|

పల్లె ప్రగతితో మారిన గ్రామాల ముఖ చిత్రాలు 

By: పి.విజయలక్ష్మి, సంగారెడ్డి

గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని చెప్పడానికి నిదర్శనం, పల్లెప్రగతితో మారిన గ్రామాల ముఖచిత్రాలు. తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపెడుతోంది. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లతో పల్లెల్లో పరిశుభ్రత, హరితహారం అమలుతో గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అభివృద్ధి బాటలో పయనిస్తున్న గ్రామాలు, ప్రకృతి వనాల్లో అరుదైన మొక్కలు, గ్రామాల్లోనే తయారవుతున్న కంపోస్టు ఎరువులు, తీరొక్క మొక్కలతో చూడచక్కని వనాలతో పల్లెలకు కొత్త అందాలను తీసుకువచ్చాయి. చెత్తా చెదారం కంపోస్ట్‌ ఎరువుగా మారి ఊరికి సరికొత్త వనరులను అందిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు పురోగతి దిశలో పయనిస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయితీలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తూ ఏ గ్రామానికి ఆ గ్రామం పోటీతత్వంతో అన్ని హంగులను సమకూర్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. గ్రామాలన్నింటిలో వైకుంఠ ధామం,  డంప్‌యార్డ్‌ నిర్మాణంతో పాటు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకున్నారు. అన్ని సదుపాయాలను అందిపుచ్చుకుని వెన్నంటే ఉండి అభివృద్ధికి చేయూతనిస్తున్నారు మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు. అన్ని గ్రామ పంచాయితీలలో డంప్‌యార్డ్‌లు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, గ్రామంలోనే తయారుచేస్తున్న కంపోస్ట్‌ ఎరువులు, అద్దాల్లా మెరుస్తున్న రోడ్లు, అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణం, కమ్యూనిటీ భవనాలు, వీధి దీపాలు, ఇంటింటికి మిషన్‌ భగీరథ నీటి సరఫరా, నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, రైతులకు కళ్ళాలు, రైతు వేదికలతో అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. స్వచ్ఛగ్రామాలుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి.. పల్లెలు, కనుమరుగైన అరుదైన మొక్కలు ఇప్ప, కదంబ, ఆకాశమల్లే, మారేడు, జిట్రేగి, రాచ ఉసిరి, వెలగ, కృష్ణ తులసి, నందివర్ధనం, గోరింట తదితర మొక్కలు మళ్ళీ జీవం పోసుకుంటున్నాయి. ప్రకృతి వనాలు పల్లెలకుకొత్త అందాలను తీసుకువచ్చాయని గ్రామస్తులు అంటున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉండేలా సర్పంచులు చొరవ తీసుకుంటున్నారు. అందులో మచ్చుకు కొన్ని గ్రామాలు ` జిల్లాలోని కొండాపూర్‌ మండలం హరిదాసుపూర్‌లో ఊరి ప్రజలంతా కలిసి శ్రమదానంతో ప్రతి వీధికి ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్నారు. సంగారెడ్డి మండలం తాళ్ళపల్లిలో లవ్‌ తాళ్ళపల్లి పేరుతో ఏర్పాటు చేసిన స్వాగత తోరణం గ్రామానికి కొత్త అందాన్ని తీసుకువచ్చింది. సోలార్‌ లైట్ల వెలుగులో అతిమ సంస్కారాలు నిర్వహించేందుకు వైకుంఠధామం నిర్మించారు. వివిధ రకాల మొక్కలతో ఒక ఎకరా స్థలంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో కంపోస్ట్‌ ఎరువు తయారవుతుంది. అట్టి ఎరువును ప్రకృతి వనాలకు వినియోగిస్తున్నారు. 

జిల్లాకే ఆదర్శంగా నిలిచింది కవలం పేట గ్రామం. అన్ని వీధుల్లో సిసి రోడ్లు నిర్మించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంతో పారిశుధ్యం మెరుగుపడిరది. ఇంటింటికి ఇంకుడు గుంత, అందుబాటులో డంపింగ్‌ యార్డ్‌, విజయవంతంగా చెత్త సేకరణ జరుగుతున్నది.

పల్లె ప్రగతితో పటాన్‌చెరు మండలం మారుమూల గ్రామమైన చిట్కుల్‌ రూపురేఖలు మారాయి. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం చూపరులను ఆకట్టుకుంటోంది. పార్కులో ఏర్పాటు చేసిన మహాశివుడి నిలువెత్తు విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాశివుడి విగ్రహం చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేశారు. గ్రామంలో ఖాళీ స్థలాలు, స్కూల్‌ ఆవరణలో, రోడ్డు  కిరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ప్రతి వీధిలో వీధిదీపాల ఏర్పాటుతో రాత్రిపూట గ్రామంలో వెలుగులు విరజిమ్ముతాయి.

