అణగారిన వర్గాల వికాసం దిశగా…

  • ముఖ్యమంత్రి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. 

ఇది భారత స్వాతంత్య్ర అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భం. జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్య్ర సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్‌ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నది. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను..

ఈ సందర్భంగా 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ ప్రస్థానంలోని వెలుగు నీడల్ని మనందరం వివేచించు కోవాలి. మనం సాధించింది. ఏమిటి? ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు చేసు కోవాలి. ఒకవైపున దేశం అనేక రంగాలలో కొంతమేరకు పురోగతిని సాధించింది. అదేసమయంలో నేటికీ చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాలకోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉంది. ‘‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి’’ అని మహాకవి శ్రీశ్రీ రాసిన పాటనూ ఇప్పటికీ మనం అన్వయించుకోవలసిన అవసరం ఉంది.

మరింత నిబద్ధత, నిజాయితీ. సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్‌ నిర్మాణానికి భారత ప్రజలు పునరంకితం కావాలని కోరుకుంటున్నాను.

మహాత్మా గాంధీ నాయకత్వంలో, అహింసా మార్గంలో సాగిన జాతీయోద్యమమే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి మనం విజయం సాధించాం. స్వరాష్ట్రం సాధించుకున్న నాటినుంచి ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా, ప్రణాళికాబద్ధంగా తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తున్నది.

రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతున్నది. ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. అన్ని రంగాలలో గుణాత్మకమైన, గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించగలిగాం. వాస్తవం కళ్ళముందే కనపడుతోంది. ప్రగతి ఫలాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి. విద్యుత్‌ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీర్ఘ దృష్టితో రూపొందిన ప్రణాళికతో, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పరిపాలన కొనసాగించటం వల్ల తెలంగాణా ఏడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఆర్థికాభివృద్ధితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. 2013 -2014 తెలంగాణా ఏర్పడిన నాడు రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4,51,580 కోట్ల రూపాయలు. కోవిడ్‌ ఉత్పాతం ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు తీవ్ర అవరోధాలను సృష్టించినప్పటికీ 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 9 లక్షల 80 వేల 407 కోట్ల రూపాయలుగా నమోదైంది.

అదే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 2013-2014 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 12 వేల 126 రూపాయలు ఉండగా నేడు తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షల 37 వేల 632 రూపాయలకు చేరుకుంది. నేడు మన దేశ తలసరి ఆదాయం 1 లక్షా 28 వేల 829 రూపాయలుగా నమోదైంది. దేశ తలసరి ఆదాయం కంటే, తెలంగాణా రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో పదికి మించి పార్లమెంట్‌ స్థానాలున్న పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే.. తలసరి ఆదాయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పడానికి గర్విస్తున్నాను.

కరెంటు కష్టాలకు చరమగీతి పాడిన రాష్ట్రంగా తెలంగాణా చరిత్రకెక్కింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను అంతగా బలోపేతం చేసింది. నేడు దేశంలో 24 గంటలూ అన్ని రంగాలకూ నిరంతరాయంగా మేలైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నటువంటీ, రైతులందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే. తెలంగాణ ఏర్పడిన నాడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 7,788 మెగావాట్స్‌ మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం చేసిన 

అపూర్వమైన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం 16,425 మెగావాట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ పరిధిలో కేవలం 71 మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు మాత్రమే 

ఉత్పత్తయ్యేది. ప్రస్తుతం మన రాష్ట్రం 4 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో మన తెలంగాణ దేశంలో రెండవ స్థానంలో ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన తొలినాళ్ళలో రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 1356 యూనిట్లు ఉండేది. విద్యుత్‌ రంగంలో వచ్చిన అసాధారణ అభివృద్ధి వల్ల రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం ప్రస్తుతం 2012 యూనిట్లకు పెరిగింది. 

జాతీయ తలసరి విద్యుత్‌ వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 73 శాతం అధికంగా ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మొట్ట మొదటి స్థానంలో నిలిచిందని సవినయంగా మనవి చేస్తున్నాను. మన నల్లగొండ జిల్లాలో, 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణమౌతున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రభుత్వరంగంలో నిర్మిస్తున్న మొట్టమొదటి అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌. ఈ ప్లాంట్‌ అందుబాటులోకి రాగానే తెలంగాణ మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా అవతరిస్తుందని తెలియజేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 

మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ.

ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో, అనేక విషయాలలో మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా నిలిచింది. వివిధ రాష్ట్రాల వారు మన విధానాలను అనుసరించి, ఆచరించడానికి మనవద్దకు వస్తున్నారు. మన పథకాలను, మన కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నారు. అనతికాలంలోనే నూతన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శ రాష్ట్రంగా మారిన అద్భుతాన్ని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆవిష్కరించింది. వ్యవసాయ రంగంలో అసాధారణ అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుప్పకూలి పోయింది. సాగునీరు అందక, కరెంటు లేక, పంటలు పండక, పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక, కుటుంబాలను పోషించుకోలేక రైతన్నలు ఆత్మహత్యలపాలై పోయారు. నిత్య విషాద ఘటనలతో తెలంగాణ తల్లడిల్లిపోయింది. సమైక్య పాలకుల వివక్ష, విద్రోహాల కారణంగా తెలంగాణ తీవ్రమైన జీవన విధ్వంసానికి గురైంది.

