గాంధీజీ సార్వత్రికత ఏమిటి?
By: డా. నాగసూరి వేణుగోపాల్
(గాంధీ సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆచరణ వంటి పలు విషయాల గురించి పలువురు ఇదివరకే విభిన్న సందర్భాలలో వ్యక్తీకరించిన విశ్లేషణలను ప్రతినెలా ‘గాంధీయే మార్గం’ శీర్షికన డా. నాగసూరి వేణుగోపాల్ చిరు ఉపోద్ఘాతంతో పాఠకులకు అందిస్తారు. ఈ ‘గాంధీయే మార్గం’ శీర్షిక మీకందరికీ ప్రయోజనకరంగా
ఉంటుందని ఆశిస్తున్నాం.)
ఆయుధాలకన్నా అహింసతో పోరాటానికి అవకాశాలు దాదాపు 11 రెట్లు ఎక్కువ! గత శతాబ్ది కాలంలో జరిగిన సాయుధ పోరాటాలలో 27 శాతం విజయం సాధించగా, అహింసా మార్గంలో జరిగిన పోరాటాలు 51 శాతం విజయాన్నిసాధించాయి! వివిధ దేశాలలో పలు విశ్వవిద్యాలయాలు చేసిన పరిశోధనలలో తేలిన విషయాలు ఇవి.
ఈ సంగతి మనం గమనించినా, గమనించకపోయినా – ప్రపంచ వ్యాప్తంగా గాంధీజీ గౌరవం, విలువా పెరుగుతున్నాయి, ఆయన ఆలోచనలకు ఆదరణ, విశ్లేషణ విశేషంగా పెరుగుతున్నాయి. 2007 జూన్ 15న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గాంధీ జయంతి అక్టోబరు 2వ తేదీని ‘ప్రపంచ అహింసా దినోత్సవం’గా జరుపుకోవాలని నిర్ణయించింది. ఎందుకు? గాంధీజీ చెప్పిన విషయాలు యాభైవేల పేజీలలో నిక్షిప్తమై ఉన్నాయి. వారు చెప్పిన విషయాలపై లక్షలాది పేజీలలో ఎంతోమంది చర్చించారు, తర్కించారు, విభేదించారు, విశ్లేషించారు, గాంధీమార్గంలోని గొప్పతనాన్ని తెలుసుకుని ఉద్బోధించారు.
సత్యాగ్రహ ఉద్యమమైనా, బ్రహ్మచర్య పరీక్షలైనా గాంధీజీ చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు! మరో వంకర మార్గం ఆయన ఎరుగరు. యుగాల తరబడి ఈ సమాజం, ఈ ప్రపంచం హింసా విధానాలలో మగ్గిపోయి, అలసిపోయిందని గుర్తించి ఖండించాడు, ప్రకటించాడు. ఇంతమాత్రం చేస్తే గాంధీజీ గొప్పతనం పూర్తి అయి ఉండేది కాదు. దానికి పరిష్కారం ఎక్కడో సముద్రాల ఆవల అన్వేషించలేదు. మనకు తెలిసిన విషయాల నుంచే శోధించి స్వీకరించాడు. సత్యం, అహింస భావనలు హిమాలయాలంత పాతవి అని గాంధీజీ పదేపదే చెప్పారు. హింసకు పాల్బడకుండా, సత్యాన్నివదలకుండా సాగమని 1906 సెప్టెంబరు 11న తన సత్యాగ్రహ భావనను దక్షిణాఫ్రికాలో ఉద్యమంగా తొలిసారి ప్రపంచానికి వివరించాడు. రావణుని దుష్ట పన్నాగాలను వ్యతిరేకిస్తూ, మౌనంగా తన దారిన తాను సీత సాగింది కానీ రాజీపడలేదు. రాజ్యాధికారంతో, తండ్రి అనే చనువుతో హిరణ్యకశిపుడు ఎంత పీడించినా ప్రహ్లాదుడు బాలుడిగానే సహనంతో, చిరునవ్వుతో విజయం సాధించాడు. అంతేకాదు తను ఘర్షించినపుడు మూర్ఘత్వాన్ని నిబ్బరంగా, అహింసాత్మకంగా వ్యతిరేకించిన కస్తూరిబా విధానాన్ని కూడా గాంధీజీ గుర్తించాడు. అలా ఆయన ఇటు భారతీయ పరంపరలోని ఆలోచనల ఔన్నత్యాన్నీ, అదే సమయంలో థోరో, జాన్ రస్కిన్, టాల్ స్టాయ్ వంటి మహానుభావుల సైద్ధాంతిక భావనల తీరును అవగతం చేసుకుని తన ఆధునిక పోరాట విధానాన్ని రూపొందించుకున్నారు.
