| | |

అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే: అసెంబ్లీలో కేసీఆర్‌

ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలని, వారి మద్దతు తమకు పూర్తిగా ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. తాము రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోను ఘన విజయం సాధిస్తున్నామని, ప్రజలు తమ పాలనకు బ్రహ్మరథం పడుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ సాధించినా, 2018 ఎన్నికల్లో ప్రజలు తమ పాలనకు మెచ్చి 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చి తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారని అన్నారు. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను 33 జిల్లాలకు గాను, వందశాతం అంటే 33 జిల్లా పరిషత్‌లు టిఆర్‌ఎస్‌ గెలుచుకుందని అన్నారు. మున్సిపల్‌ కార్పోరేషన్లు మొత్తం గెలుచుకోగా, మున్సిపాలిటీలలో 95శాతం టిఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుందన్నారు. ఇలా ప్రజలు తమపాలనపై తమ సంతృప్తిని ఎన్నికల్లో విజయం చేకూర్చడం ద్వారా తెలియచేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల వారు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకుండా సంకుచిత భావాలతో కువిమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తమపాలనలో రాష్ట్రం ఎన్నో విషయాలలో దేశంలోనే అగ్రగామిగా ఉందని, సంక్షేమ పథకాలలో దేశానికి మార్గదర్శకంగా ఉందన్నారు.

 అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు సెలవులు పోను 7 పనిదినాలు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సుదీర్ఘ ఉపన్యాసాలు చేశారు. ఈ ఏడు సంవత్సరాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల అమలు, నిధుల వెసులుబాటు, ప్రజలకు పరిపాలన దగ్గర చేయడం, పారిశ్రామికీకరణ, వ్యవసాయ రంగ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, హరితహారం, దళిత బంధు,  తదితర విషయాలను కూలంకశంగా వివరించారు. ప్రతిపక్షాల సూచనలు, సలహాలు స్వీకరించారు.

హరితహారం అందరి బాధ్యత 

అసెంబ్లీ ప్రారంభమైన మూడవ రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరితహారం పై జరిగిన చర్చలో ప్రసంగించారు. ముఖ్యంగా హరితనిధి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు అందరి వద్ద నుంచి ఈ నిధి కోసం కొంత మొత్తం సేకరించే విధంగా విధి విధానాలు రూపొందించనున్నారు. 

సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మూడవ రోజే పర్యావరణ పరిరక్షణపై మేధావులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, అధికారులతో సమీక్షించానన్నారు. హరితహారం ఎంతో ముఖ్యమైన విషయమని, ప్రకృతిని రక్షించుకుంటేనే మన మనుగడ సాగుతుందని అన్నారు. అందుకే గత ఏడు సంవత్సరాలుగా చెట్లునాటే కార్యక్రమాన్ని అప్రతిహాతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ ఆక్టుల్లో 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌ పెట్టినట్లు తెలిపారు. పంచాయతీలకు రూ. 415.47 కోట్లు, జీహెచ్‌ఎంసీతో సహా పట్టణాభివృద్ధి సంస్థలకు రూ. 841 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ణయించుకోగా, ఇప్పటికే 239 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. లక్ష్యాన్ని అధిగమించామన్నారు. అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం తెలంగాణలోని హరితహారం కార్యక్రమాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమంగా గుర్తించారని తెలిపారు. 