ఇవాళ దృశ్యం మారిపోయింది. స్వరాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయరంగంలో అసాధారణమైన అభివృద్ధి నమోదయింది. ఒకప్పుడు తెలంగాణా కరవు కాటకాలకు చిరునామాగా మారింది ప్రస్తుతం అదే తెలంగాణా 2020-21 వ్యవసాయ సంవత్సరంలో, మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు కలిపి మూడుకోట్ల నలభై లక్షల టన్నుల దిగుబడిని సాధించిన రాష్ట్రంగా దేశంలో అగ్రభాగాన నిలిచింది. రాష్ట్ర జీ.డీ.పీ లో 20 శాతం ఆదాయం వ్యవసాయరంగం సమకూరుస్తున్నది. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని ప్రభుత్వం పండుగలా మార్చింది అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనమేముంటుంది.

తెలంగాణ వ్యవసాయ సమృద్ధిని సాధించిన సస్యశ్యామల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది.

ఉమ్మడి రాష్ట్రంలో మన అవసరాలకోసం కానీ, పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ కోసం కానీ ఎక్కడెక్కడి నుంచో, పంజాబ్‌ తదితర రాష్ట్రాల నుంచి బియ్యం దిగుమతి అయ్యేవి. అవి తినడానికి కూడా పనికొచ్చేవి కాదు. కానీ ఈరోజు తెలంగాణ రైతన్నలు తెలంగాణకే కాదు, దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. తెలంగాణ ‘‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా’’ అవతరించింది.

మంత్రం వేస్తేనో, మాయ చేస్తేనో ఇటువంటి విప్లవాత్మకమైన మార్పు సంభవించదని నేను వేరే చెప్పనక్కరలేదు. అహర్నిశలూ చేసిన మేధోమథనం, సమర్థవంతమైన ప్రణాళికల పర్యవసానమే ఈ అపూర్వ అభివృద్ధి అని సవినయంగా మనవి చేస్తున్నాను. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, త్వరితగతిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్తు, వ్యవసాయ శాఖను పటిష్ట పరచటం, వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు, రైతుబంధు, రైతు బీమా పథకాలూ, రైతువేదికలు, పొలాల దగ్గర కల్లాల నిర్మాణం, గిడ్డంగుల సౌకర్యంలో పెరుగుదల, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది. ప్రభుత్వం తమకు అండగా ఉన్నదన్న ధైర్యాన్ని, భరోసాని రైతులకు అందించింది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కావాల్సిన బలమైన పునాదుల్ని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మించింది.

ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం కనీవినీ ఎరుగని ప్రగతిని సాధించింది.

2013-14 లో తెలంగాణలో దాదాపు 49 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయితే, 2020`21 ఆర్థిక సంవత్సరంలో కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరిపంట సాగయింది. 60.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగయింది. 31 లక్షల 60 వేల బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది. పత్తి సాగులో తెలంగాణా దేశంలో మహారాష్ట్ర తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. దేశంలో తెలంగాణా పత్తికి, చాలా నాణ్యమైనదనే పేరుంది కనుక మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉండటం గమనార్హం.

గత ఏడాది ధాన్యం కొనుగోళ్ళలో దేశంలో రెండవ స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు నెంబర్‌ వన్‌ దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది యాసంగిలో భారత ఆహార సంస్థ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 56 శాతం మన రాష్ట్రమే అందించగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, గిట్టుబాటు ధరకు రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం సేకరిస్తోంది.

ప్రజాసంక్షేమం

తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది. రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లు కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే తెలంగాణా ప్రభుత్వం 2,016 రూపాయలిచ్చి నిజమైన చేయూతనిస్తున్నది.

సంక్షేమ ఫలాలు మరింత విస్తృత సంఖ్యలో ప్రజలకు అందించటం కోసం వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హత వయస్సును 65 నుంచి 57 ఏళ్ళకు తగ్గించింది. దీనివల్ల మరింతమంది నిస్సహాయులకి ఆసరా అందుతుంది.

గతంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మాత్రమే పరిమితమైన ఆసరా పింఛను పథకాన్ని బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్‌ రోగులకు, బోదకాలు బాధితులకు కూడా తెలంగాణా ప్రభుత్వం వర్తింపచేస్తున్నది.

పేదింటి ఆడబిడ్డల పెండ్లి వారి తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. 51 వేల రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పుడు లక్షా నూటపదహార్లు అందుతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో వాగ్దానం చేసినవి కావు. పేదల కష్టనష్టాలను తెలిసిన ప్రభుత్వంగా మానవతా భావనతో అమలుచేస్తున్న పథకాలివి.

వైద్యం, ఆరోగ్యం

2019 డిసెంబరు నుంచి కరోనా కల్పించిన, కల్పిస్తున్న కష్ట నష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాటిని అధిగమిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని రక్షిస్తూ, ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం శతవిధాలా కృషి చేసింది. వ్యాధికంటే, వ్యాధి భయంతో చాలామంది మరణిస్తున్నారని తెలిసి, నేనే స్వయంగా హైదరాబాద్‌, వరంగల్‌ ఆస్పత్రులను సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న కరోనా రోగులను పలకరించి, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాను. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాను. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రభుత్వ కోవిడ్‌ వైద్య కేంద్రాలలో 27,996 బెడ్లు అందుబాటులో ఉండగా అందులో 17,114 బెడ్లను ఆక్సీజన్‌ బెడ్లుగా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. త్వరలోనే అన్ని బెడ్లను ఆక్సీజన్‌ బెడ్లుగా మార్చబోతున్నది. కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంలో మన డాక్టర్లు, వైద్య శాఖ సిబ్బంది చేసిన కృషి అభినందనీయం… రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆస్పత్రులలో వసతి సౌకర్యాలు మెరుగుపరిచింది. డయాలసిస్‌ వంటి వైద్యసేవలు, అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చింది. ఇప్పుడు అధునాతన వసతులతో కొత్త ఆస్పత్రుల నిర్మాణం, పడకల పెంపునకు శ్రీకారం చుట్టింది. అన్ని జిల్లా కేంద్రాలలో డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నది.

ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఈ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. ఈ కేంద్రాలలో 50కి పైగా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు.

బస్తీల్లో నివసించే పేద ప్రజల ముంగిటికి వైద్యాన్ని తీసుకురావాలనే సదుద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం నగరంలో 224 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. పేదలు నివసించే బస్తీలలో ఉండే ఈ వైద్యశాలల్లో వైద్యంతో పాటు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తోంది. అవసరమైన మందులు కూడా అందిస్తున్నది. తమ నివాసాల దగ్గరే దవాఖానలు ఏర్పాటు కావడంతో నగరంలోని పేద ప్రజలు చీటికిమాటికి కార్పోరేట్‌ హాస్పటళ్ళను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే దుస్థితి తొలగిపోయింది.

బస్తీ దవాఖానలు తమకు ఒక వరంగా మారాయని పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్తీ దవాఖానాలిచ్చిన స్ఫూర్తితో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ‘‘పల్లె దవాఖానాలు’’ ఏర్పాటు చేస్తున్నది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకూ గ్రామీణ ఉప వైద్య కేంద్రాలలో కేవలం నర్సులు మాత్రమే అందుబాటులో ఉండేవారు. డాక్టర్లను కూడా అందుబాటు లోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున డాక్టర్ల నియామక ప్రక్రియను చేపట్టింది.

మహిళల ప్రసూతి విషయంలో ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వ్యవహరించింది.

దేశంలోనే తొలిసారిగా మెటర్నటీ ఐ.సి.యులను ఏర్పాటు చేసింది. చాలాచోట్ల మహిళల ప్రసూతి కోసమే ప్రత్యేక వైద్య శాలలు నెలకొల్పింది. 102 అమ్మఒడి వాహనాలు ఏర్పాటు చేసి మారుమూల పల్లెల నుంచి కూడా ప్రసవం కోసం గర్భిణులను దవాఖానాలకు తరలించే ఏర్పాటు చేసింది. కె.సి.ఆర్‌ కిట్స్‌ ప్రారంభించి ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవిస్తే 12 వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నది. 2 వేల రూపాయల విలువైన వస్తువులతో హెల్త్‌ కిట్‌ పంపిణీ చేస్తున్నది.

ఈ చర్యలతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివిధ సూచీలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నవజాత శిశు మరణాలు, బాలింత మరణాలు, ఐదేళ్ళలోపు శిశువుల మరణాలు అరికట్టడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణా రాష్ట్ర పౌరుల డిజిటల్‌ ఆరోగ్య నివేదిక (HEALTH PROFILE) రూపొందించే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ములుగు సిరిసిల్ల, నియోజకవర్గాలలో వివరాల సేకరణను ప్రారంభించింది నూతనంగా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ళ నిర్మాణం చేపట్టింది. అరవై ఏళ్ల సమైక్య రాష్ట్ర చరిత్రలో తెలంగాణాలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు కేవలం ఐదు మాత్రమే. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన మొదటి దశలోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌ లలో 4 కొత్త కళాశాలలను వెనువెంటనే మంజూరు చేసింది. ఈ కళాశాలల్లో వైద్య విద్యా బోధన విజయవంతంగా జరుగుతున్నది. ప్రస్తుతం కొత్తగా మరో 8 వైద్య కళాశాలలు ప్రభుత్వం. మంజూరు చేసింది. ఇవి వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నది. వేగంగా భవనాల నిర్మాణం చేపడుతోంది. నూతనంగా మంజూరైన వైద్య కళాశాలలతో కలిపి రాష్ట్రంలో వైద్య కళాశాల సంఖ్య 17 కు చేరుకుంది. రాబోయే రోజుల్లో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. నగరం నలుదిక్కులా వైద్య సేవల విస్తరణ కోసం’’తెలంగాణా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’’ (‘‘టిమ్స్‌’’) అనే పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని గచ్చిబౌలిలో మొట్టమొదటి టిమ్స్‌ దవాఖాన ఏర్పాటై సేవలందిస్తోంది. ఎల్‌.బి.నగర్‌, అల్వాల్‌, సనత్‌ నగర్‌ లలో మరో మూడు టిమ్స్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ళను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం భూసేకరణ పనులు పూర్తయ్యాయి. సింగరేణి ప్రాంతంలోని రామగుండంలో ఒకటి పటాన్‌చెరువు పారిశ్రామిక వాడలో ఒకటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం నిర్మించనున్నది. త్వరలో ఈ హాస్పిటళ్ళ నిర్మాణ పనులకు ప్రభుత్వం శంకుస్థాపన చేయబోతున్నది. వరంగల్‌ నగరంలో అధునాతనమైన వసతులతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఇటీవల నా చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది. అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఒకే గొడుగు కింద అందుబాటులోకి వస్తాయి.