ఆ సత్యాగ్రహ పోరాట విధానాన్ని, ప్రస్తుతం ప్రపంచం ఎలా స్వీకరించి విజయం సాధింస్తున్నదో (ఈ వ్యాసం మొదట్లో పేర్కొన్నట్లు) ఫలితాల తీరు చెబుతోంది! గాంధీ గొప్పతనం ఏమిటి ? ఆయన చెప్పినదేమిటి? ఎందుకు ఆయన చెప్పిన విషయాలు – అప్పటికన్నా ఎంతో సార్వత్రికంగా, నేడు మరింత ప్రయోజనకరమైనవిగా, అనుభవంలోకి వస్తున్నాయి? మినిమలిజం, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, ట్రస్టీషిప్, శానిటేషన్, ఫిజికల్ వర్క్ వంటి భావనలను అర్థం చేసుకోవడానికి, అనువర్తింపచేసుకోవడానికి గాంధీజీ ఎందుకు ఊతంగా మారాడు? ఏమిటీ గాంధీ మార్గం?
పని చేయకుండా లభించే ధనం
ఈజీ మనీ అని చెప్పుకుంటే ఈ భావన అర్థమవుతుంది. ఈ రీతి మార్గాలు ఏమిటో నేడు ఎవరికీ చెప్పనక్కరలేదు. అందరికీ తెలుసు. కష్టించకుండా ఆదాయం పొందడాన్ని గాంధీ గర్హిస్తాడు. అంతకుమించి ప్రతి వ్యక్తి శారీరక కష్టం కూడా ప్రతి రోజూ చేయాలని పదేపదే ఆచరించి చూపాడు. ఇది బోధపడటం చాలా సుళువు. ఎవరికి వారు పాటిస్తే ఇందులోని పరమార్థం, ఆరోగ్యం, ఆనందం బోధపడతాయి.
అంతరాత్మ అంగీకరించని విలాసం:
ఆనంద పడటం వద్దనలేదు. ఆ ఆనందపడే రీతిని మీ అంతరాత్మ ఆమోదించాలని మాత్రమే గాంధీజీ అంటారు. నిజానికి మనం అలా ఆలోచించడం మాని వేసి చాలా కాలమైందని అంటారు కదా? అదే సమస్య! మన విలాస విధానాలను అంతరాత్మ ఎందుకు అంగీకరించాలి అని కూడా ఎదురు ప్రశ్నలు రావచ్చు. అసలు విలాసం శరీరాలకు కదా, మనసుతో పని ఏమిటి అని కూడా ఎంతోమంది భావించే అవకాశం ఉంది. ఈ గాడి తప్పిన విధానాన్ని గురించి శతాబ్దం క్రిందట చెప్పిన విషయాలు యిప్పటికి మరింత వర్తిస్తున్నాయి.
వ్యక్తిత్వాన్ని ఇవ్వని జ్ఞానం:
ఇందులో రెండు మాటలు మనకు బాగా తెలుసు. నాలెడ్జి సొసైటి, పెర్సనాలిటి డెవలప్‌మెంట్ అనేవి నేడు పడికట్టు పదబంధాలే కాదు. ఎన్నో రకాల ఉపాధులకు, మోసాలకు ఆలవాలమయ్యాయి. అయితే వ్యక్తిత్వం అనేది జ్ఞానం ద్వారా రావాలని, వస్తుందని చాలా మందికి తెలియదు. గాంధీజీ వంటివారు చెప్పినా బోధపడదు. నిజానికి ఈ విషయం చెప్పినవారిలో గాంధీజీ మొదటివారు కాదు. ఏ మత ధర్మగ్రంథాలు, ఏ ధర్మ సూత్రాలు గమనించినా ఈ విషయం తేటతెల్లమవుతోంది. ఇది ఎంత అవసరమో, అదే అంత కొరవడడం ఇప్పటి విషాదం!