జిన్నారం మండలం కొడకంచి గ్రామం పచ్చదనంతో కళకళలాడుతోంది. గ్రామంలో నిర్మించిన వైకుంఠధామం, డంప్‌ యార్డ్‌, నర్సరీలు గ్రామానికి మరింత వన్నె తెచ్చాయి. రాయికోడ్‌ మండలం మహ్మదాపూర్‌ గ్రామం పరిశుభ్రత పచ్చదనంలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామ ప్రధాన రహదారి అంతర్గత రోడ్ల వెంట ఎత్తయిన మొక్కలు పెంచుతున్నారు. గ్రామ పార్కు ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది. పండ్లు పూల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. పార్క్‌లో వాకింగ్‌ ట్రాక్‌, పార్కు పక్కనే చిన్నారులకు ప్రత్యేకంగా ఆటవస్తువులను ఏర్పాటు చేశారు.  

షఫీ, హరిదాస్‌పూర్‌ సర్పంచ్‌: 

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మా గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామంలో అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. జిల్లాకు మోడల్‌గా మా గ్రామంలో హరిత వనాన్ని ఏర్పాటు చేశాము. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి గ్రామల అభివృద్ధికి చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేనిది. గ్రామంలోని ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాము. 

రమేష్‌, కవలం పేట గ్రామస్తుడు:

 గ్రామం బాగా అభివృద్ధి చెందుతోంది. గ్రామ శివారులోని చెరువు కట్ట పక్కన హరిత వనాన్ని అందరి సహకారంతో ఏర్పాటు చేసుకున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా రెండు పూటలా తాగునీరు ఇస్తున్నారు. గ్రామంలో సిసి రోడ్లు నిర్మించారు. గతంలో లేని అభివృద్ధి ఇప్పుడే జరిగింది. ప్రజల బాగుకు పనిచేసే ముఖ్యమంత్రి ఉండటం మా అదృష్టం. 

నీలం మధు ముదిరాజ్‌, చిట్కుల్‌ గ్రామ సర్పంచ్‌ :  

అందరి సహకారంతో గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. పల్లెప్రగతితో మా గ్రామం పూర్తిగా మారిపోయింది. పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం దొరికింది. ఇంటింటా తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డ్‌లో జీవ ఎరువు తయారు చేస్తున్నాం. పల్లె ప్రకృతి వనంను మోడల్‌గా నిర్మించాం. వైకుంఠధామంలో అన్ని సౌక ర్యాలు ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆధ్వర్యంలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎవరూ చేయని పనిని మన సిఎం చేసి చూపిస్తున్నారు.

శెట్టి శివరాజ్‌, కొడకంచి సర్పంచ్‌ : 

సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లెప్రగతి కార్య క్రమంలో గ్రామాలన్నీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నాయి. గ్రామంలో శాశ్వత పనులు జరిగాయి. వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డ్‌, నర్స రీలు గ్రామాల్లో ఏర్పాటు అవుతాయని ఎవరు ఊహించలేదు. ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసిఆర్‌కు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న.

కవిత, చిట్కుల్‌ గ్రామ పంచాయితీ కార్యదర్శి : 

గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాము. ప్రతిరోజు ఇంటింటా తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డ్‌కు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాము. పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం అన్ని సౌకర్యాలతో నిర్మించాం. గ్రామంలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షిస్తున్నాం. సిసి రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణంతో గ్రామం రూపు రేఖలు మారాయి. 

లక్ష్మి, కొడకంచి గ్రామస్తురాలు :

పల్లె ప్రగతితో గ్రామంతో ఎంతో అభివృద్ధి జరిగింది. మా ఊరికి వైకుంఠధామం, డంప్‌యార్డ్‌, పార్క్‌ ఇలా ఎన్నో సౌకర్యాలు సమకూరాయి. ఇంటింటికి చెత్త బండ్లు వచ్చి చెత్త సేకరిస్తున్నవి. సిసి రోడ్లు నిర్మించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటయింది. చెట్ల పెంపకంతో పచ్చదనం పెరిగింది. మిషన్‌ భగీరథతో నీటి సమస్య తీరింది. మాకైతే చాలా బాగుంది. 

రమ్య, విద్యార్ధి :

సీఎం కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి బాగా జరుగుతోంది. గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం చేస్తున్న కృషికి హాట్సాప్‌.

యాదిరెడ్డి, రైతు తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక, ఎన్నో సౌలతులు వచ్చినై. నేను పుట్టినప్పటి నుంది చూస్తున్న, అప్పటి వూరుకు ఇప్పటి వూరు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఇది మా ఊరేనా అని నమ్మలేనంతగా మారింది.