యాదగిరీశుని బ్రహ్మోత్సవం

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం

yadagiriguttaదశావతారాలలో అతి కొద్ది కాలం మాత్రమే కనిపించే అవతారం నృసింహావతారం. కాని మన తెలుగు రాష్ట్రాలలో అన్ని వైష్ణవ దేవాలయాల కంటే లక్ష్మీనారసింహస్వామి వారి దేవాలయాలే అధికం. అందులోను స్వామి వారు ఐదు రూపాలలో వెలిసిన పుణ్యక్షేత్రం మన యాదగిరి లక్ష్మీనారసింహస్వామి వారి దేవాలయం.

యాదవ మహర్షి తపస్సు ఫలితంగా పంచనారసింహులుగా వెలసిన క్షేత్రం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం. శక్తిని, భక్తిని, ముక్తిని ప్రసాదించే యాదగిరి క్షేత్రం మహిమాన్వితం. కొలిచిన వారికి కొంగు బంగారంగా సకల సౌభాగ్యాలను, కోరిన కోర్కేలు తీర్చే పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధానికి కేవలం 50కి.మీ. దూరంలోనే ఉన్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనారసింహ స్వామి దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

స్ధల పురాణం: పూర్వం హిరణ్యకశివుడి వధ అనంతరం శ్రీనృసింహస్వామి వారు ఈ ప్రాంతంలోని కొండ గుహలో వేంచేసి యుండెనని బ్రహ్మాదిదేవతలు, ఋషులు ఇక్కడకి వచ్చి పూజించినట్టు పురాణోక్తి. అనంతరం ఋష్యశృంగుని పుత్రుడైన శ్రీయాదరుషి ఇక్కడ తపమాచరించినట్టు యాదరుషికి ప్రత్యక్షమైన క్షేత్రంగా యాదగిరిగుట్టగా నాయకరణం జరిగినట్టు పురాణాలు తెలియచేస్తున్నాయి.

గుట్టపై ఉన్న రాతి కొండలో యాదరుషి తపమాచరించగా రాతిని చీల్చుకుని స్వామి వారు ఇక్కడ ఉద్భవించినట్టు పురాణోక్తి. మొదట యాదరుషి స్వామి వారిని జ్వాలా నరసింహస్వామిగా దర్శించుకోవాలని కోరినందున జ్వాలా నరసింమస్వామిగా గర్భాలయంలో వేంచేసి ఉన్నారు. జ్వాలా నరసింహ స్వామి రెండు శిలాఫలకాల మద్య దీర్ఘమైన శ్రీచూర్ణరేఖ ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఏడుకొండల వాడు శ్రీనివాసుడైతే ఏక శిఖర వాసుడు యాదగిరీశుడు. ఆపద మ్రొక్కుల వాడు తిరుమలవాసుడైతే ఆపద్బాంధవుడు శ్రీలక్ష్మీనారసింహుడు.
పంచనారసింహ క్షేత్రంగా వెలసిన ఈ క్షేత్రంలో స్వామి వారు ఐదు రూపాలలో దర్శనమిస్తారు. ఇక్కడ జ్వాలా నరసింహస్వామిగా, శ్రీయోగానంద నరసింహ స్వామిగా, శ్రీగండభేరుండ నృసింహస్వామిగా, శ్రీఉగ్రనారసింహ స్వామిగా, శ్రీ లక్ష్మీనారసింహ స్వామిగా అచ్చారూపంలో ఆవిర్భవించారు. కాగా జ్వాలానృసింహస్వామి, యోగానంద నృసింహస్వామి, లక్ష్మీనృసింహస్వామి వారు గర్భాలయంలో వేంచేసి ఉండగా, గండభేరుండ నృసింహస్వామి వారు గర్భాలయం వేనుక భాగం తూర్పు ముఖంగా వేంచేసి ఉన్నారు. ఇక ఉగ్రనారసింహస్వామి వారు రూపం లేకుండా ఆలయం చుట్టు ఆవరించి భక్తులను కాపాడుతూ ఉంటాడని భక్తుల నమ్మకం.