పాలనా సంస్కరణలు

పరిపాలనలో అనవసర జాప్యాన్ని తొలగించి, పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను చేపట్టింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టింది. గతంలో జిల్లా కేంద్రాలు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు అనేక అవస్థలు అనుభవించారు. ప్రజల ఆకాంక్షలు, విజ్ఞప్తుల మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. రెవెన్యూ డివిజన్లను 43 నుండి 74 కి పెంచింది. మండలాలను 459 నుండి 594 కి పెంచింది. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుండి 129 కి పెంచింది. కొత్తగా 7 మున్సిపల్‌ కార్పోరేషన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పోరేషన్ల సంఖ్య 13 కు పెరిగింది.

గిరిజన తండాలు, ఆదివాసి గూడేలు, మారుమూల తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చింది. గతంలో 8690 గ్రామపంచాయతీలుంటే ప్రస్తుతం వాటి సంఖ్యను 12,769 కి పెంచింది. పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు అతి సమీపంలోకి వచ్చాయి. చిన్న పరిపాలన విభాగాల వల్ల అధికారులకు పాలనలో సౌలభ్యం పెరిగింది. వారి పనితీరు ఎంతో మెరుగుపడింది.

గతంలో రాష్ట్రంలో 2 పోలీస్‌ కమిషనరేట్లుండగా, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 7 పోలీస్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 9 పోలీస్‌ కమిషనరేట్లు శాంతిభద్రతలను సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్నాయి.

ప్రభుత్వం 25 జిల్లాల్లో అధునాతన హంగులతో విశాలమైన సమీకృత కలెక్టరేట్ల భవనాల నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో 4 భవనాలు ప్రారంభ మయ్యాయి. 12 భవనాల నిర్మాణం పూర్తయిపోయింది. మిగతా భవనాల నిర్మాణ పనులు దాదాపు పూర్తికావస్తున్నాయి.

నూతన పోలీస్‌ కమిషనరేట్ల భవనాల నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తికావచ్చాయి.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం గ్రామాలలో, పట్టణాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పన చేసింది.

‘‘అపరిశుభ్రత అనాగరికతకు సంకేతం, పరిశుభ్రతలోనే పరమాత్ముడు కొలువై ఉంటాడు’’ అని మహాత్మా గాంధీ పేర్కొన్నారు. భారత జాతిపిత ఆశయాలను నిజం చేస్తూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంగా, పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా అనేక నిర్మాణాలు చేసింది.

మరణించిన వారికి సగౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడానికి ఊరూరా వైకుంఠధామాలను నిర్మించింది. చెత్త విసర్జన కోసం ప్రతీ ఊరుకు ఒక డంప్‌ యార్డ్‌ను ఏర్పాటు చేసింది. మొక్కల పెంపకం కోసం ప్రతీ గ్రామానికి ఒక నర్సరీని ఉండేలా ఏర్పాటు చేసింది.

గతంలో రాష్ట్రంలో గ్రామపంచాయతీల వద్ద పారిశుధ్య నిర్వహణ కోసం మొత్తం కలిపి కేవలం 84 ట్రాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు తెలంగాణ ప్రభుత్వం 12,769 ట్రాక్టర్లను సమకూర్చింది. ఈ రోజు ప్రతీ గ్రామపంచాయతీ ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లను కలిగి ఉందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ప్రభుత్వం ప్రజారోగ్యం మెరుగుపడేలా చేసింది.

ప్రజలలో అవగాహన పెంపొందించింది. అడుగడు గునా పచ్చని చెట్లతో, పరిశుభ్రమైన పరిసరాలతో, నిరంతర విద్యుత్తుతో గ్రామాలూ, పట్టణాలు శోభాయమానంగా, ఆహ్లాదంగా రూపొందుతున్నాయి.

కులవృత్తులకు ప్రోత్సాహం – గ్రామీణార్థికాభివృద్ధి 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. సమైక్యపాలనలో ధ్వంసమైన కొన్ని లాభసాటి కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఊపిరి పోసింది. ఆ వృత్తుల మీదనే ఆధారపడి జీవిస్తున్న వారికి తగిన ఆర్థిక, హార్థిక మద్దతును అందిస్తున్నది. కుల వృత్తులపై ఆధారపడినవారిలో ఎక్కువభాగం బి.సి వర్గాలవారే. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు వారి జీవితాలలో భరోసాను నింపుతున్నాయి.. ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలో నీటి లభ్యత ఉన్న ప్రతి చోటా చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. కాళేశ్వరం, తదితర ప్రాజెక్టుల నిర్మాణం తరువాత రాష్ట్రంలోని రిజర్వాయరు లతో పాటూ, చెరువులూ కుంటలూ అన్నిరకాల జలాశయాలు నిండు కుండల్లా మారాయి. చేపల పెంపకానికి విస్తృత అవకాశాలు లభించాయి. రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగి, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరిగింది. వారి జీవితాలలో ఆనందం చోటుచేసుకుంది. నేడు తెలంగాణ ఇతర ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం 11 వేల కోట్ల భారీ మొత్తంతో గొల్లకురుమలకు పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. పంపిణీ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నది. ప్రభుత్వ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో గొర్రెల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. గొర్ల కాపరుల ఆదాయం కూడా భారీగా పెరిగింది.

కేంద్ర ప్రభుత్వ గణాంకాలను అనుసరించి దేశంలో గొర్రెల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.