మనదేశంలో అటవీరంగం అత్యంత నిరాదరణకు గురై, పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నదని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అవశ్యకతను గుర్తించి ఇద్దరు ఐఎఫ్‌ఎస్‌ అధికారులను సీఎం కార్యాలయంలో సెక్రటరీలుగా నియమించి నానని తెలిపారు. సామాజిక అడవులను ఎంత పెంచినా అరణ్యాలతో సమానం కాదన్నారు. అడవుల్లో ఉండే బయోడైవర్సిటీ వేరని అన్నారు. అందుకే అడవుల్లో 20 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాము. భూమిలో నిక్షిప్తమై ఉన్న చెట్ల వేర్ల ద్వారా 80 కోట్ల మొక్కలను పునరుజ్జీవింప చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నాము. మొత్తంగా వందకోట్ల మొక్కలు అటవీ ప్రాంతాలలో కొత్తగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇందులో ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటామని, మరో 42.42కోట్ల మొక్కలను వేర్లద్వారా పునరుజ్జీవింప చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. గజ్వేల్‌లోని 35వేల ఎకరాల అటవీభూమిలో మొక్కలు నాటామని సభకు తెలిపారు. ఆ అడవిలో బయో డైవర్సిటీ పెరిగిందని, నెమళ్ళు, అడవి పందులు, ఇతర జంతుజాలం అందులో జీవిస్తున్నాయని తెలిపారు. నిర్మల్‌లోను అడవుల పునరుద్దరణ బాగా జరుగుతోందన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వంటి ప్రాంతాల్లో 10 కోట్ల మొక్కలు పెట్టాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 14.5 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. 

సోషల్‌ ఫారెస్టీ, రెవెన్యూ ప్లాంటేషన్‌ వంటి వాటి కింద 120 కోట్ల మొక్కలు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 162.77 కోట్ల మొక్కలు నాటి లక్ష్యాలను అధిగ మించినట్లు తెలిపారు. గ్రామాలు, పల్లెల్లో కూడా ప్రకృతి వనాల పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ హరితహారం కార్యక్రమానికి ఇప్పటి వరకు ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి రూ. 1,112 కోట్లు, కాంపా నిధులు రూ. 1,320 కోట్లు, నరేగా నిధులు రూ. 3,673 కోట్లు, హెచ్‌ఎండీఏ నిధులు రూ. 367 కోట్లు, జీహెచ్‌ఎంసీ నిధులు రూ. 83 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 6,555 కోట్లు ఖర్చు పెట్టినట్లు సీఎం వెల్లడించారు. 

ముఖ్యమంత్రి హరితనిధి విషయంలో ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ పూర్తి సహాయ, సహాకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా అసైన్డ్‌ భూముల రైతులకు అన్ని హక్కులు కల్పిస్తామని, ప్రభుత్వం సేకరిస్తే పూర్తి పరిహారం చెల్లిస్తామని సీఎం తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పోడు రైతులకు ఇచ్చే ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఓనర్లను చేయవన్నారు. ఆ భూములు రైతులు దున్నుకుని ఆదాయం సమకూర్చు కోవాలని, వాటి యజమానిగా అటవీశాఖ మాత్రమే ఉంటుందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు వివరాలు సేకరించి, వారికి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 

పర్యాటక రంగంపై దృష్టి పెడుతున్నాం 

పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సభలో ఉన్న కేసీఆర్‌ విఫులంగా సమాధానమిచ్చారు. తెలంగాణలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, గత ఉమ్మడి రాష్ట్రంలో అవి నిర్లక్ష్యం చేయబడ్డాయని అన్నారు. ఇంతవరకు వ్యవసాయం, సాగునీరు, తాగునీరు, విద్యుత్‌, పారిశ్రామిక రంగాలపై దృష్టి కేంద్రీకరించామని, ఇప్పుడు పర్యాటక రంగంపై కూడా దృష్టి పెట్టామని అన్నారు. 

తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్ర, సంప్రదాయాలు, కళలు, సంస్కృతి ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతాలు కూడా ఎన్నొ ఉన్నాయన్నారు. జలపాతాల సోయగాలు చూడతరం కాదన్నారు. గడీలు, బురుజులు, కోటలు, చారిత్రక అవశేషాలు ఎన్నో ఉన్నాయన్నారు. అలంపూర్‌ లోని జోగుళాంబ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటన్నారు. ఇదేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇప్పుడు శాసనసభ్యులతో ఒక కమిటీ వేసి రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక తీసుకుంటామన్నారు. ప్రతి శాసన సభ్యుడు తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పర్యాటక ప్రదేశాలను పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నివేదించాలని సూచించారు. 