ఆలయ విశిష్టతలు

ధ్వజ స్తంభం: ఆలయ ధ్వజ స్తంభంపై సుదర్శన చక్రం ఉండటం ఇక్కడి ప్రత్యేకమైన విశిష్టత. ఈ సుదర్శన చక్రం చుట్టునే స్వామివారు ఉగ్ర రూపంలో తిరుగుతూ భక్తులను కాపాడుతూ ఉంటారని భక్తుల నమ్మకం.

yadagirigutta-2

విష్ణు పుష్కరిణి: దేవతలు, ఋషులు కలిసి మహావిష్ణువు కాళ్ళు కడిగితే ఏర్పడిరదే ఇక్క డి విష్ణు పుష్కరిణి. హిరణ్యకశువుడి వధ అనంతరం దేవతలు, ఋషులు వైకుంఠ నాధుని ఎల్లవేళలా దర్శనం చేసుకోవడానికి అనుమతినివ్వాల్సిందిగా కోరారట. అయితే రాక్షస వధ అనంతరం ప్రసన్నంగా దర్శనం ఇవ్వడం సాధ్యపడదని, అయతే దక్షిణ దేశాన గల ఈ యాదగిరికొండపై గుహలో లక్ష్మీ సమేతంగా వెలిసి దర్శనమివ్వగలనని చెప్పారట. అప్పుటి నుండి యాదగిరి కొండపై స్వామి వారు లక్ష్మీ సమేతంగా ఉన్నట్లు చెబుతారు. ఆ సమయంలో సంతుష్టులైన దేవతలు , ఋషులు స్వామి వారి పాదాలు కడుగగా ఏర్పడినదే ఈ విష్ణు పుష్కరిణి.

ఆండాళ్‌ అమ్మవారి సన్నిధి: గర్భాలయానికి దక్షిణ దిశలో ఉంటుంది. తిరుప్పావై వ్రతంతో స్వామివారిని ప్రసన్నం చేసుకున్న గోదాదేవి ప్రసన్న వదనంతో దర్శనమిస్తుంది. ఈ దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఆళ్వారుల సన్నిధి: ఆండాళ్‌ అమ్మ ఆలయం ప్రక్కనే ఆళ్వారుల సన్నిధి ఉంటుంది. ఈ దేవాలయంలో నమ్మాళ్వార్‌, తిరుమంగై ఆళ్వారుల జన్మ నక్షత్రం రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు.

గోశాల: ఇక్కడ ఈ మధ్య కాలంలో గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ గోశాల నుండే ప్రతీ నిత్యం ఆవు పాలు తీసుకెళ్ళి స్వామి వారి సుప్రభాత సేవకు ఉపయోగిస్తారు. అంతే కాకుండా ఇక్కడ ఆర్జిత సేవలో గోపూజ కూడా చేర్చబడిరది.

అద్దాల మండపం: ఈ మధ్య కాలంలోనే నిర్మించిన అద్దాల మండపం గుట్టకు ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మండపంలో నవనారసింహ క్షేత్రాలలోని నవనారసింహ రూపాలను అందంగా అలంకరించారు. బంగారు రంగు ఊయలపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించారు.

శివాలయం: శివకేశవులకు నిలయమైన ఈ క్షేత్రంలో మనం నృసింహస్వామితో పాటు పరమశివుని కూడా దర్శించుకోవచ్చు. గర్భాలయానికి తూర్పు వైపున ఈ ఆలయం నిర్మించబడినది. ఇక్కడ ఆదిదేవుడు పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామిగా విరాజిల్లుతున్నాడు.

వ్రత మండపం: సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఇక్కడ పెట్టింది పేరు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం తర్వాత ఇక్కడ మాత్రమే అధికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. ఒక్క కార్తీక మాసంలోనే ఇక్కడ 60వేల మంది వ్రతం ఆచరిస్తారు అంటే అతిశయోక్తి కాదు.

క్షేత్ర మహత్యం: ఇక్కడి స్వామి వారిని దర్శించుకుని ప్రహ్లాద వరదా గోవిందా అని నామస్మరణ చేసినంతమాత్రాన అన్ని ఆపదలు తొలగిపోతాయని నృసింహ పురాణం తెలుపుతోంది.