కల్లుగీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడలు, నాయీబ్రాహ్మణ, రజక, తదితర వృత్తి కులాల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తున్నది.

నాయీ బ్రాహ్మణ, రజక వృత్తులవారికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. రజకులకు అధునాతన దోభీ ఘాట్లు, నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటుకు కావలసిన నిధులను సమకూరుస్తున్నది.

దూసుకుపోతున్న పారిశ్రామిక, ఐ.టి రంగం

పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణ నేడు దేశంలో ముందు వరసలో ఉంది. పరిశ్రమల స్థాపనకు అత్యంత సౌకర్యం ఉండే విధంగా 2015 నవంబర్‌ లోనే టి.ఎస్‌.ఐపాస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ విధానం యావత్‌ ప్రపంచం తెలంగాణ వైపు తిరిగి చూసేలా చేసింది. పరిశ్రమలు స్థాపించాలని అనుకొనేవారు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో ప్రభుత్వం అన్ని అనుమతులు ఇస్తున్నది. ఈ పాలసీ ప్రవేశపెట్టిన నాటి నుంచి రాష్ట్రానికి 2.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. లక్షలాది మందికి ఉపాధి లభించింది. గత ఏడేళ్ళలో 16 వేల 671 పరిశ్రమలు మన రాష్ట్రానికి తరలివచ్చాయి.

ఈ పరిశ్రమల ద్వారా 15 లక్షల 86 వేల 500 ఉద్యోగాల కల్పన జరిగింది. రాష్ట్రంలో ఐ.టి రంగం అప్రతిహతంగా దూసుకు పోతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఐ.టి రంగం అభివృద్ధిపై కొందరు లేవనెత్తిన అనుమానాలు పటాపంచలయ్యాయి. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినా తట్టుకొని, మన రాష్ట్రంలో ఐ.టి రంగం పురోగమించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రపంచ ఐ.టీ దిగ్గజాలుగా పేరుపొందిన 20 ప్రతిష్ఠాత్మక సంస్థలు హైదరాబాద్‌ కు తరలివచ్చా యి

2013-14లో మన రాష్ట్రం నుంచి ఐ.టి ఎగుమతుల విలువ 57,258 కోట్ల రూపాయలు కాగా, 2020-21 సంవత్సరానికిది 1,45,522 కోట్లకు చేరింది. భారతదేశపు ఐ.టి రంగం స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు ప్రతియేడాది పెరుగుతూనే ఉంది.

ఉద్యోగాల కల్పనలో కూడా ఐ.టి రంగం విశేష ప్రగతి సాధించింది. 2013-14 నాటి ఉద్యోగుల సంఖ్యతో పోల్చి చూస్తే, నేడు సుమారు రెట్టింపుమందికి ఐ.టి, ఐ.టి ఆధారిత పరిశ్రమలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత ఐ.టి పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి 10 ఉద్యోగాలలో ఆంధ్రప్రదేశ్‌ ఐ.టి. రంగం సగటున ఒక ఉద్యోగం మాత్రమే కల్పించగలిగేది. తెలంగాణ ప్రభుత్వ కృషి కారణంగా గత ఏడాది భారత ఐ.టి పరిశ్రమలో కొత్తగా వచ్చిన ప్రతి 10 ఉద్యోగాలలో మూడు ఉద్యోగాలు తెలంగాణ ఐ.టి రంగం కల్పించినవే కావడం విశేషం.

ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీ :

తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయటం కోసం సన్నాహాలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వంతో నెలల తరబడి చర్చించి, తీవ్ర ప్రయత్నాలు చేసిన ఫలితంగా స్థానికులకు 95శాతం ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకు వచ్చింది. నూతన జోనల్‌ వ్యవస్థను అమలులోకి తెచ్చింది.

నూతన జోనల్‌ విధానం ప్రకారంగా నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలకు పోస్టుల మరియు ఉద్యోగుల విభజన ప్రక్రియ పురోగతిలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తదనంతరం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభిస్తుంది.

ట్రీ సిటీగా హైదరాబాద్‌

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతం పైగా పెరిగింది. ట్రీ సిటీగా హైదరాబాద్‌ కు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోని 63 దేశాలలో భారత దేశం నుంచి ఈ ఘన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్‌ కావడం విశేషం.

ఈ ఘనత ఆషామాషీగా రాలేదు. చెట్లను నాటడంలో, పోషించడంలో, విస్తరించడంలో ప్రభుత్వం నిర్మాణం చేసిన గొప్ప వ్యవస్థ ప్రధాన కారణం. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేసిన సర్వేలో తెలంగాణలో పచ్చదనం సుమారు నాలుగు శాతం పెరిగినట్టు వెల్లడయింది. కేంద్ర అటవీ శాఖా మంత్రి కూడా నిండు పార్లమెంటులో మొక్కలు నాటడంలో, చెట్లు పెంచడంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నట్టు ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ నిపుణులు మన ప్రయత్నాలను ప్రశంసించారు. ఇదే స్ఫూర్తి మరికొంత కాలం సాగాలి.

