డిజిటల్‌ పాఠాలకు అనూహ్య స్పందన

  • ట్రబుల్‌ షూటర్‌గా టి-సాట్‌

By: పీసరి లింగారెడ్డి

కోవిడ్‌-19 సమయంలో టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా ఉపయోగపడ్డాయి. లాక్‌ డౌన్‌ సమస్య, వైద్య సేవలు, జీతాల చెల్లింపు, రవాణా సదుపాయాలు, కోర్టు సమస్యలు వంటి వాటితో పాటు విద్యా సంవత్సర ప్రారంభానికి ప్రత్యేక పరిష్కారాన్ని చూపాయి. రాష్ట్ర ఐటి, మున్సిపల్‌ శాఖ మంత్రివర్యులు కె.టి.రామారావు గత మూడేళ్ల క్రితం వేసిన బీజానికి మంచి ఫలాలు అందాయి. కోవిడ్‌ సంకట పరిస్థితిలో ప్రభుత్వ శాఖలు తమ కింది స్థాయి సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంలో టి-సాట్‌ నెట్‌ వర్క్‌ ట్రబుల్‌ షూటర్‌ గా అవతరించింది.

తెలంగాణ ప్రభుత్వం 2020-21విద్యా సంవత్సరాన్ని గత సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుండి టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్ల ద్వార డిజిటల్‌ బోధనతో ప్రారంభించింది. డిజిటల్‌ బోధన ప్రారంభమైన మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న విద్యార్థులు డిజిటల్‌ పాఠాలను అనూహ్యంగా ఆదరించారు. ఆన్‌ లైన్‌ బోధన టి-సాట్‌ విద్య ఛానల్‌ ద్వార భలేగా ఉందంటూ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు టి-సాట్‌ కు అందించే సంక్షిప్త సమాచారాల ద్వార స్పష్టమైంది. గ్రామ పంచాయతీ, పాఠశాల, ఇంట్లోటీవీ తో పాటుమొబైల్‌ లో పాఠాలు వినడం భలే…భలేగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయడం విద్యాశాఖకు ఊరటనిచ్చే అంశం. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో టి-సాట్‌ నెట్వర్క్‌ ద్వార విద్యా సంవత్సరానికి చక్కటి పరిష్కారం లభించిందని ఉపాధ్యాయులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16,43,309 మంది విద్యార్థులకు వివిధ మాధ్యమాల ద్వార డిజిటల్‌ బోధనలు అందుతున్నాయి. వాటిల్లో ప్రధానంగా టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లలో ఒకటైన విద్య ఛానల్‌ ద్వార ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు డిజిటల్‌ పాఠ్యాంశాల ప్రసారాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు భోజన విరామ సమయం మినహా మూడవ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు పాఠ్యాంశాలు ప్రసారమౌతున్నాయి. టి-సాట్‌తో పాటు దూరదర్శన్‌ ఛానల్‌లో 10,72,651 మంది విద్యార్థులు పాఠ్యాంశాలను అనుసరించారు. స్మార్ట్‌ ఫోన్‌, డెస్క్‌ అండ్‌ ల్యాప్‌ టాప్‌ కాకుండా నేరుగా పాఠశాలలు, గ్రామాల్లోని ఇతర కేంద్రాల వద్ద ఉన్న ప్రసార మాధ్యమాల ద్వార 14,03,630 మంది విద్యార్థులు మొదటి రోజు ఆన్‌ లైన్‌ పాఠాలను అనుసరించారు. అంటే సుమారు 85.42 శాతం మంది విద్యార్థులు అన్‌ లైన్‌ పాఠాలను వీక్షించారు. వీరిలో మొదటి రోజు 11,73,921 మంది విద్యార్థులు టి-సాట్‌ యాప్‌ అంటే సుమారు 80 శాతం మంది విద్యార్థులు డిజిటల్‌ పాఠాలు చూసేందుకు వివిధ వేదికల ద్వార అందుబాటులో ఉన్న టి-సాట్‌ను ఎంచుకున్నారు.

రెండవ రోజు అదనంగా మరో 53,390 మంది యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారంటే విద్యార్థులకు టి-సాట్‌ నెట్వర్క్‌ ఎంత అందుబాటులోకి వచ్చిందో స్పష్టమౌతుంది. టి-సాట్‌ ఛానళ్లు విద్య, నిపుణ ప్రసారాలను ఏయిర్‌ టెల్‌ డీటీహెచ్‌, టాటా స్కై, సన్‌ డైరెక్టు తో పాటు రాష్ట్రంలోని 43 మంది కేబుల్‌ ఆపరేటర్లు ప్రసారాలను అందిస్తున్నారు. టి-సాట్‌ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాం ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ లోనూ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాల్లో
ఉండే విద్యార్థులకు డిజిటల్‌ బోధనలను వీక్షించే పద్ద్ధతులపై అవగాహన కల్పించారు. ఫలితంగా విద్యా సంవత్సరం ప్రారంభం విషయంలోనే కాకుండా పూర్తి స్థాయి విద్యా సంవత్సరానికి విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు విద్యా శాఖకు ఊరట లభించిందని భావించవచ్చు.