మరో ప్రశ్నకు సమాధానమిస్తు పద్మ అవార్డుల విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షను స్వయంగా ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్ళానని తెలిపారు. ఆయన సానుకూలంగా పరిశీలిస్తానని తెలిపాడన్నారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రశ్నే లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

చేతులెత్తి మొక్కుతున్నా.. 

దళితబంధుకు అందరూ సహకరించండి 

చేతులెత్తి మొక్కి చెబుతున్నా.. అనేక తరాల నుంచి, అనేక బాధలకు గురై కుల వివక్షతో వెలివేయబడ్డ దళిత జాతి పునరుద్ధరణకు చేపట్టిన దళితబంధు పథకాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని ప్రతి పౌరుడు సహకరించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు.  దళితబంధు పథకంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని ప్రతిపక్ష సభ్యుల సందేహాలకు సమాధాన మిచ్చారు. పథకం విశిష్టతను వివరించారు. సమాజంలో ఎక్కువ జనాభా కలిగి ఉండి, కులవివక్షకు గురై గ్రామాల బయట ఉండి కృంగిపోతున్న దళితజాతిని పైకి తేవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకే దళితుల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. 

గతంలో ఏ ప్రభుత్వం, ఏ పాలకుడు ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ. 10లక్షలు ఇచ్చి వారిని ఏవైనా వ్యాపారాలు నిర్వహించుకుని, ఇన్‌స్టిట్యూట్‌లు పెట్టుకుని, ట్రాక్టర్లు, కార్లు లాంటి వాహనాలు కొనుక్కొని, ఇతరత్రా డైరీ, పోల్ట్రి లాంటి వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా బలపడడానికి ఉపయోగించుకునే విధంగా ప్రయత్నిస్తా మన్నారు. రూ. 10లక్షలు పూర్తి సబ్సిడీపై ఇస్తున్నా మన్నారు. ఇదంతా కూడా దళితులను ఆర్థికంగా, సామాజికంగా పైకి తేవడానికి జరుగుతున్న యజ్ఞ మన్నారు. వాస్తవంగా దళితులకు గిరిజనుల కంటే తక్కువ భూములున్నాయని కేసీఆర్‌ ఆవేదన వెలిబుచ్చారు. మొదట ఈ పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. అక్కడ ఇప్పటికే దళిత కుటుంబాలను గుర్తించి, వారి వారి ఖాతాలలో రూ.10 లక్షలు వేయడం జరిగిందని తెలిపారు. వాటితో కొందరు డైరీ, టాక్సీకారు, ట్రాక్టరు, సెంట్రింగ్‌ పరికరాలు తదితర యునిట్లను సమకూర్చుకుని, ఉపాధి పొందుతున్నారని సీఎం వివరించారు. ఆలేరు నియోజక వర్గం వాసలమర్రిలో కూడా దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు పరిచినట్లు తెలిపారు. అక్కడే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోను ప్రతి నియోజక వర్గం నుంచి వంద కుటుంబాలను ఎంపిక చేసి పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. అనంతరం ఇతర కుటుంబాలకు కూడా అమలు చేస్తామ న్నారు. మార్చిలోపే దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని సీఎం తెలిపారు.  