నైతికత లోపించిన వ్యాపారం:
వ్యాపారం అంటే జీవ వ్యాపారమనే అర్థం కాదు. గాంధీజీ చాలా స్పష్టంగా ‘కామర్స్ వితౌట్ మొరాలిటి’ అని చెప్పారు. వర్తకం, వాణిజ్యం, వ్యాపారం- వీటిలో నీతి ఉండాలని గట్టిగా కోరారు. కేవలం వాణిజ్యం, రాజకీయం గురించి మాత్రమే నేరుగా ప్రస్తావించాడు గాంధీజీ ఈ ఏడు అవాంఛనీయ పోకడలలో. నీతి అనేది ఎదుటివారిని నమ్మించడానికి కాదు, నీవు పాటించడానికి! దానికి సాక్ష్యాలు, చట్టాలు అక్కరలేదు. ఎవరికి వారు పాటించాలి. ప్రస్తుతం కల్తీ, మోసం, వంచన, బూటకం వంటివి వాణిజ్యంలో ప్రవేశించి అనారోగ్యాన్నీ, అవినీతినీ అందరికీ అంటిస్తున్నాయి.
మానవత్వానికి ప్రాముఖ్యత ఇవ్వని శాస్త్ర విజ్ఞానం:
సైన్స్, టెక్నాలజీ పరంగా మనం ఎంతో ఎదిగాం. మన ప్రతిభ వ్యవసాయం, వైద్యం, అంతరిక్షం, అణుశక్తి, కృత్తిమ మేథ, ఆయుధాల ఉత్పత్తి- ఇలా చాలా రకాలుగా సాగుతోంది. భయపెట్టడానికీ, బెదిరించడానికి, లొంగదీసుకోవడానికి- వగైరా పనులకు కాకుండా సగటు మనిషి మొహాన చిరునవ్వులు పూయించడానికి టెక్నాలజి దోహదపడాలి. ఈ విషయాన్ని రాజకీయ నాయకులూ, శాస్త్రవేత్తలు పాటించడం లేదు. ఉపాధ్యాయులు, రచయితలు వివరించడం లేదు.
త్యాగభావన లోపించిన మతం:
నిజానికి ఈ విషయానికి వివరణ అక్కరలేదు. అభిమతం, మతం అనేవి రెండూ ఒకే విషయాన్ని చెప్పాలి. అలా పరిగణించినపుడు ద్వేషం, విభేదం అసలు దరికి రావు. గాంధీజీ చెప్పిన ఈ విషయాన్ని ఏ మతం తప్పు పట్టదు. అయితే మన దేశంలో ఉండే అన్ని మతాల వ్యక్తులు ఈ విషయాలు పాటిస్తే పొరపొచ్చాలే వుండవు. ధర్మ శాస్త్రాలు చెప్పే అసలు విషయాలను గాలికి వదలి కేవలం పైన ఉండే పొట్టులాంటి ఆచారాలను పట్టుకుని వ్రేలాడటం వల్లనే అనర్థాలు. కనుక ఎవరికి వారు మతధర్మాలు పాటిస్తూనే త్యాగ చింతన, త్యాగంతో కూడిన ప్రవర్తనలను అందిపుచ్చుకుంటే అంతా సవ్యమే, సంతోషమే!
విలువలకు పొసగని రాజకీయం
ఇదీ అసలు సంగతి. పాలిటిక్స్ విత్ అవుట్ ప్రిన్సిపుల్ అని స్పష్టంగా చెప్పారు గాంధీజీ. పరమపద సోపానంలో లాగా ఒక్క అనర్థాన్ని పేర్కొంటూ అత్యంత కీలకమైన విషయాన్ని చివరన చెప్పారు. ఇక్కడ పాలన అనేదాన్ని రాజకీయం అనే మాట ద్వారా వివరించాడు గాంధీజీ. విలువలతో కూడిన రాజకీయాలే సర్వ అనర్థాలను పరిష్కరించగలవు. అలాగే రాజకీయాలు కలుషితమైతే మొత్తం సమాజాన్నే, ప్రపంచాన్నే భ్రష్టు పట్టించగలవు.