మండలం రోజుల పాటు ఇక్కడ పుష్కరిణిలో స్నానమాచరించి తెల్లవారు రaామున స్వామివారి ప్రదక్షిణ చేస్తే ఈతిబాధలు తొలిగి మానసిన ప్రశాంతత నెలకొంటుంది. 40 రోజుల పాటు గుట్టపైనే నివాసముండి స్వామి వారిని సేవించి ఆరోగ్యము బాగుపడిన వారు ఉన్నారు.

విశ్వశాంతి కోసం పుణ్యక్షేత్రాలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రతీసంవత్సరం పాల్గుణ మాసం విదియ మొదలు 11 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు స్వస్తి వాచనం తో మొదలయి ద్వజారోహణం, ప్రతీ రోజు వాహన సేవలు , అలంకార సేవలు నిర్వహిస్తారు. ప్రతీ రోజు ఉదయం అలంకార సేవలు రాత్రి వాహన సేవలో రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనారసింహ స్వామి దర్శనమిస్తారు. అలంకార సేవలలో స్వామి వారు మురళీ కృష్ణునిగా, గోవర్ధనగిరిధారిగా, వటపత్రసాయిగా, జగన్మోహినిగా,రామునిగా, మహావిష్ణువుగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ ఎదుర్కోలు సమయంలో అశ్వవాహన సేవలో, కళ్యాణానికి వేంచేసే టప్పుడు గజవాహన సేవలో భక్తులకు దర్శనమిస్తారు.

బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన ఘట్టాలు తిరుకల్యాణోత్సవం, స్వామి వారి దివ్యవిమాన రధోత్సవం, ఈ రెండు రోజులు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. పూర్ణాహుతి, చక్రతీర్ధం, శతఘటాభిషేకం, డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ పదకొండు రోజులపాటు గుట్టపై పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. గుట్టపై ఉన్న సంగీత భవన్‌లో ధార్మిక సాహిత్య మహాసభలు నిర్వహిస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి కళాకారులు వచ్చి ఇక్కడ ప్రదర్శనలిస్తారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో ఈ సంవత్సరం ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే ఉత్సవాలకు వచ్చే భక్తులకోసం అన్ని ఏర్పాట్లను చేశారు. బోజనం, మంచినీటి సౌకర్యం, ప్రసాదాల ఏర్పాట్లను ఘనంగా చేశారు.

బ్రహ్మదేవుడు జరిపించే ఉత్సవం

మొదటి రోజు స్వస్తివాచనం,రక్షాబంధనం,…ఫిబ్రవరి 20న రోజు స్వస్తివాచనంతో యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఆలయ ప్రాంగణ మంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ముందుగా ఆ విశ్వక్సేనారాధనను నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయమని ఈ విశ్వక్సేనారాధన నిర్వహిస్తారు. అనంతరం 5పోగులతో తయా రుచేసిన దారానికి పసుపు,కుంకుమలు అద్ది ప్రత్యేక పూజల నడుమ మూలవర్యులకు, ఉత్సవమూర్తులకు అలంకరిస్తారు. ఈ రక్షాబంధనంతో స్వామివారి శక్తి ద్విగుణీకృత మౌతుంది. అందుకే బ్రహ్మోత్సవకాలంలో స్వామి వారిని దర్శించుకోవడానికి ఎక్కువగా భక్తులు ఇష్టపడతారు. తర్వాత ఆలయ ప్రాంగణమంతా సంప్రోక్షణ చేశారు.

మత్సంగ్రహణం, అంకురార్పణ: ఆలయ అర్చకులు వేదపండితులు మంగళవాయి ద్యాలతో పుట్ట మన్నుని తీసుకుని వచ్చారు. ఆ పుట్టమన్నును 11 మట్టిమూతలలో (పాలికలలో) నింపి వాటిల్లో నవధాన్యాలను చల్లారు. వీటిపై ప్రతీ రోజు నీళ్లు చల్లుతారు. ఈ 11 రోజుల పాటు ఈ పాలికలకు పూజలు చేస్తారు.

