస్తుంది?’ అని ప్రశ్నిస్తూ సాకులు చెప్తూ తెలంగాణకు సాగునీరివ్వడానికి నిరాకరించిన ఆంధ్ర పాలకులకు తెలంగాణ సీఎం నిర్మిస్తున్న కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ‘చెంపపెట్టు’గా భావించవచ్చు.

‘తెలంగాణ వస్తే అంధకారమే’ అన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి 24 గంటల నిరంతర కరెంట్‌ను ఇస్తూ ధీటైన సమాధానాన్నిచ్చారు కేసీఆర్‌.

సాగునీటిరంగంలో కోటి ఎకరాలకు నీరిస్తూ భారతావనికే తెలంగాణ తలమాణికంగా నిలిచే రోజు మరెంతో దూరం లేదు.