|

మహనీయ మనీషి, శ్లేష యమక చక్రవర్తి యామవరం రామశాస్త్రి

rama-shatri1897 సంవత్సరంలో మెదకు సమీపంలోని కుకునూరు గ్రామం ఆయన జననంచే పుకితమైంది. వైదిక స్మార్తులైన నరసాంబా సీతారామయ్య దంపతుకు నోము పంటగా రామశాస్త్రి జన్మించారు. వీరి పెద్దనాన్న యామవరం కృష్ణశాస్త్రి సదాచారవర్తి, గొప్ప సాహితీమూర్తి. ఆయన ఆచార్యత్వంలో సంతరింపజేసుకున్న స్ఫూర్తితో రామశాస్త్రిలో లలిత కవితాలతలు మొగ్గతొడిగాయి. అప్పుడాయన వయస్సు 12 సంవత్సరాలు. అనంతరం ఆయన జీవనం ఆనాటి కవి పండిత పోషణకు చిరునామా అయిన ‘దొంతి’ సంస్థానంతో అనుబంధం పెనవేసుకుంది.

ఆనాటి ‘దొంతి’ సంస్థానం పాండితీ ప్రకర్షలకు ఆలవాలంగా అవధానాది సాహితీ క్రీడకు రాజధానిగా రాణించింది. అటువంటి ‘దొంతి’ సంస్థానంలో ఆస్థాన పండితుగా ఉంటూ వేద సారస్వత వేదికలను నిర్వహిస్తూ ఉండే వేంకట పౌండరీక యజ్వ సన్నిధానంలో శిష్యునిగా చేరి శాస్త్ర కావ్యాలను సమగ్రంగా చదువుకొని, తన ప్రతిభకు పదునుపెట్టుకున్న రామశాస్త్రి 20 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి శ్లేష యమక చిత్ర బంధాది కవితా చమత్కారాల కల్పనలో ఆరితేరారు. సంస్కృతంలో, తెలుగులోను సమాన వైదుష్యం కలిగిన ఆయన అనర్గళమైన ఆశుధారతో ఉభయభాషల సవ్యసాచిగా కవితామార్గంలో పయనించారు. 20 ఏండ్ల ప్రాయంలోనే ‘గురుస్తుతి’ అనే శ్లేషయమక చిత్రాలతో కూడిన ప్రౌఢకావ్యాన్ని రచించి విద్వత్కవిగా విజ్ఞులచే విశేష ప్రశంసలందుకున్న రామశాస్త్రి, తెలుగువారి విలక్షణ సాహిత్యక్రీడ అయిన అష్టావధానంవైపు దృష్టిసారించి ఆ ప్రక్రియను అవోకగా నిర్వహించే నిపుణతను ఆపాదించుకున్నారు. ఉభయ భాషలలోను అష్టావధాన నిర్వహణ సామర్థ్యం సంతరించుకొన్న శాస్త్రి-దొంతి, యాదగిరిక్షేత్రం, చుంచనకోట`మొదలైనచోట్ల అవధానాలను నిర్వహించి పద్యభారతీ సేవలో పావన జీవనులయ్యారు. ఆయన`అవధాన పద్యాలలో/శ్లోకాలలో కూడా శ్లేషయమక వైచిత్రిని జొప్పించి సభను మెప్పించి ఒప్పించేవారు.

కాలానుక్రమంలో వారు గజవెల్లిలో స్థిరనివాస మేర్పరచుకున్నారు. వారికి శతావధాని, దేవీ ఉపాసకులు విఠాల  చంద్రమౌళి శాస్త్రితో ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది. చంద్రమౌళి శాస్త్రినుండి శ్రీవిద్యా మంత్రోపదేశం పొందిన రామశాస్త్రి కవితాపాటవానికి పారమార్థిక పరిమళాలు తోడయ్యాయి. ఆ నేపథ్యంలో వివిధ దేవతలపరంగా విశేషస్తోత్రాలను, మంగళహారతులను ఆయన రచించి ఆస్తిక మహాశయులకు పరమాన్నాన్ని పంచారు.

చుంచనకోట (చేర్యా మండలం) గ్రామంలో (విఠాల చంద్రమౌళి శాస్త్రిగారు స్థాపించిన) శ్రీ త్రిపుర సుందరీ మందిరంలో శ్రీరామశాస్త్రి, శతావధాని చంద్రమౌళి శాస్త్రి, గౌరీభట్ల రామకృష్ణశాస్త్రి (అష్టావధాని), గౌరీభట్ల రఘురామశాస్త్రి-నలుగురు కలిసి దేవీనవరాత్రి సందర్భంగా ఆశువుగా శ్రీరాజరాజేశ్వరీ స్తుతిని పద్యాలతో రసరమ్యంగా రచించి దేవికి భక్తి సమాహారంగా సమర్పించారు.