మొక్కలను నాటాలనీ, శ్రద్ధగా హరిత లక్ష్యం సిద్ధించే వరకూ అందరూ పట్టుబట్టి పెంచాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

అన్ని ప్రాంతాల ప్రజలు సౌకర్యంగా జీవనం గడపటానికి అనువైన నగరంగా కూడా హైదరాబాద్‌కు ఎంతో పేరు వచ్చింది. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో అడుగడుగునా నిర్మించిన ఫ్లై ఓవర్లు, పెరిగిపోతున్న ట్రాఫిక్‌ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఇంకా పలు ఫ్లెఓవర్లు, స్కై ఓవర్లు నిర్మాణదశలో ఉన్నాయి. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ఆసియాలోనే రెండవ అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది.

దుర్గం చెరువు బ్రిడ్జి నగర ప్రజలకు దూరాభారం తగ్గించడమే కాకుండా, సాయంకాలాలు జనం సేదతీరే ఉల్లాస కేంద్రంగా ఉపయోగపడుతున్నది.

హైదరాబాద్‌ నగరం అనంతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అదనంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఉద్యమంగా దళిత బంధు

మనదేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం. దీనికి మన రాష్ట్రం కూడా అతీతంకాదు.

దళితజాతిని దారిద్య్రం ఒక్కటే కాదు, ఆ వర్గంపై ఉన్న సామాజిక వివక్ష కూడా తరతరాలుగా బాధిస్తున్నది. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా దళితుల జీవితాల్లో ఇంకా చీకటి అలుముకొని ఉందనే కఠోర వాస్తవాన్ని మనమందరం అంగీకరించి తీరాలి.

దేహంలో కొంత భాగాన్ని ఖండించితే ఆ దేహం కుప్పకూలుతుంది. అదే విధంగా దేశంలో ఒక పెద్ద ప్రజాసమూహాన్ని అణచివేస్తే ఆ దేశం కూడా కుప్పకూలుతుందనే నిజాన్ని అందరూ గ్రహించాలి. ‘‘ప్రజాస్వామ్యమంటే సమానత్వమే. వీలయినంత తొందరగా దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి, దళితుల అభివృద్ధి అందుకు మొదటి సోపానం కావాలి’’ అని అన్న భారత రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మాటల్లోని గంభీరతను దేశ పరిపాలనా వ్యవస్థలన్నీ ఇప్పటికైనా గ్రహించాలి.

తెలంగాణ ఏర్పడిన నాటినుండీ అణగారిన కులాల వికాసం దిశగా ప్రభుత్వం బలమైన అడుగులువేసింది. దళితులలో విద్యా వికాసం చోటు చేసుకోవాలి అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున రెసిడెన్షియల్‌ స్కూళ్ళను స్థాపించింది. 2014 తెలంగాణ ఏర్పడే నాటికి దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్‌ స్కూళ్ళ సంఖ్య కేవలం 134 మాత్రమే. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు సంవత్సరాల్లో కొత్తగా 104 స్కూళ్ళు ఏర్పాటు చేసింది. ఈరోజు రాష్ట్రంలో దళిత విద్యార్థుల కోసం ఏర్పాటైన రెసిడెన్షియల్‌ స్కూళ్ళ సంఖ్య 238కి పెరిగింది. ఈ ఏడెండ్లలో ఎస్‌, సి మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలల్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎస్‌.సి. ప్రగతి నిధి కింద కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే, మిగిలిన నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించే విధంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 

దళిత విద్యార్థులు విదేశాలలో విద్యనభ్యసించేందుకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్షిప్‌ పథకం ద్వారా 20 లక్షల రూపాయల అత్యధిక మొత్తాన్ని స్కాలర్‌ షిప్‌ గా అందిస్తున్న ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వం.

దళితజాతిని ప్రత్యేక శ్రద్ధతో ఆదుకోవడం నాగరిక సమాజానికి ప్రధాన బాధ్యత. అది ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రాథమిక విధి. 

అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు. ఈ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. ఈర్ష్యా, అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటిమీద నిలవాలి. దళిత సమాజానికి ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. కులం పేరిట నిర్మించిన ఇనుపగోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి.

దళితజాతి సమగ్ర వికాసం కోసం ఇప్పటివరకూ జరిగింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరగబోయేది ఇంకో ఎత్తు అనే విధంగా తెలంగాణా ప్రభుత్వం దళిత బంధు ఉద్యమానికి నాంది పలుకుతున్నది. అణగారిన దళితజనం ఒక్క ఉదుటున లేచి నిలబడి, స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహాసంకల్పానికి ఆచరణ రూపమే తెలంగాణ దళితబంధు ఉద్యమం అని రాష్ట్ర ప్రజలకు సవినయంగా మనవి చేస్తున్నాను.

దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, తద్వారా సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించడమే లక్ష్యంగా పెట్టుకొని స్వయంగా నేనే దళితబంధు పథకానికి రూపకల్పన చేశాను. మహాత్మా జ్యోతిరావు ఫూలే, భారతరత్న బి.ఆర్‌. అంబేద్కర్‌ మహాశయుల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు, దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని సాధిస్తుందనే సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరం బడ్జెట్‌లోనే ప్రభుత్వం దళిత బంధు అమలు కోసం నిధులు మంజూరు చేసింది. రేపటి నుంచి ఈ పథకాన్ని మన రాష్ట్రంలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా అమలుచేస్తుంది.