ఈ ఏడు నియమాలతో సకల ప్రపంచానికి సర్వకాలాలకు ఉత్తమంగా పనిచేసే విధానాన్ని సూచించాడు గాంధీజీ! ఇవి ఎంతో సరళంగా ఉంటాయి, అర్థం చేసుకోవడంలో ఎంతమాత్రం శ్రమ ఉండదు. కేవలం పాటిస్తే చాలు. ఈ ఏడు నియమాలను తొలుత 1925 అక్టోబరు 22న ‘యంగ్ ఇండియా’ పత్రికలో రాశారు గాంధీజీ. ‘కంప్లీట్ వర్క్స్ ఆఫ్ మహాత్మాగాంధీ’ వంద సంపుటాలలో 33వ దాన్లో 133-134 పుటలలో చూడవచ్చు. ఈ ఏడు సూత్రాలనే ఒక కాగితంపై రాసి మనవడు అరుణ్ గాంధీకి 1948 జనవరి 30వ తేదీన కూడా ఇచ్చారు. అంటే ఈ ఏడు నియమాలను గాంధీజీ ప్రబోధించి రెండు దశాబ్దాలకు పైగా పరీక్షించి ఆమోదించారు. అవాంఛనీయమైన, ప్రమాదకరమైన ఈ ఏడింటిని ‘సెవెన్ సిన్స్’ (Seven sins) అని కూడా అంటారు. వీటి గురించి వివరంగా చర్చించిన వారు కూడా ఉన్నారు. ఏక్ నాథ్ ఈశ్వరన్ (1989), స్టీఫెన్ కోవీ (1989) ఫ్రాంక్ ఊలెవర్ (2011), పీటర్ జెగోమ్స్ (2007), ఆడమ్ టైలర్ (2010), థామస్ వెబర్ (2011), రాణా పి.బి.సింగ్ (2006) వంటివారు తమ గ్రంథాలలో ఎంతో లోతుగా విశ్లేషించారు.
గాంధీ ఆలోచనలలోని అసలు స్ఫూర్తిని అందుకుని మన ప్రవర్తనను – తద్వారా యావత్ప్రపంచపు నడతను మెరుగు పరడమే గాంధీ మార్గం. గాంధీజీ ఒక్క రాజకీయాలే కాక సర్వరంగాలు ప్రక్షాళన అయి, వ్యక్తులు మరింత మహోన్న తంగా మారాలని ఆకాంక్షించారు. ఆర్థిక శాస్త్రం. పర్యావరణం, మానవ హక్కులు, సహిష్ణుత, స్వచ్ఛత పరంగా గాంధీజీని ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనం చేయడం పెరిగింది. అయితే భారత దేశంలో జరిగిన కథ వేరుగా ఉంది. మతాల మధ్య ఘర్షణ నివార ణకు, నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు గాంధీ. మెజా రిటీ మతస్తులు సహిష్ణుతలో ఉండాలని పదేపదే చెప్పారు. అయితే చివరకు మతపరమైన ధోరణి మాత్రమే గాంధీజీని హత్య చేసింది.
గాంధీ ఆలోచనలను, ఆచరణనూ అసలు ఖాతరు చేయకుండా క్రమంగా గౌరవం మన దేశంలో మూఢభక్తిగా పరిణమించింది. గాంధీని ఇష్టపడేవారు, గౌరవించేవారు ఎందుకు గాంధీని ఇష్టపడాలో, ఎందుకు గౌరవించాలో చెప్పడం మానేశారు. ఇది ఘోరమైన తప్పిదం. గాంధీని సవ్యంగా అర్థం చేసుకోకపోతే విపరీతార్థాలకు దారి తీస్తుందని సూపర్ ఫిషియాలాంటి బ్రీడ్స్ స్టుపిడిటీ అని సుధీంద్ర కులకర్ణి తన పుస్తకం ‘మ్యూజిక్ ఆఫ్ ది స్పిన్నింగ్ వీల్’లో వ్యాఖ్యానించడం గమనార్హం.
గాంధీని అధ్యయనం చేసిన వారున్నారు. ఆ రీతి ఆలోచనలను వివరించిన వారూ ఉన్నారు. ఇది వరకు చేసిన విశ్లేషణలు పరిశీలిద్దాం. పర్యావరణ కాలుష్యం వంటి కొత్త సమస్యలకు గాంధీ చెప్పిన తత్వం ఏమిటో కొత్తగా తరచి చూద్దాం. గాంధీ మార్గం ఏమిటో కాస్త లోతుగా అవలోకిద్దాం. గాంధీజీ ఆలోచనల సార్వత్రికతను మరింత తెలుసుకుందాం. మనలను మనం మెరుగు పరచుకుందాం!