|

అభినందనం

త్యాగాల పునాదులపై అవతరించిన తెలంగాణ రాష్ట్రం అయిదేళ్ళు పూర్తి చేసుకుని ఆరోయేట ప్రవేశిస్తున్న శుభతరుణంలో విలీనం నుంచి విభజనదాకా లక్ష్యం దిశగా సాగిపోయిన ప్రజావళికి అభివందనాలు. సుదీర్ఘ ప్రస్థానంలో గమ్యాన్ని ముద్దాడిన ఘట్టానికి అప్పుడే అరోయేడు వచ్చేసిందా అన్న ఆనందం ముప్పిరి గొంటున్నది. కాలం అనంతం. ఎవరి కోసమూ ఆగదు. అయితే నిన్నటి అనుభవాలను నేడు సమీక్షించి, లక్ష్యాలను నిర్దేశించుకుని, కార్యాచరణకు ఉపక్రమించడం చక్కని విజయాలకు బాటలు వేస్తుంది. మలిదశ ఉద్యమం వెనక ఉన్న విజయగాధ అదే అనడం నూరు పైసల నిఖార్సైన నిజం. నిజాలను విజ్ఞులు అంగీకరించి ఆమోదిస్తారని మా విశ్వాసం.

ఈ పత్రిక ప్రారంభంలో మా గమనాన్ని నిర్దేశించినప్పుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పిన మాటలు అన్ని వేళలా మాకు స్ఫూర్తిని ఇస్తూ నడిపిస్తుంటాయి. అప్పటి వరకూ ప్రభుత్వాలు ప్రచురించిన పత్రికల పట్ల ప్రజల స్పందన ప్రస్తావించవలసిన అవసరం లేదు. దశాబ్దాలకు పైగా వివక్ష, నిర్లిప్త ధోరణులు, అణచివేతల సాక్షిగా చరిత్రకెక్కని మహనీయుల జీవనరేఖలు, వక్రీకరణకు గురైన మన చారిత్రకాంశాలు, వెలుగులోకి రాని మన దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు ఒకటేమిటి అనేక అంశాలు మా ప్రాథమ్యాలుగా వెన్నుతట్టి ముందుకు నడిపిస్తుంటాయి. కీర్తి, సంపదలను గడ్డిపోచగా వదలి యేళ్ళతరబడి తమ రంగాన్ని సుసంపన్నం చేసి కారణ జన్ములుగా నిలిచిన పెద్దల జీవన రేఖలు మాకు దిశానిర్దేశం చేస్తుంటాయి. మాకు అన్ని విధాలా అండదండలు అందించి ప్రోత్సహిస్తున్న సాహితీ మిత్రుల సేవలు వెలకట్టలేనివి.

మన ముఖ్యమంత్రి 1985లో తొలిసారి శాసన సభ్యుడుగా ఎన్నికైన అనంతరం వందలాది మందితో సామూహిక శ్రమదానం చేసి కుగ్రామానికి రహదారి నిర్మించి ఆర్టీసి బస్సు తీసుకెళ్ళిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ”మానవీయ కోణంలో…” అనే వ్యాసాన్ని మా ప్రారంభ సంచికలోనే వేశామని వినయంగా గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలో నెలనెలా ప్రభుత్వ పథకాల విజయగాథలు, ప్రాతస్మరణీయులైన జాతి రతనాల జీవన రేఖలు, మారుమూల కుగ్రామాల్లో పుట్టి స్వయం కృషితో సమున్నత శిఖరాలు అధిరోహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన యువత విజయాలు… ఈ విధంగా మా ప్రస్థానాన్ని శక్తి వంచన లేకుండా కొనసాగిస్తామని సవినయంగా మనవి చేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ ప్రత్యేక సంచికను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

చివరగా ఒక్కమాట ఆనాడే చెప్పినట్టు ‘యేం తక్వ నా తెలంగాణకు’.