ఒకసారి ‘క్షీరసాగరం’ అనే గ్రామంలో అవధాని చివుకు అప్పయ్యశాస్త్రి, జానపాటి పట్టాభిరామశర్మ, వడ్డేపల్లి నరసింహాచార్యులు మొదలగు సాహితీ పారంగతులున్న సభలో, అలవోకగా అష్టావధానం చేసిన రామశాస్త్రిగారు ‘అవధాని వతంస’, ‘అభినవ తిక్కన’ అనే బిరుదాలను తన ప్రతిభా ప్రతీకలుగా పొంది తన తర్వాత అష్టావధానిగా రాణించిన గౌరీభట్ల రామకృష్ణశర్మకు మార్గదర్శకులయ్యారు.

మరొకమారు శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహాస్వామి సన్నిధిలో జరిగిన విద్వత్సభలో `సహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి సభాధ్యక్షలుగా ఉండి రామశాస్త్రి సుకవితా విన్యాసానికి హర్షించి ఆయనకు ‘శ్లేష యమక చక్రవర్తి’ అనే బిరుదాన్ని ప్రదానం చేసి ఘనసత్కారాన్ని అందించారు.

కవితాపథంలో పెద్దరికం వహించినా జీవితపథంలో పేదరికం ఆవహించడంవల్ల ఆయన రచించిన కొన్ని పుస్తకాలు ముద్రణకు నోచుకోలేదు. లక్ష్మీ సరస్వతులు ఒకచోట కలిసి ఉండవనే నానుడి కవిపండితుల విషయంలో సత్యదూరం కాదేమో!

విఠాల చంద్రమౌళి శాస్త్రి నుండి శంకర గీతాభాష్యాన్ని, వేదాంత పంచదశిని క్రమపాఠంగా నేర్చుకున్న రామశాస్త్రి చుంచనకోటలో తన జీవికకు సార్థక్యాన్ని సమకూర్చుకున్నారు. ఆయన రచించిన ఈ క్రింద పొందుపరచిన గ్రంథాలు సాహితీ భారతికి సుమగంధాలై, ఆతని అనల్పకల్పనా ప్రతిభకు అద్దం పడుతున్నాయి.

గురుస్తుతి: ఈ గ్రంథాదిలోని కవి విజ్ఞప్తిని బట్టి చూడగా, ఈ గ్రంథం 250 శ్లోకాలతో, నాలుగు భాగాలతో, 18 ఖండాలుగా విభజించబడి ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం లభ్యమవుతున్న పుస్తకాన్ని ఆధారం చేసుకొని చూస్తే కేవలం 109 శ్లోకాలు (శ్లేషభాగం) కనబడుతున్నాయి. మిగతా భాగాలు ముద్రణకు నోచుకోలేదని ఊహించవచ్చు. ఆనాటి శ్రీపాండురంగా ప్రెస్‌ క్షీరసాగర గ్రామంవారు ఈ కావ్యరాజాన్ని (109 శ్లోకాలతో) ముద్రణచేసి సాహితీ ప్రియంభావుకుల ముందుంచడం నిజంగా ప్రశంసాపాత్రం.

రామశాస్త్రి కవిత్వాన్ని గూర్చి చంద్రమౌళిశాస్త్రి అభినందిస్తూ చెప్పిన శ్లోకం చూస్తే ఈ కవి ప్రతిభా ప్రభ ఎలాంటిదో మనం తెలుసుకోగలం

క్వ రామసు కవేర్గిరాం కృతి రచింత్యవైచిత్య్ర భూ:
క్వ సంస్కృతి గతి: కృతే2ర్హ్యమతి చాపలో పక్రమా!
స్తుతౌ మమతు సంస్కృతి స్తుతి రివాదృతార్యైర్నకిం
హ్యనంతగుణ శాలిని త్వయి గిరాంధియో2గోచరే॥

ఆలోచనకందని అద్భుతాలకు నిలయమైన రామసుకవి కవితాధార ఎక్కడ? అల్పబుద్దినై చాపల్యముతో  ఈ గురుస్తుతిలోని శ్లోకాలకు భావాన్ని వ్రాయడానికి పూనుకున్న నా తెలివి ఎక్కడ? అయినను రజస్తమోమయ వృత్తులకు గోచరం కాని నీ విషయస్తుతి వలెనే ఈ గురుస్తుతి కూడా ఆర్యులచే ఆదరింపబడదా ఏమి? తప్పక ఆదరణీయమవతుందని అందలి భావం.