రెండవ రోజు ద్వజారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం, హవనం:

దేవాలయంలో స్వామివార్ల కంటే ముందు ధ్వజస్తంభాన్ని పూజించడం మనకు ఆనవాయితీ. అంతటి విశిష్టత గల ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి గురుత్మంతుని చిత్రపటం ఉన్న జెండాను ద్వజస్తంభం పైభాగంలో కట్టి దేవతాహ్వానం చేశారు. స్వర్గలోకంలో ఉన్న మక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలికారు. 34 రాగాలను 34 తాళాలను అన్వయిస్తూ సకలదేవతలకు ఆహ్వానం పలికారు. ప్రధాన కలశంలోకి దేవతలను ఆహ్వానం పలికారు.

మూడవరోజు మత్య్సావతారం, శేషవాహనసేవ: మూడవ రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దశావతారాలలో మొదటి అవతారంగా చెబుతారు.

సోమకాసురుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను అపహరించి ఎవ్వరికీ దొరకకుండా మహాసముద్ర గర్భంలో దాక్కున్నాడట. అప్పుడు శ్రీ మహావిష్టువును వేదాలు రక్షించాల్సిందిగా దేవతలు కోరారట. అంతట శ్రీ మహావిష్ణువు మత్స్య రూపం దాల్చి సముద్రం లోకి వెళ్లి రాక్షసునితో యుద్ధం చేసి సంహరించి వేదాలను రక్షించాడు.

నాల్గవరోజు శ్రీ కృష్ణాలంకారం,హంసవాహన సేవ: అన్ని అవతారాలలో కెల్ల అద్భుత అవతారం కృష్ణావతారం. చేతిలో మురళిని ధరించి, నెమలిపింఛధారిjైు చిలిపిచేష్టల చిన్ని కృష్ణుడు భక్తులను ఆకట్టుకున్నాడు. బాల్యంలోనే రాక్షసులను సంహరించి శిష్టరక్షణ, యవ్వనంలో రాజకీయత, వృద్యాప్యంలో గీతా బోధన లీలాపరంగా కాని, వేదాంతపంరంగా కాని మానవాళి మహోన్నత అభ్యుదయానికి తోడ్పడుతున్నాయన టానికి ఈ అలంకార ప్రత్యేకత.

ఐదవరోజు వటపత్రశాయి అలంకారం, పొన్నవాహన సేవ: వటపత్రసాయిగా చిన్ని క్రిష్ణుడు మర్రిఆకుపై పడుకుని పాడి ఆవుల పాటు తాగుతూ లోకంలోని చెడుపై మంచి చాటి చెప్పడం ఈ అంకారం విశిష్టత.

ఆరవరోజు గోవర్ధనగిరిధారి అలంకారం, సింహవాహన సేవ:
వరుణ దేవుని కోపానికి గురి అయిన ఊరంతా నిలువ చోటు లేక కలవరం చెందుతుంటే చిన్ని కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలులను రక్షించిన సన్నివేశాన్ని గుర్తుచేస్తు ఈ అలంకారాన్ని నిర్వహిస్తారు.

ఏడవరోజు జగన్మోహిని అలంకారం, అశ్వవాహన సేవ, ఎదుర్కోలు: ఆదిశేషుని తాడుగా చేసుకుని పాలసముద్రాన్ని మధించగా వచ్చిన అమృతాన్ని రాక్షసులు తస్కరించాలని చూడగా శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారంలో వచ్చి దేవతలను రక్షించాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జగన్మోహిని అలంకారం జరిగింది. అనంతరం సాయంకాల వేళ స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ఎదురెదుగా వాహన సేవలో ఉంచి వారి వారి విశిష్టతలను తెలియచేస్తు వేదపండితులు ఎదుర్కోలు నిర్వహించారు. అమ్మవారి తరఫువారు స్వామివారికి, స్వామి వారి తరఫువారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఎనిమిదవరోజు హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారం, గజవాహనసేవ, తిరుకళ్యానం: ఈ రోజున హనుమంతవాహనంపై స్వామి వారిని రామావతారంలో పెళ్ళికొడుకుగా అలంకరించారు. దశావతారాలలో మానవ అవతారమైన రామావతారం ఆడినమాట తప్పని రాముని స్వభావం, పితృ ఆజ్ఞ పరిపాలన, దీక్షాదక్షత, సుభిక్షమైన పరిపాలన ను మనకు తెలియచేస్తుంది.