రాష్ట్రంలోని మిగతా నియోజక వర్గాలలో పాక్షికంగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వాలు దళితులకు అందించిన చిన్న చిన్న రుణాలు, సబ్సిడీలు వంటి అరకొర సహాయాలతో వారిలోని ఆర్తి తీరలేదు. వారి పరిస్థితిలో గణనీయ మైన మార్పు రాలేదు. అందుకే దళితబంధు కింద యూనిట్‌ పెట్టుకోవడానికి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రేరణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళితబంధు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుని పేరున ఉన్న ఖాతాలోకి ప్రభుత్వం నేరుగా జమచేస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా 10 లక్షల రూపాయలను పూర్తిగా గ్రాంటు రూపంలో అందజేస్తుంది.

దీంతో లబ్ధిదారుడికి వాయిదాలు చెల్లించాలనే ఆందోళన ఉండదు. ప్రశాంతంగా తన జీవనోపాధిని కొనసాగించుకోగలుగుతాడు. ప్రభుత్వం అందించిన పెట్టుబడి సొమ్ముతో ఉపాధి, వ్యాపార మార్గాన్ని ఎంచుకొనే పూర్తి స్వేచ్ఛ లబ్దిదారునికే ఉంటుంది.

తనకు ఏ రంగంలోనైతే అనుకూలత, అనుభవం, ప్రావీణ్యం, ఉందని లబ్ధిదారుడు భావిస్తాడో ఆ రంగం లోనే తన జీవనోపాధిని ఎంచుకోవటానికి ప్రభుత్వం సహకరిస్తుంది. లబ్ధిదారులెవరైనా తనకు తాను ఉపాధిని ఎంచుకోవటంలో అస్పష్టతకు లోనైతే, ప్రభుత్వం యొక్క సూచనలు కోరితే, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన విధంగా మార్గదర్శనం చేస్తుంది.

కొందరు లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి, పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్‌ను పెట్టుకొనే అవ కాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రభుత్వం కేవలం ఆర్థిక ప్రేరణ ఇవ్వటం వరకే పరిమితం కావటం లేదు. దళితులను వివిధ వ్యాపార రంగాల్లో ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తేనున్నది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్‌ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్‌ షాపులు, మెడికల్‌ షాపులు, హాస్పిటళ్ళకు, హాస్టళ్ళకు, సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టులు, ఇంకా ప్రభుత్వం ద్వారా లభించే ఇతర కాంట్రాక్టులు, వైన్‌, బార్‌ షాపుల ఏర్పాటుకు లైసెన్స్‌ ఇచ్చే దగ్గర ప్రభుత్వం దళితులకు ప్రత్యేక రిజర్వేషన్‌ను అమల్లోకి తేనుంది.

రక్షణ కవచంగా దళితరక్షణ నిధి

దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబం పరిస్థితి మళ్ళా తలకిందులైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆపద సమయంలో దళితబంధు పథకం ఆ దళిత కుటుంబాన్ని ఒక రక్షక కవచంగా కాపాడాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకోసం దేశంలోనే ప్రప్రథమంగా ‘‘దళిత రక్షణ నిధి’’ని ఏర్పాటు చేసింది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే 10 లక్షల రూపాయలలో 10 వేల రూపాయలు లబ్ధిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో 10 వేల రూపాయలు ప్రభుత్వం కలిపి దళిత రక్షణ నిధిని నిల్వ చేస్తుంది.

ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణ నిధి నుండి వారికి ఆర్థిక మద్దతు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు సమితులను ఏర్పాటు చేస్తుంది. ఈ సమితుల నేతృత్వంలో నిధిని నిర్వహించటం జరుగుతుంది. దళితబంధు అమలు, దళితరక్షణ నిధి పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్లు కీలక భూమిక పోషిస్తారు. గతంలో ప్రభుత్వాలు దళితులకు ఏదైనా సహాయం అందించిన తర్వాత దాని ఫలితానికి సంబంధించిన పర్యవేక్షణ సరిగా ఉండేది కాదు. దళిత బంధు ద్వారా లబ్దిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షించడం కోసం తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకమైన పటిష్టమైన విధానం రూపొందించింది.

దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇస్తుంది. అందులో ప్రత్యేక చిప్‌ను అమర్చి, ఆ చిప్‌ సహాయంతో ఫలితాలను పర్యవేక్షిస్తుంది. దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పథకాలు అన్నీ ఎప్పట్లాగానే అందుతాయి. రేషన్‌ కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతర సౌకర్యాలు అన్నీ యథాతధంగా ప్రభుత్వం కొనసాగిస్తుంది. రాబోయే రోజుల్లో దళిత బంధు పథకం దేశానికి దారి చూపుతుందని, తద్వారా దేశంలో దళితుల జీవనగతిని మార్చివేసే ఉ­జ్వలమైన పథకంగా చరిత్రకెక్కుతుందనే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఇంతకాలం వివక్షకు గురైన దళితులు ఇక ముందు వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి, సమాజంలో ఆత్మ గౌరవంతో జీవించాలనే దళిత బంధు లక్ష్యాన్ని ప్రభుత్వం నూటికి నూరుపాళ్ళు నెరవేరుస్తుందని హామీ ఇస్తున్నాను. అవకాశాలు కల్పిస్తే దళితులూ సమాజంలో ఎవ్వరికీ తీసిపోరని, తమ శక్తి సామర్థ్యాలను నిరూపించు కుంటారని, ప్రపంచానికి తెలియజేస్తుంది.

