గ్రామం చిన్నది.. ఖ్యాతి పెద్దది!

తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఈ ఏడాది కాలంలోనే  రాష్ట్రం సాధించిన రెండు ప్రపంచస్థాయి అవార్డులే ఇందుకు నిదర్శనం. రాష్టంలోని రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించిన అనతి కాలంలోనే యాదాద్రిభువనగిరి జిల్లాలోని చిన్న గ్రామం భూదాన్‌ పోచంపల్లిని ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్య సమితికి చెందిన వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ ప్రకటించింది.

భూదాన్‌ పోచంపల్లి గ్రామం చిన్నదైనా ఇది సాధించిన ఖ్యాతిమాత్రం ఎంతో  ఉంది. భూదానోద్యమం భారతదేశంలో స్వచ్ఛందంగా జరిగిన ఒక భూముల పంపకం కార్యక్రమం. దీన్ని గాంధేయవాది వినోబాభావే 1951 సంవత్సరం ఏప్రిల్‌ 18న పోచంపల్లి గ్రామంలోనే ప్రారంభించారు. ఈ ఉద్యమంలో భాగంగా భూస్వాములను తమ దగ్గరున్న భూముల్లో కొంత భాగాన్ని భూముల్లేని నిరుపేదలకు పంచి ఇచ్చేందుకు ఆయన ఒప్పించారు. అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఉదారంగా తమ భూములను దానం చేశారు. వి.రామచంద్రారెడ్డి అనే భూస్వామి పోచంపల్లి గ్రామంలో వంద ఎకరాలకు పైగా భూమిని పంచియిచ్చి చరిత్ర సృష్టించారు. అనేక మంది దాతలకు ఆయన ఆదర్శంగా నిలిచారు. దీని తర్వాత రామచంద్రారెడ్డి కుమారుల ఆధ్వర్యంలో భూదానోద్యమం కొనసాగింది. ఈ భూదానోద్యమంతో పోచంపల్లి గ్రామం ఆనాటి నుంచీ భూదాన్‌ పోచంపల్లిగా ఖ్యాతికెక్కింది. 

దీనికితోడు, నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనంగా సిల్క్‌ సిటీగా పోచంపల్లి గ్రామం పేరుగాంచింది. నిజాం కాలంలోనే ఈ గ్రామం నుంచి తేలియా రుమాళ్ళను, గాజులు, పూసలు అరబ్‌ దేశాలకు ఎగుమతి అయ్యేవి. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరుగజాల పట్టుచీరను ఇక్కడి కార్మికులు నేసి ఆనాడే చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచీ పోచంపల్లి గ్రామం సిల్క్‌సిటీగా పేరుగాంచింది. ఇక్కడి కార్మికులు తయారుచేసే ఇక్కత్‌ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వీటికి 2004లోనే జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ గుర్తింపు కూడా దక్కింది.

ఈ గ్రామం గొప్పదనాన్ని తెలుసుకున్న అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్‌, రష్యాతోసహా పలు దేశాల యాత్రికులు ఇప్పటికే ఇక్కడికి పెద్దసంఖ్యలో వచ్చి పోతుంటారు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా, స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా తెలంగాణ చారిత్రక, పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపు సాధిస్తున్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హర్షం వ్యక్తంచేశారు. ఆ గ్రామ ప్రజలకు ముఖ్య మంత్రి అభినందనలు తెలిపారు. తమ గ్రామానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించడం పట్ల గ్రామస్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలో చారిత్రిక ప్రదేశాలు, ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు మరెన్నో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణకు నోచుకోక, నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రదేశాలకు స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే గుర్తింపు లభిస్తుండటం రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న ఈ భూదాన్‌ పోచంపల్లి గ్రామం భవిష్యత్తులో  పర్యాటక కేంద్రంగా మరింతగా  రానించగలదనడంలో సందేహం లేదు.