దళితబంధు పథకం ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదన్నారు. వాస్తవానికి తాను 1985లో సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అక్కడ దళిత చైతన్య జ్యోతి అని ఓ కార్యక్రమం ప్రారంభించి నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని, దళితుల అభ్యున్నతికి ఎన్నొ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మొట్టమొదటి సారి దానయ్య అనే దళితున్ని సిద్ధిపేట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా చేసానని తెలిపారు. 2003లో ఉద్యమ సమయంలోనే దళిత పాలసీకి ప్రయత్నాలు చేశామన్నారు. బేగంపేట గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో దళిత మేధావులు ఎస్‌.ఆర్‌. శంకరన్‌, టీఎస్‌ కృష్ణన్‌, కత్తి పద్మారావు, వినయ్‌కుమార్‌ తదితరులు 40 మంది మేధావులతో చర్చించి దళిత పాలసీకి రూపకల్పన చేసినట్లు సీఎం వివరించారు. ఆ తరువాత దీనిపై ఎన్ని డబ్బులు ఖర్చు చేస్తున్నా అనుకున్నంత మార్పు రావడం లేదని ఆలోచించి, చివరకు ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు సబ్సిడీపై ఇచ్చి వారిని ఎలాంటి షరతులు లేకుండా వారికి ఇష్టం వచ్చిన వ్యాపారం పెట్టుకునే విధంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో పాటుగా ప్రభుత్వ లైసెన్సులు ఇచ్చే వైన్‌ షాపులు, మెడికల్‌ షాపులు, ఇతర లైసెన్సులు ఇచ్చే వ్యాపారాలలో కూడా దళితులకు రిజర్వేషన్‌ పెట్టి జిల్లాల వారీగా ఉన్న షాపుల్లో వీరికి కేటాయిస్తామని చెప్పారు. ఈ పథకం కిందకు దళిత ఉద్యోగులు కూడా వస్తారని, వారికి కూడా వర్తింపచేస్తామని చెప్పారు. 

దళిత రక్షణ నిధి

వ్యాపారం అన్నాక లాభనష్టాలు ఉంటాయని, అందువల్ల వాటిని అధిగమించడానికి దళితరక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా వ్యాపారంలో నష్టపోతే ఈ నిధి నుంచి సహకరిస్తామన్నారు. ఇందులో దళిత కుటుంబాలకు ఇచ్చే పది లక్షల రూపాయల నుంచి పదివేలు తీసి, మరో పదివేలు ప్రభుత్వం కలిపి ఒక్కో యునిట్‌ పేరన రూ. 20వేలు దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా నష్టపోయిన వారికి సహకరించడానికి వీలు కలుగుతుందని అన్నారు. ఇలా దళితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. 

రాబోయే ఏడేండ్లలో రూ. 1.80 లక్షల కోట్లు 

రాబోయే టర్మ్‌లోను తామే అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారన్నారు. అందుకే రాబోయే ఏడు సంవత్సరాలలో దళితబంధు పథకానికి రూ. 1.80వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ రూ. 23 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఈ విషయంలో ప్రతి ఎమ్మెల్యే కూడా భాగస్వాములు కావాలని, బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే కూడా తమ తమ నియోజకవర్గాల్లో దళితబంధు విజయవంతం చేసే బాధ్యతను స్వీకరించా లన్నారు. లబ్దిదారుల ఎంపిక కూడా మీపైనే ఉందని సీఎం ఎమ్మెల్యేలను ఉద్ధేశించి అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ పథకం విజయవంతమైతే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ప్రభుత్వంగా ఎంతో తృప్తి మిగులుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయి: సీఎం 

ప్రభుత్వం తెచ్చిన నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలతో పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అసెంబ్లీలో తెలిపారు. ‘పల్లె, పట్టణ ప్రగతి’ అనే అంశంపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. తాము తండాలను కూడా గ్రామపంచాయతీలను చేసి, వాటికి నిధులను సమకూరుస్తు మారుమూలు గిరిజన తండాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చిన నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులను సమకూరుస్తున్నదని ఆయన తెలిపారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని చిన్న పంచాయతీలకు కూడా నిధులను సమకూరుస్తున్నామని తెలిపారు. 