ప్రతి రోజు ఆరు గంటల ప్రసారాలు
తెలంగాణ విద్యా శాఖ అందించే డిజిటల్‌ పాఠ్యాంశాలను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఏడు గంటల పాటు మూడవ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రసారం చేస్తోంది. టి-సాట్‌ విద్య ఛానల్‌ నుండి ప్రసారమయ్యే పాఠ్యాంశాలు అరగంట నిడివి గల వీడియోలుగా విభజించి స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ (సైట్‌) అందిస్తున్న ఆరు సబ్జెక్టులను12 భాగాలుగా విభజించిన పాఠ్యాంశాలను ముందే ప్రకటించిన టైం టేబుల్‌ ప్రకారం టి-సాట్‌ ప్రసారం చేస్తోంది. సెప్టెంబర్‌ ఒకటవ తేదీన ప్రారంభమైన డిజిటల్‌ పాఠ్యాంశాలు వారాంతాలు, సెలవు రోజులు పోను డిసెంబర్‌ మాసాంతానికి సుమారు 85రోజులు కొనసాగాయి. ఐదు నెలల కాలంలో సుమారు 895 ఆన్‌ లైన్‌ క్లాసులు బోధించగా అందులో ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి తెలుగు-140, హిందీ-40, ఉన్నత పాఠశాల విద్యార్థులకు సంబంధించి హిందీ-115, ఇంగ్లీష్‌-215, తెలుగు-344 క్లాసులు ఉన్నాయి.

మూడు స్టూడియోల ద్వార రికార్డింగ్‌
తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ముందస్తు నిర్ణయానికి అనుగుణంగా టి-సాట్‌ భవనంలోని మూడు స్టూడియోల ద్వారా పాఠ్యాంశాల రికార్డింగ్‌ జరుగుతోంది. గత ఆగస్టు 20వ తేదీ నుండి రోజుకు 10 పాఠ్యాంశాల చొపున సంబంధిత సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలు తెలుగు, ఆంగ్ల భాషల్లో టి-సాట్‌ స్టూడియోల్లో రికార్డౌతున్నాయి. ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాల ఎడిటింగ్‌ పూర్తయ్యాక టి-సాట్‌ నెట్వర్క్‌ ద్వార ప్రసారమౌతున్నాయి. ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రికార్డింగ్‌ చేసి ప్రసారం చేస్తోంది. ఉర్డూ మీడియం విద్యార్థులకూ డిజిటల్‌ పాఠ్యాంశాలను అందించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించగా వాటినీ అందించేందుకు స్టూడియోలతో పాటు టైమ్‌ స్లాట్‌ నూ సిద్ధం చేసినట్లు సీఈవో ఆర్‌.శైలేష్‌ రెడ్డి ప్రకటించారు.

3-6 సంవత్సరముల చిన్నారులకు ఆన్‌ లైన్‌ పాఠాలు
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు నుండి ఆరు సంవత్సరాల చిన్నారులకు అన్‌ లైన్‌ డిజిటల్‌ పాఠాలు ప్రత్యక్ష ప్రసారాల ద్వార అందిస్తోంది ఆ శాఖ. గత ఆగస్టు నెలలో ప్రారంభమైన ఈ పాఠ్యాంశాల్లో చిన్నారులను ఆకట్టుకునేందుకు వీలుగా ఆట, పాటలతో కూడిన విజువల్స్‌ను ప్రసారాల రూపంలో అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ పాఠశాలలకు అర్హత పొందిన చిన్నారులకు అందిస్తోంది టి-సాట్‌. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రత్యక్ష్య ప్రసారాల ద్వార బోధించబడే అన్‌ లైన్‌ లైవ్‌ బోధన త్వరలో 150 ఎపిసోడ్‌ ఉత్సవాలను జరుపుకునేందుకు సిద్ధమైంది.

ఇంటర్‌ విద్యార్థులకు ఐదున్నర గంటలు
డిజిటల్‌ పాఠ్యాంశాల ప్రసారాల్లో భాగంగా టి-సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్లు ఇంటర్మీడియట్‌ విద్యార్థులకూ పాఠ్యాంశాలు అందిస్తున్నాయి. ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు నాలుగు పాఠ్యాంశాలు, సాయంత్రం ఐదు గంటల నుండి 8.30 గంటల వరకు మరో ఏడు పాఠ్యాంశాలు కలిపి మొత్తం 11 పాఠ్యాంశాలను ఐదున్నర గంటల పాటు ప్రసారం చేస్తోంది. ఇంటర్‌ విద్యార్థులకూ ఆరగంట నిడివి గల పాఠాలను రికార్డు చేసి ఇంటర్మీడియట్‌ బోర్డు అందిస్తుండగా టి-సాట్‌ ద్వార విద్యార్థులకు ప్రసారాలూ అందుతున్నాయి.

అవసరమైతే మరిన్ని స్లాట్స్‌: శైలేష్‌ రెడ్డి
విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్భంలో విద్యాశాఖ కోరితే టి-సాట్‌ నెట్వర్క్‌ ద్వార మరిన్ని స్లాట్స్‌ విద్యార్థులకు పాఠాలు అందించేందుకు సిద్ధం చేశామని టి.సాట్‌ నెట్వర్క్‌ ఛానళ్ల సీఈవో ఆర్‌.శైలేష్‌ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పాఠాలు ప్రసారం చేశామని, ప్రస్తుతం పదవ తరగతి, ఇంటర్‌ మీడియట్‌ విద్యార్థులకు ప్రసారాలు అందిస్తున్నామని శైలేష్‌ రెడ్డి తెలిపారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌తోపాటు ఇతర ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలను ప్రసారం చేసేందుకు అవసరమైన ఏర్పాటు చేశామన్నారు.