నానార్థాలు కలిగిన శబ్ధాలను ప్రయోగించడాన్ని ‘శ్లేష’ అంటారు. శ్లేషతో ఒకే శ్లోకంలో అనేకార్థలను స్ఫురింపజేయవచ్చు. పై నుదాహరించిన గురుస్తుతి నిండా శ్లేషచమత్కారాలు దండిగా ఉన్నాయి. ఈ కావ్యంలో-ఓంకారానికి, పంచభూతాలకు, సూర్య బృహస్పతులకు, బ్రహ్మరుద్రాది దేవతలకు, వసంతునికి, అష్టదిక్పాకులకు, దీపానికి, యజ్ఞాదులకు గురువుతో అభేదశ్లేషను విశేషించి చూపాడు కవి. అది ఎలాగో చూద్దామా!

‘‘ఉమాప్తాకార కలిత: శ్రుతిగోచరతామిత:
సద్వర్ణ: ప్రణవాభిఖ్య ఓంకారో గురురేవహి’’

ఉకార మకారములతో కూడిన అకారముతో (ఉమా ప్తాకార కలిత:) చెవికి గ్రహింపదగినదై (శ్రుతి గోచరతామిత:) ప్రణవమనుపేరుగల ఓంకారము గురువే అగునని ఓంకార సంబంధంగా అర్థము చెప్పదగును.

ఇక అదే శ్లోకంలో గురుపరంగా అర్థాన్ని ఆలోచిస్తే`‘‘పార్వతీపతి అగు శంకరుని ఆకారంగా చెప్పబడేవాడు (ఉమాప్తాకార కలిత:) వేదవాక్యాలకు గోచరుడును (శ్రుతి…. త:) ఉత్తమ జ్ఞానం కలవాడును (సద్వర్ణ:) కీర్తి మంతుడయిన గురువు ఓంకారమే అగును`అని అభేద శ్లేష ఇక్కడ స్పష్టము. మరొక శబ్దవైచిత్రిగ శ్లోకాన్ని గమనిద్దాం.

‘‘ఆచార్యాస్యార్య ఏవ త్వం సదాచారరహితో భవన్‌
స భవాన్‌ భగవానేవ గతో భేధ:సముత్థిత:!

వివరణ: ఓ ఆచార్యా! నీవు సదాచార వంతుకు ప్రియుడవు, పూజ్యుడవు. ఇటువంటి నీవు నిజంగా భగవంతుడవే. నీకు భగవానునికి భేదం తొలగిపోయింది. (గతో భేదస్సముత్థిత:) అని గురుపరంగా సామాన్యర్థం.

ఇక ఇందులో విశేషార్థమేమంటే ‘‘ఓ ఆచార్య అను పదమా! నీవు ‘చా’ అను అక్షరాన్ని వదిలి (సదా‘చా’ రహిత:) ఆర్య శబ్దార్హుడవగుచున్నావు. అనగా ఆచార్య పదంలోని ‘చా’ తొగితే ‘ఆర్య’ పదం మిగులుతుందని ఆంతర్యం. అట్లే ఆ భగవాన్‌ అనుపదం కూడా ‘గ’కార భేదం తొలగగా (‘గ’తో భేద: సముత్థిత:) భవాన్‌ (నీవు) అనే పదంగా మిగులుతుందని భావం.(భగవాన్‌లోని ‘గ’ తొగితే భవాన్‌ అనేది శేషం)

పై రెండు శ్లోకాలలోను అర్థంలో క్లిష్టత ఉన్నా చదవడంలో క్లిష్టత లేకపోవడాన్ని బట్టి కవియొక్క శబ్దాధికారాన్ని శైలీసారళ్యాన్ని పాఠకులు గ్రహించాలి.

ఇంకా, శ్రీ గణపతి చతుష్షష్టి పూజాగ్రంథములోని ఒక్క శ్లోకరత్నాన్ని ఆస్వాదిద్దామా!

వ్యాలంబ రోలంబ కపోలబింబ
హేరంబ! లంబోదర! కంబుకంఠ!
అంబా హృదంబూద్భవ భానుబింబ
కుంభాఢ్య! నీరజానమీశ! తేస్తు

పైవిధంగా లలిత పదాలంకృత కవి తా ధారతో గణేశునికి నీరాజనమిచ్చిన రామశాస్త్రిని, మెదక్‌ జిల్లా మట్టిలోని మాణిక్యంగా భావిస్తూ ఆ మహనీయ కవితామూర్తికి, శ్లేషయమక చక్రవర్తికి ఈ వ్యాసాభిముఖంగా సమస్త తెలంగాణ కవిజన నీరాజనాలర్పిస్తున్నది.