గ్రామాలలో ముళ్ళచెట్లు, పొదలు లేకుండా చేసి వాటిని పరిశుభ్రంగా తీర్చిదిద్దామన్నారు. పాత బోరు బావులన్నీ పూడిపించామన్నారు. ఇప్పుడు బోరుబావుల్లో పిల్లలు పడిపోవడాలంటూ లేవని స్పష్టం చేశారు. గ్రామలలో వీధిలైట్లు, సిమెంటు రోడ్లు, పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయని అన్నారు. గతంలో కారోబార్‌ చేతిలో పంచాయతీ పాలన, నిధులు ఉండేవని, ఇప్పుడు అధికారాలన్నీ పంచాయతీ పాలకవర్గానికే అప్పగించడం జరిగిందని తెలిపారు. వారి వారి గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో గ్రామసభలో నిర్ణయం తీసుకుని, అందుకు అనుగుణంగా నిధులు ఖర్చుచేసుకునే వెసులుబాటును పాలకవర్గానికే కలిపించామని తెలిపారు. గతంలో తలసరి రూ. 4 విడుదల జరిగేదని, తాము ఆ మొత్తాన్ని రూ. 669 విడుదల చేస్తున్నామని సీఎం వివరించారు. ప్రతినెల పంచాయతీలకు రూ. 227.5 కోట్లు,మున్సిపాలిటీలకు రూ. 112 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ కార్మికుల వేతనాలను కూడా భారీగా పెంచామని, గతంలో రూ. 500 నుంచి 4000 వరకు ఉన్న వాటిని ఏకంగా రూ. 8500 చేశామని తెలిపారు. సర్పంచ్‌ల నుంచి మొదలు, జడ్పీ చైర్మన్‌ల వరకు అందరి గౌరవ వేతనాలను పెంచామన్నారు. 

అవార్డులే కానీ నిధులు శూన్యం

రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలు, పరిశుభ్రత, నీటి సరఫరా తదితర ఎన్నో విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మన పంచాయతీలు, మున్సిపాలిటీలకు అవార్డులు ఇచ్చిందన్నారు. కానీ అవార్డులు, ప్రశంసలతోనే సరిపెట్టిందని, నిధుల విడుదల విషయంలో శీతకన్ను వేసిందని సీఎం కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలపై మాట్లాడుతూ ఆయన తాను కరీంనగర్‌ను డల్లాస్‌ చేస్తానని ఎప్పుడు చెప్పలేదని, లండన్‌లో థేమ్స్‌ నదిని పోలి, ఇక్కడ మానేరు పారుతున్నందున రోప్‌వేలు నిర్మించి లండన్‌ తరహా అభివృద్ధి చేద్దామని అన్నానని, పాత నగరాన్ని ఇస్తాంబుల్‌ లాగా తీర్చిదిద్దాలని ఆశించానని అన్నారు. అలా కలలు కనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. కలలను నిజం చేసే  దిశగా మన కృషి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. 

వైద్యంపై ప్రత్యేక శ్రద్ద 

పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని పేదల ఆరోగ్య పరిరక్షణకై ఎన్నో చర్యలు చేపట్టామన్నారు. నగరాలు, పట్టణాల్లో బస్తీ దవాఖానాల పేరిట చిన్న ఆసుపత్రులు తెరవగా, పల్లెల్లో పల్లె దవాఖానాలు తెరుస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు జ్వరం, జలుబు, కడుపు నొప్పి, తలనొప్పి లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల్లో వైద్యం చేయించుకోవచ్చని సీఎం సూచించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి పూర్తి బాధ్యతను పంచాయతీ పాలక వర్గాలు, మున్సిపల్‌ పాలక వర్గాలకే అప్పగించినట్లు తెలిపారు. వీటితో పాటు కరోనా కాలంలో రైతులు పండిరచిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 3కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించా మన్నారు. 2601 రైతు వేదికలను గ్రామాల్లో నిర్మించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు సీఎం తెలిపారు. మొత్తంగా పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, నగరాలు తమ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలలోను అభివృద్ధిపథంలో దూసుకు పోతున్నాయని సీఎం వివరించారు. 

మన పథకాలు దేశానికే ఆదర్శం 

రాష్ట్రంలో మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఈ సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో లబ్ది పొందుతున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సంక్షేమ పథకాల అమలుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం సుదీర్ఘంగా వివరించారు. సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని వివరించారు. ఏ పథకం చూసినా ప్రజలకు ఎంతో ఉపయోగరంగా ఉండడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రపంచంలో ప్రజాక్షేత్రమే అసలైన పెద్ద కోర్టు అని, పనిచేసే ప్రభుత్వాలనే ప్రజలు తిరిగి ఎన్నుకుంటారని సీఎం వ్యాఖ్యానించారు. 

