|

తోటి కోడలు అనుడేంది? యారాలు అనాలె.

thotikodaluఎన్నీల ఎలుగు

శ్రీ అన్నవరం దేవేందర్‌

మనదికాని బాస మనది కాని యాస తోని పరేశాని ఉన్నది. యారాలు ఫోన్‌ చేసింది అనక మా తోటికోడలు అనవడ్తిరి. సడ్డకుడు ఎంత మంచిపేరు ఇది ఇడిశిపెట్టి తోడల్లుడు ఇదేందో అర్ధంగాదు. అన్న అన్నమాట ఎంత ముద్దుగున్నది. అన్న వోయి అన్నయ్య అని నేర్శిండ్రు. అక్క వోయి అక్కయ్య. ఈ అయ్య ఎందుకు కొసకు అంటిస్తండ్రో తెల్వదు. అత్త జాగల అత్తయ్య అత్త స్త్రీ లింగం అయ్య పురుషలింగం ఈ రెండు ఎందుకు కలుపుడో తెల్వది. అట్లనే మామ వంతుకు మామయ్య. వదినె అనక వదినమ్మ. తాత అనక తాతయ్య ఇయ్యపురాలును వియ్యపురాలట. ఇయ్యంపున్ని వియ్యంపుడట. ఇగ బిడ్డను కూతురు. ఇంక అల్లునికి ఏం పెట్టలేదు నయం. ఆడబిడ్డ అనక ఆడపడుచు అనవట్టిరి. దాన్నే మనోల్లు నేర్సుకునిరి. పెండ్లాం పెనిమిటి ఎంత మంచి పేర్లు వీటిని ఇడిల భార్యా, భర్తలు అంటరు. మ్యానమామను మేనమామ ఇట్లా కొత్త దీర్ఘాల మాటలు మొదలైనయి. ఇవన్ని ఇంటాంటే నాకైతే గమ్మతి అన్పిస్తంది గల్మల్ల అనక గుమ్మం అనవట్టిరి. తానం పోసుకోని రారా అంటే స్నానం అంటరు. గంటెపుస్తెను తాళి అంటరు.

పైలం నాయనా అనకుండా జాగ్రత్త బాబు అంటరు. పొద్దుగాల లేసి ఇటొంటి మాటలు ఇంటాంటే చెవులకు ఇదనిపిస్తది. పక్క పక్క వాల్లు కలిస్తే ఇద్దరి భాస ఉండాలె గని ఒక్కని భాసయాసనే అందరికి ఎట్ల ఎక్కుద్ది. ఇదేం యాస పైత్యమో తెలిసింది గని. కైలాట్కం అనక పొట్లాట అంటుండ్రు. ఈ మధ్య తోపుడు బండి మాట బాగా ఇనస్తంది. అసలు దీనిపేరు నూకుడు బండి. నూకడం వల్ల ముందుకు పోయేది కాబట్టి నూకుడు బండి అనాలె. ఇగ అండి అండి ఇదో కృతకం. ఎటుపోతున్నవు అనక ఏళ్ళుతున్నారండి.. వచ్చారండి రాలేదాండి. ఇలాంటిది ఒక భాసనే. అది మంచిది గాదు అని కాదు కని ఈ గడ్డమీన వాటి జాగల ఇంకో పదాలున్నయి గద. వాటిని ఇడిశిపెట్టి ఇవి మంచివి గావని అవతల పక్క పదాలు తెచ్చుకునుడు ఎందుకు అని మా కైత్కాల కనక చంద్రం ఊ..  వాదిస్తడు.