తొమ్మిదవరోజు గరుడవాహనంపై శ్రీమహావిష్ణువు, దివ్యవిమాన రధోత్సవం: స్వామి వారికి అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనం పైన శ్రీమహా విష్ణువు అవతారంలో నిజరూపునిగా మనకు దర్శనమిచ్చారు. రాత్రి వైభవంగా జరిగే యాదగిరీశుని దివ్యవిమాన రధోత్సవం చూడటానికి రెండు కళ్ళు చాలవన్నట్లుగా ఉంటుంది. రాజ్యలక్ష్మీ సమేతుడైన స్వామివారు పరిమళభరిత పుష్పాలతో, రంగు రంగుల విద్యుద్దీపకాంతులతో అలంకరించిన ప్రకాశిస్తున్న రధాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో విహరించాడు. రధంపై ఊరేగుతున్న స్వామి వారిని చూడటానికి భక్తులు పోటీపడ్డారు. రధోత్సవంలో స్వామి, అమ్మవార్లను చూసిన వారికి సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే యాదగిరిగుట్టకు తరలివచ్చాడా అన్నట్టు అనిపిస్తుంది.

పదవరోజు మహాపూర్ణాహుతి, చక్రతీర్దం: ఈ పదిరోజుల పాటు జరిగిన హోమాది పూజలను ముగిస్తూ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి దివ్యాయుధమైన సుదర్శన చక్రానికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం గుట్ట పై ఉన్న విష్ణుపుష్కరిణిలో చక్రతీర్ధ కార్యక్రమం నిర్వహించారు.

పదకొండవరోజు శతఘటాభిషేకం: బ్రహ్మోత్సవాల ముగింపు సందర్బంగా ఆలయంలోని మూలవరులకు శతఘటాభిషేకం నిర్వహిస్తారు. నూట ఎనిమిది కలశాలలో నీటితో స్వామికి పూజలు నిర్వహించి వాటిని ప్రధాన కలశంలోనికి తీసుకుని గర్భాలయంలోని మూలమూర్తులకు అభిషేకం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

యాదగిరిగుట్ట అభివృద్దికి మాష్టర్‌ ప్లాన్‌

దక్షిణ భారత దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదగిరి గుట్టను తీర్చి దిద్దడానికి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్దికి 100 కోట్లు కేటాయించగా వచ్చే బడ్జెట్లో కూడా మరొక 100 కోట్లు ఆలయ ఆభివృద్దికి కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పడికే రెండవ ఘాట్‌ రోడ్డు పనులు కొనసాగుతుండగా వసతి గదుల నిర్మాణం, అతిపెద్ద ఆంజనేయస్వామి విగ్రహం, మరికొన్ని అభివృద్ది పనులు శాశ్వత ప్రాతిపదికన చేయనున్నారు. తిరుమల తరహాలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ధామంగా యాదగిరిగుట్టను అభివృద్ది చేయడానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు.ఈ సంవత్సరం నుండి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించే సాంప్రదాయానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. యాదగిరిగుట్టను మొత్తంగా నాలుగు దశల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో దేవాలయ అభివృద్ధి, రెండవ దశలో వసతి సౌకర్యాల అబివృద్ది, మూడవదశలో గుట్ట పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం, నాల్గవ దశలో అభయారణ్యాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను నెలకొల్పడం చేయాలని నిర్ణయించారు. ప్రధాన ఆలయం అభివృద్ధిని ఆగమశాస్త్రం ప్రకారం , ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా విస్తరించాలని నిర్ణయించారు.

ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి దంపతులు

kcr-wife

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన యాదగిరీశుని బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సతీసమేతంగా హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి దంపతులు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా నెత్తిన తలపాగా చుట్టుకొని తాంబాళంలో ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి స్వయంగా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయానికి కె.సి.ఆర్‌ ఈ ఏడాది నుంచి శ్రీకారం చుట్టారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగిన యాదగిరి లక్ష్మీనర్సింహాస్వామి కల్యాణోత్సవానికి రాష్ట్ర గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ దంపతులు హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులందరితో కలిసి గవర్నర్‌ దంపతులు కల్యాణోత్సవాన్ని తిలకించారు.