సంక్షేమ పథకాలను కరోనా సంక్షోభంలోను ఆపకుండా అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానిదేనని అన్నారు. సంక్షేమ పథకాల కోసం రూ. 74. 165 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో ఎస్సీ సంక్షేమానికి రూ. 23.296 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 19.535 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ. 14.447 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ. 9.916 కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ. 6.971 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఏ కులాన్నీ విస్మరించలేదని, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నదని సీఎం వివరించారు. 

తాము సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే కొందరు చీప్‌గా మాట్లాడుతూ సీఎం జేబుల నుంచి ఇస్తున్నాడా అని విమర్శిస్తున్నారని, ఎవరైనా పాలకులు జేబుల నుంచి ఇచ్చారా.. అమెరికా, లండన్‌ ఎక్కడైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చే పన్నులను తిరిగి ప్రజలకే ధర్మబద్ధంగా, వారి ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి వివిధ పథకాల ద్వారా పంపిణీ చేయడమే పాలకులు చేసే కర్తవ్యమన్నారు. అవి వారికి సరిగా ఉపయోగపడే విధంగా చూడడమే సరైన పాలనగా పేరు తెచ్చుకుంటుందన్నారు. ఆ దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎప్పుడో విజయం సాధించిందన్నారు. 

రాజకీయంగా మనం ఎన్ని రకాలుగా విమర్శలు చేసుకున్నా, తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. వ్యక్తిగతంగా తనను విమర్శించినా సహిస్తాను కానీ రాష్ట్రాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోనన్నారు. రాష్ట్రం అందరిదనీ, పాలకులు మారుతుంటారు తప్ప రాష్ట్రం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుందన్నారు. అందుకే రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడిరపచేసే విధంగా ప్రవర్తించాలని కోరారు. 

శాసనమండలి సమావేశాలలో… 

రాష్ట్రంలోని ఆయా వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం చేపట్టిన ఆయా సాగు నీటి పథకాలు, జంటనగరాల ప్రజలు ఎదుర్కొంటున వరద సమస్యలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళి కలపై  ఐదురోజుల పాటు శాసన మండలి సమావేశాలు జరిగాయి. శాసనమండలి వర్షాకాల సమావేశాల సభ  2021, సెప్టెంబరు 24 తేదీ నుంచి మధ్యలో సెలవులు పోను ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ సభలకు  ప్రోటెం స్పీకర్‌ వి. భూపాల్‌రెడ్డి అధ్యక్షత వహించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనవిజయాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్షాన ఆర్థికశాఖ మంత్రి టి. హరీష్‌రావు మాట్లాడుతూ సభ్యుల సందేహాలకు విపులమైన సమాధానా లిచ్చారు. ఇంతే కాకుండా రాష్ట్ర మంత్రులు మహమూద్‌ అలీ, కల్వకుంట్ల తారక రామారావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, సత్వవతీరాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డిలు కూడ తమ మంత్రిత్వశాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి సభకు వివరించారు. 

తొలిరోజు సాగు చేయదగిన భూమి, పెరిగిన జలమట్టం విషయాలపై చర్చజరిగింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలో పాల్గొంటూ సాగుభూమికి సంబంధించిన వివరాలు కావాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటైననాటి నుంచి రూ. 4589 కోట్ల మొత్తంతో మొత్తం 1402 చెక్‌డ్యాంలను చేపట్టామని మంత్రి హరీష్‌ వివరించారు. 684 చెక్‌డ్యాంల నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయని, వాటిని సత్వరమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. వీటి నిర్మాణం ద్వారా ఆయకట్టు 3.55 లక్షల ఎకరాలుగా ఉండనున్నట్టు అంచనా వేస్తున్నామని తెలిపారు. మొదటి దశలో చేపట్టిన చెక్‌డ్యాంలు పూర్తయిన వెంటనే రెండవ దశలో మిగిలిన 562 చెక్‌డ్యాంలను చేపట్టనున్నట్టు సభలో ప్రకటించారు. మరోసభ్యుడు కురుమయ్యగారి నవీన్‌కుమార్‌, సభ్యుడు తేరా చిన్నప రెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీకి ప్రోత్సాహం 

తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంపొందించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర మున్సిపల్‌, పరిపాలన అండ్‌ పట్టణాభివృద్ధి, సమాచార, సాంకేతికశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పక్షాన ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. అక్టోబరు 2020 లోనే రాష్ట్ర ప్రభుత్వం  ఎలక్ట్రానిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు మంత్రి సభకు వివరించారు. ఈ రంగంలో పెట్టు బడులను పెంపొందించడం, పరిశోధన, అభివృద్ధి నవీకరణలను ప్రోత్స హించడం ఎలక్ట్రానిక్‌ వాహనాల విధానంలో భాగమని ఆయన వివరించారు. వడ్డీరాయితీ సహా అనేక రకాల రాయితీలను తయారీ దారులకు ఇవ్వనున్నట్టు వివరించారు. నిర్దేశిత ఎలక్ట్రిక్‌ బస్సులకు సంబంధించి వినియోగదారులకు రిజిస్ట్రే షన్‌ ఫీజు మినహాయింపును ఇవ్వను న్నామని ఆయన సభకు తెలిపారు. 

సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం

రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్‌ ఆలోచనా విధానం మేరకు సేంద్రీయ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత నిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. 29,200 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 584 క్లస్టర్లలో సేంద్రీయ వ్యవసాయాభి వృద్ధి పథకాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి వివరించారు. ఇందుకోసం రూ. 7201.576 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2598.193 కోట్లు ఈ పథకంపై వ్యయం చేసినట్టు ఆయన సభకు వివరించారు. విశ్వవిద్యాలయాలు  కళాశాలలోని బోధనా సిబ్బందికి 2016 నుంచి సవరించిన యుజిసి వేతన స్కేళ్లను అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని సబితా ఇంద్రారెడ్డి వివరించారు.   

నాలాల సమస్యలపై సమగ్రాభివృద్ధి 

హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం కనిపించని నాలాలు ఇటీవల ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తిస్తూ సమగ్ర అధ్యయనాన్ని చేపట్టనున్నట్టు  మున్సిపల్‌ పరిపాలన అండ్‌ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సభకు వివరించారు. ఓఆర్‌ఆర్‌ లోపల నాలాగ్రిడ్‌ మెరుగు దలకు నిర్దిష్ట పరిధి ఉద్దేశ్యంతో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని మదింపు చేయడమవు తున్నదని తెలిపారు. మొత్తం ప్రధాన కాల్వలను 173.00 కిలో మీటర్లుగా మదింపు చేసి అమలు దశ`1 కింద జాబితాను ఖరారు చేయనున్నట్టు తెలిపారు. మొత్తం ఈ సమావేశాలలో ఏడు బిల్లులు ఆమోదం పొందాయి. బీసి జనగణన చేయాలన్న తీర్మానం కూడ ఆమోదం పొందింది. చివరికి శాసన మండలి సమావేశాలు అక్టోబరు 8 తేదీ నుంచి నిరవధిక వాయిదా పడ్డాయి.