తెలంగాణ దళిత బంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నది. ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిబద్ధతను చూసి, ఎంతో మంది దళిత మేధావులు, దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాల్లో తెలంగాణా దళిత బంధుని గురించి చక్కని చర్చ జరుగుతున్నందుకు ప్రభుత్వం ఎంతో సంతోషిస్తున్నది. రాజ్యాంగం ప్రవచించిన సమానత్వ విలువల సాధనలో తెలంగాణ దళిత బంధు ద్వారా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నూతన ప్రమాణాలను నెలకొల్పుతున్నది. రాష్ట్రంలో ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే విశాల దృక్పథంతో, ప్రణాళికాబద్ధంగా తెలంగాణా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. అయినా, మూడో దశ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్‌ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం తీసుకొనే ముందు జాగ్రత్త చర్యలకు తోడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది. అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది. ఆశించిన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే వాక్‌ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలి. ఈ మూడింటి మేళవింపుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజాభ్యుదయ పథంలో మునుముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ, యావత్‌ రాష్ట్ర ప్రజానీకానికి మరోమారు భారత స్వాతంత్య్ర అమృతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

రైతులకు రుణమాఫీ

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మూడు లక్షల మంది రైతులకు 25 వేల రూపాయల వరకూ ఉన్న పంట రుణాలను ఇదివరకే మాఫీ చేసింది. రేపటి నుంచే రాష్ట్రంలోని ఆరు లక్షల మంది అన్నదాతలకు 50 వేల రూపాయలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నది.

ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తు లవుతున్నారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది.

రైతులు పండించిన పంటలకు మరింత గిట్టుబాటు ధర లభించి, రైతులకు అదనపు మేలు చేకూరాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల పరిధిలో రైస్‌ మిల్లులు, ఇతర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

వీటిద్వారా రైతులు కష్టించి పండించిన వ్యవసాయోత్పత్తులకు మరింత మంచి ధర లభించి, రైతాంగం జీవనం సుసంపన్నం కావాలన్నదే టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వ ఆశయం.

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకున్న మూల కారణాలను అన్నిటినీ గ్రహించి పరిష్కార చర్యలు చేపట్టింది. తరాల తరబడి అనేక భూ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మార్చడానికి నూతన భూపరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రగతి నిరోధకంగా మారిన వి.ఆర్‌.వోల వ్యవస్థను తొలగించింది, మూడేళ్ళు కష్టపడి ధరణి పోర్టల్‌ ను ఆవిష్కరించి, భూరికార్డుల నిర్వహణలో పారదర్శకతను తెచ్చింది.

దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుంది. అన్నదాతలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. ధరణిలో నమోదయిన భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు.

నేతన్నలకు బీమా

Indian weaver, Vanam Vijay Kumar weaves fabric on a handloom at his household workshop at Koyalagudem village of Nalgonda District, some 50 kilometers from Hyderabad on January 19, 2017. The southern states of Telangana and Andhra Pradesh are known for handloom work and the weavers of these states are known to manufacture exclusive sarees with intricate and distinctive designs. / AFP PHOTO / Noah SEELAM

తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదు కోవడానికి అనేక పథకాలు రూపకల్పన చేసింది. చేనేత కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తున్నది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, రంగులు అందజేస్తున్నది. చేనేత కార్మికుల కుటుంబాలను మరింత ఆదుకోవడానికి రాష్ట్రంలో రైతన్నలకు అమలుచేస్తున్న రైతు బీమా తరహాలో త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబం ఖాతాలో ఐదు లక్షల రూపాయల బీమా సొమ్ము జమవుతుంది. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి టిఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక కార్పస్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేయనున్నది. ఎండకు ఎండి, వానకు తడిసే నిరుపేదల సొంత ఇంటి కలను తీర్చడం మాత్రమే కాదు, పేదలకు గౌరవ ప్రదమైన నివాసాలను కల్పించాలని ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇస్తున్నది.

ధనవంతులు నివసించే గేటెడ్‌ కమ్యూనిటీలకు సరిసాటిగా నిర్మించిన గృహ సముదాయాలలో పేదలు నివసిస్తున్న అపూర్వ దృశ్యాన్ని రాష్ట్రంలో పలుచోట్ల తెలంగాణా ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇది నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారునికి అందేవరకూ ఈ పథకం అమలవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త రేషన్‌ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నది. మూడు లక్షల పై చిలుకు కొత్త రేషన్‌ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది.

రామప్ప, యాదాద్రి

కాకతీయు కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం మనందరికీ గర్వ కారణం. ఈ గుర్తింపు వెనక ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉంది. ఈ కృషిలో పాలుపంచుకున్న ప్రజా ప్రతినిధులు, అధికారులందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు నేలపై మొదటిసారి విశ్వ వ్యాప్త గుర్తింపు పొందిన చారిత్రిక వారసత్వ కట్టడంగా రామప్ప పేరు నేడు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగుతోంది. 

స్వయం పాలనలో తెలంగాణా చారిత్రక ప్రతిపత్తికీ, ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ పూర్వవైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. అందులో భాగమే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం.

యాదాద్రి నిర్మాణం మహాద్భుతంగా ఉన్నదని, చరిత్రలో నిలిచిపోతుందని ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులందరూ వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రాచీన కళలు, వారసత్వం, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడు కోవాలనే దృక్పథంతో ఇంత గొప్ప ఆలయాన్ని ఆధ్యాత్మిక కళ ఉట్టిపడేలా పునర్ణిర్మించడం పట్ల భక్తులు, సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్ణిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది.

సర్వేజనా సుఖినోభవంతు.

జై హింద్‌ జై తెలంగాణా