‘గురుస్తుతి’ కావ్యంలోని చిత్రభాగంలో రామశాస్త్రిగారు అనేకవిధాల బంధకవిత్వాన్ని రచించి తన అసమాన ప్రజ్ఞా ప్రాభవాన్ని చాటుకున్నారు. అష్టదళ పద్మబంధం, గోమూత్రి కాబంధం, చక్రబంధం, మహానాగబంధం మొదలైన బంధకవిత్వాల్ని వారు వెయించారు. అమోఘ పదసంపత్తి, అమేయమైన వ్యుత్పత్తి బంధ కవిత్వానికి కావలసిన సాధన సామగ్రి. అలాంటి సాధన సామగ్రి కరతలామలకంగా కలిగిన రామశాస్త్రి బంధ కవిత్వ కల్పనానల్పశక్తిని ఈ క్రింది మహానాగబంధంలో విశేషంగా వీక్షించవచ్చు.

‘‘జయంతి తే సుకృతినో రససిద్ధా : కవీశ్వరా:’’

‘‘మహానాగబంధం’’

పక్క బంధ చిత్రంలో ఇమిడి ఉన్న ఈ క్రింది శ్లోకాన్ని పరికిద్దాం. దీన్ని స్రగ్ధరా వృత్తమంటారు.

శ్లో॥ ప్రేమస్థేమాన మగ్య్రం శమదమదమధర్మాశయం నాశయంతం
ధీమద్ధామానమద్ధామదమతి మథనం క్షేమదం కామదగ్ధం
జ్ఞానధ్యానాక్షమిద్ధామగుణగురుముద్దామ సోమాననంతం
శ్రీశర్వాకారశస్తం నయమతిమభయం నౌమిహేమాదిముక్తం

శ్లోకభావము: ప్రేమస్థిరుడు, యోగబలంచే శమదమాలను (అంతరింద్రియ బాహ్యేంద్రియ విగ్రహ సామర్థ్యాలను) ఇచ్చేవాడు, అధర్మాశయాన్ని తొలగించేవాడు, విద్వాంసులకు స్థావరమైనవాడు, మదపూరితమైన బుద్ధిని తొలగించేవాడు, క్షేమదాత, కోరికలను దహించినవాడు, జ్ఞానధ్యాననేత్రాలు కలవాడు, మంచి గుణాలు కలవాడు, బంగారం మొదలైన ధనాది వ్యామోహాలనుండి విడిబడినవాడు, నీతిహితమైన బుద్ధిగలవాడు, అభయుడు, దివ్యశక్తిముఖుడు, శివాకారుడును అగు గురువుకు నమస్కరిస్తున్నాను.

గజిబిజిగా చుట్టచుట్టుకొని పడగవిప్పిన నాగుబాము ఆకారంపై బంధంలో మనకు కనిపిస్తుంది కదా! శ్లోకంలోని మొదటి అక్షరమైన ‘ప్రే’ పడగలోను, పడగకు సమంగా కనిపించే తోకలో శ్లోకంలోని చివరి అక్షరమైన ‘క్తం’ నిబద్ధమై ఉంది. పాముకు ఆధ్యంతాలైన తలతోకలలో శ్లోకంలోని ఆద్యంతాక్షరాలు (ప్రేక్తం) నిక్షేపించడం కవిశక్తికి, యుక్తికి నిలువెత్తు నిదర్శనం.

శ్లోకపాదాలలోని ఆద్యక్షరాలు (ప్రే, ధీ, జ్ఞా, శ్రీ) అలాగే అంతాక్షరాలు (తం, గ్ధం, తం, క్తం) నాగబంధం వెలుపలి గళ్ళలో ఉన్నాయి. ఇక శ్లోకంలో గుర్తుపెట్టిన అక్షరాలన్నీ పాదాలలోని సమాక్షరాలతో సహసంబంధం కలిగి ఉన్నాయి. ఉదాహరణకు మొదటి పాదంలోని రెండవ ‘మ’కారంతో రెండవ పాదంలోని 8వ అక్షరమైన ‘మ’ కారం సంబంధం కలిగి ఉంది. అట్లే మిగతా అక్షరాలను ఊహించుకోవాలి.

స్రగ్ధర వృత్తంలో 84 అక్షరాలు ఉంటాయి. కవిగారు ఈ బంధంలో 64 అక్షరాలే ఉపయోగించారు. వారి ప్రతిభావ్యుత్పన్నతకు ఇది పరాకాష్ఠ.

సూక్ష్మంగా పరిశీలిస్తే పై శ్లోకంలోని నాలుగు పాదాల గమన క్రమాన్ని ఆ చిత్రిత నాగబంధంలో గమనించడం సహృదయాలకు తేలికే.