పరిశ్రమల గమ్యస్థానం తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

దేశంలో పరిశ్రమలకు గమ్యస్థానం తెలంగాణగా మారిపోయిందని, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వేత్తలంతా హైదరాబాద్‌ వైపు చూస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల రెండవ రోజు ఐటీ, పరిశ్రమల రంగంపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు మంత్రి కేటీఆర్‌ సూదీర్ఘంగా సమాధానమిచ్చారు. సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన సమాధాన మిచ్చారు. పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వైపు చూడడానికి మన ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలే కారణమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలనే దేశం అనుకరించే సమయం వస్తుందన్నారు. దేశానికే మన పారిశ్రామిక విధానం మార్గదర్శకమవుతుందన్నారు. ఎర్ర బస్సు నుంచి హెలికాప్టర్‌ దాకా, ట్రాక్టర్‌ నుంచి ఎలక్ట్రికల్‌ బస్సుల దాక, ఎలక్ట్రికల్‌ బస్సు నుంచి ఎయిర్‌బస్సు దాక, టైల్స్‌ నుంచి టెక్స్‌టైల్స్‌ దాక, యాప్స్‌ నుంచి యాపిల్‌ మ్యాప్స్‌ దాకా తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు వాడే హెలికాప్టర్‌ క్యాన్‌ హైదరాబాద్‌లో తయారవుతుందని కేటీఆర్‌ చెప్పారు. బోయింగ్‌, లాఖ్‌హీడ్‌ మార్టిన్‌, కల్యాణి గ్రూప్‌, శాఫ్రస్‌ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పారు.  ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా పార్టీలకు అతీతంగా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలన్నారు. 

టీఎస్‌ ఐపాస్‌ విధానం రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తెచ్చిందన్నారు. దీంతోపాటు పరిశ్రమలకు నీళ్ళు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతులు సరిగా సమకూరుతుంటే పరిశ్రమలు లైను కడతాయన్నారు. ఇప్పటివరకు టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అనుమతులు పొందిన పరిశ్రమలు 17,302 ఉండగా, రూ. 2.20 లక్షల కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయన్నారు. కార్యకలాపాలు ఇంకా ప్రారంభంకానివి 13వేల యునిట్లు 

ఉన్నాయన్నారు. వచ్చిన ఉద్యోగాలు పరిశ్రమల్లో 16 లక్షలకు పైగా, ఐటీలో 3.05 లక్షలకు పైగా ఉన్నట్లు తెలిపారు. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి 2014 నుంచి 24,426 యూనిట్లు నెలకొల్పగా, రూ. 1,081 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్లు కేటీఆర్‌ వివరించారు. గిరిజన పారిశ్రామిక వేత్తలకు 22,440 యునిట్లు నెలకొల్పగా, రూ. 1,016 కోట్ల రాయితీలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే దివ్యాంగులకు రూ. 1,538 యూనిట్లు నెలకొల్పగా, రూ. 83 కోట్ల ప్రోత్సహకాలు అందించినట్లు కేటీఆర్‌ వివరించారు. 

ఐటీలో అగ్రగామి రాష్ట్రం

ఐటీలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని, ప్రపంచంలోనే పేరెన్నిక గన్న 5 టెక్నాలజీ కంపెనీలు రెండో అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో కలిగి ఉన్నాయంటే మనం ఐటీ రంగంలో ఏ స్థాయికి ఎదిగామో అర్దం చేసుకోవచ్చని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఐటీ రంగం ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, సిద్ధిపేట తదితర రెండవ శ్రేణి నగరాలకు కూడా విస్తరించిందన్నారు. ఐటీ ఎగుమతులు రూ. 1.45 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఉద్యోగాలు 6.28 లక్షలకు చేరుకున్నాయని మంత్రి కేటీఆర్‌ వివరించారు. 

పాతబస్తీలోను…

పాతబస్తీలోను టాస్క్‌, టీహబ్‌, న్యాక్‌, వీహబ్‌, కేంద్రాల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ముస్లిం మైనారిటీలకు 705 యూనిట్లకు అనుమతులు ఇవ్వగా, రూ. 800 కోట్ల పెట్టుబడులు జరిగాయని, 6,800 ఉద్యోగాల కల్పన జరిగిందని మంత్రి వివరించారు. మొత్తంగా మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో సుమారు 3 గంటల పాటు పరిశ్రమలు, ఐటీ పాలసీల గురించి క్షుణ్ణంగా వివరించి, తెలంగాణ ప్రగతి యాత్ర ఆగదని, దేశంలోనే ప్రఖ్యాతి సంపాదించుకుంటుందని వివరించారు.