కన్కచంద్ర నీవు ఊకో బామ్మార్ధి అని, మనది మనకు ఏరే అయినంక ఏందోయి నీకు అని సముజాయించిన. కని మనోల్లె గిట్ల గాల్ల మాట వట్టిరి అని ఆయన అనవట్టిండు, మరి అక్కడోల్లు ఇక్కడికి వస్తే ఇక్కడి బాస సంస్కృతి వాల్లకు ఎక్కాలె గని వాల్లది మనకు రుద్దుడేంది అని ఆయన వాదన. అవుమల్ల ఇక్కడోల్లు సోలపురం, పూన, బొంబయి బతుకపోయి అక్కడి హిందీ బాస నేర్సుకుంటరు. ఇంక హింది తెలుగు మిక్స్‌ చేసి మాట్లాడుతరు. ఇంకా కొంచెం అన్నం పెట్టుకో అని మనం అంటే తోడెం అన్నం పెట్టుకో అంటరు. తోడా అంటే హిందీలో కొంచెం అని అర్థం. అట్లనే హైదరాబాద్‌ పాత బస్తీల అటు ఇటూ ఉర్దూ, తెలంగాణ బాషను కలిపి మాట్లాడుతరు. ముస్కురాయించుడు. గుసాయించుడు అంటరు. ముస్కురానా అంటే నవ్వుడు, గుస్నా అంటె సొర్రుడు అని ఉర్దూ అర్ధం రెండు భాషలను కలిపి ఇన సొంపుగ మాట్లాడుతరు. మరి 1956 పొత్తు తర్వాత వచ్చినోల్లు ఇక్కడి పదం ఒక్కటన్న మాట్లాడరు సరే. పోనీ మాట్లాడకుంటె వాయె, కని ఇక్కడియి మంచిది కాదని ఎక్కిరిచ్చుడేంది అని కైత్కాల కనకచంద్రం గుర్రుమంటడు. సరే పోనీయ్‌ మనోల్లు సుత మనయి ఇడిశిపెట్టి అత్తయ్య, తోటి కోడలు, కూతురు యాంటండీ, ఏమండీ భాసలకు మర్రుడే బాగ లేదు. ఇప్పుడు అసలు సిసలు బాస రావాలంటే 1956 తర్వాత అచ్చుకొట్టిన వయ్యిలు సదువని వాల్ల దగ్గర ఇంక పదిలంగనే ఉంటది. ఇప్పుడు మనల మన భాస కోసం పురాగ పచ్చి పల్లెటూల్లకు పోయి ఆ బాస నేర్సుక రావాలె. అదే మనం మాట్లాడాలె. మనం ఆఫీసులల్ల, ఇంట్లబయట మన భాసలనే రాసుకోవాలె, పూసుకోవాలె. అయితె మనది మనకు వచ్చినట్టుగదా అనవట్టిండు.

ఎగిలివారంగ అనక పొద్దున్నే అనుడు, విడుదలను ఆవిష్కరణ అనుడు మొదలు పెట్టుడును ప్రారంభించుడు అనుడు అట్లనే సాగుతున్నది. ఈ కైతలు, కథలు రాసే రచయితలు సుత మాట్లాడే భాసల రాసి సభల మాత్రం యాంటండి భాస ఇడుస్తలేరు. ఎందుకంటె అరవై ఏండ్ల సంది చెవుల్ల కండ్లల్ల నిండిపోయింది. తలకాయ నిండ ఉన్న తుప్పు జాగల సిసలైన పదాలకు జాగ కల్పించాలె. రోజు తెల్లారి లేస్తేనే కన్పిస్తయి. బువ్వకు అన్నం అంటరు, చారును రసం అంటరు గట్కను జొన్నన్నం అంటరు. శక్కరిని పంచదార అంటరు. చాయను టీ, పత్తను చాపత్త ఇట్లా గమ్మతిగనే ఇన్పిస్తయి. ఒక్క గీత గీసుకొని ఏరుపడంగనే అయిపోదు. ఆ శిక్కులన్నీ పోవాలె, అలవాట్లు పోవాలె. అంటే అవేవో మంచియి కావు అని కాదు గని మనది మనకు ఉండంగ అవుతలోల్లది ఎందుకు మన అవ్వ మనకు ఉండంగ అవుతలోల్ల అమ్మను అమ్మా అనుడు ఎందుకు. వాల్ల నాయినను మనం నాన్న అనుడు ఎందుకు అనేదే మా కైత్కల కనక చంద్రం ప్రశ్న.