మహిళా పథకాలు ప్రశంసనీయం


మహిళాభివృద్ధి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. డాక్టర్ హీనాకుమార్ గవిత్ నేతృత్వంలోని జర్నాదాస్ బైద్య, లాకేట్ చటర్జీ, మమతా మోహన, రమ్య హరిదాస్, మాలోతు కవిత, వంగా గీత, వందనా చౌహాన్, శతాబ్దిరాయ్, గోమతీ సాయి, శర్మిష్ఠ సేతి, రితి పాటక్, సరోజ్‌పాండే సభ్యులుగా గల కమిటీ రాష్ట్రంలో పర్యటించింది.

అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డితో సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలను సునీతారెడ్డి వారికి వివరించారు. కళ్యాణలక్ష్మి, బాలామృతం, కేసీఆర్ కిట్స్ తదితర పథకాల అమలు తీరును కమిటీ మెచ్చుకున్నది. ముఖ్యంగా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన విహబ్ కార్యకలాపాలను చూసి సంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్, జమ్ము కాశ్మీర్లతో కలిసి విహబ్ పనిచేయడం ప్రశంసనీయమని కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు.
ఇవే కాకుండా వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్, రూపొందించిన చట్టాలు, న్యూట్రీ గార్డెన్లు ఎంతో సహాయ, సహాకారాలుగా ఉన్నాయని అన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, మహిళా కమిషన్ చేస్తున్న ప్రయత్నాలను వారు అభినందించారు. ఈ సమావేశంలో మహిళా కమిషన్ సభ్యురాళ్ళు షహిన్ అఫ్రోజ్, ఈశ్వరీబాయి, ఉమాదేవి, గద్దల పద్మ, సుధమ్ లక్ష్మీ, రేవతీరావులు పాల్గొన్నారు.